Friday 25 March 2016

నాన్న

నాన్న
అమ్మ అనే రెండక్షరాల కమ్మని పిలుపులో అనురాగము ఉంది,
నాన్న అనే రెండక్షరాల పిలుపులో నాది అనే అధికారం ఉంది ,
అప్పటివరకు అమ్మకే పరిమితమైన నాన్న ప్రేమ ,
నేను పుట్టగానే నా సొంతమయింది,
తన తల్లిని ,తన కూతురి లో చూసుకొని మురిసిపోయే ,అల్ప సంతోషి నాన్న,
బంధాలను,అనుబంధాలను సమతూకముగా నిలబెట్టే ప్రజ్ఞాశీలుడు నాన్న,
జన్మతహ నాన్న,విజ్ఞతహ గురువు,కౌమారతహ స్నేహితుడు ‘’నాన్న’’,
బార్య బిడ్డల కొరకు అలుపెరుగక అహర్నిసలు శ్రమిస్తారు నాన్న,
తన బిడ్డలకు మంచి ఆదర్శ వ్యక్తి నాన్న,
కూతురు నాన్న లాంటి భర్తను కోరుకునేంత ఉన్నత భావాలు కల వ్యక్తి నాన్న,
నాన్న అనే పిలుపు తప్ప ఏమీ ఇవ్వలేని మాకోసం,
తన జీవితన్నే ధారపోసిన మహోన్నత వ్యక్తి నాన్న,
భగవద్గీతలో గీతోపదేశం అర్జునుడికి ఎటువంటిదో,
జీవితంలో అన్ని సమయాలలో ,అంతటి మహత్తరమైనవి నాన్న పలుకులు,
నాన్న రక్షణ,కర్ణుడి కవచకుండలాలు లాంటివి,
ఇవ్వడమే తప్ప ఏమి ఆశించని నిస్వార్దపరుడు నాన్న,
ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేని ఋణం ‘’నాన్న ప్రేమ ‘’.                                                                    *******************                                           
ఈ కవిత అచ్చంగా తెలుగు అనే పత్రికలో ప్రచురింపబడింది ,మార్చి 23, 2016 సంచికలో                                                       http://acchamgatelugu.com/%e0%b0%a8%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-2

Wednesday 9 March 2016

అర్దరాత్రి

అర్దరాత్రి
ఒకప్పుడు ఎంతో ప్రశాంతముగా ఉండేది ,
ఎంతో ఆనందముగా ఉండేది ,
ఏకాంతముగా ఉండేది ,నిశ్శబ్దముగా ఉండేది,
సూది పడినా ఉలిక్కిపడేది ,
తనని తాను తలచుకొని గర్వపడేది ,
తనంత అదృష్టవంతురాలు ఎవరులేరనుకునేది ,
తాను మాత్రమే కాక అందరికీ ప్రశాంతతను,ఆరోగ్యాన్ని ఇస్తున్నానని తనలో తానే సంతోష పడేది ,
కాని ఆ అర్దరాత్రికే దిష్టి తగిలింది ,
ఆ ఆనందము,ఏకాంతము,ప్రశాంతత అన్నీ మాయమయిపోయాయి ,
షికారు కోసం  పాపం, రోడ్డు మీదకి వెళ్లింది అర్దరాత్రి ;అక్కడ వాహనాల హోరు,కుక్కల అరుపులు,
పరుగెత్తుకొని ఒక ఇంట్లో దూరింది,అక్కడ మొబైల్ ఫోన్ల మెసేజెల కిచకిచలు ,మాటలు.
పక్కన బార్యభర్తల మద్య ప్రశాంతత వెతుక్కుంది ,కానీ అక్కడ గొడవలే ;పొలాల వైపు పరుగెత్తింది ,అక్కడ నీళ్ళ మోటర్ల శబ్దాలు,
లాభం లేదని ,ఎత్తయిన భవనాల వైపు పరుగు తీసింది ;అక్కడ సెల్ టవర్ల వైబ్రేషన్లు ,బార్లలోన ,క్లబ్బులలోన ,ఇలా ఎక్కడ చూసినా శబ్దాలే ,అర్దరాత్రికి నిశ్శబ్దమే కరువయ్యింది.
అరణ్యానికి వెళ్లింది, అక్కడ మానవుడు చెట్టులు ,కొండలు కొట్టి బిల్డింగులు కట్టేశాడు.
అర్దరాత్రి దిగులు పడింది ,తనకి రోజులు అయిపోయాయని ,మౌనము గా ఈ దేశాన్ని వదిలి దూరముగా వెలిపోదామని అనుకుంది, వెళ్లిపోయింది మనందరిని వదిలి,కాదు మనమే దూరం చేసుకున్నాము,అర్దరాత్రిని,నిశ్శబ్దాన్ని,ప్రశాంతమయిన నిద్రను ,జీవితాన్ని........                      *****************

ఈ కవిత సుజనరంజని అనే అంతర్జాల పత్రిక లో ప్రచురింపబడినది ,మార్చి 2016 సంచికలో

http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/march16/