Saturday 25 March 2017

మానసిక ఒత్తిడి


మానసిక ఒత్తిడి , మానసిక వేదన ,ఇది ఏ ఒక్క వ్యక్తి సమస్య కాదు ,నేటి సమాజములో చిన్న పిల్లవాడు మొదలు నా వరకు అందరూ అనుభవిస్తున్న వేదనే .అసలు ఏమిటి ఈ మానసిక ఒత్తిడి ?మా తాతగారి నోట నేనెపుడూ వినలేదే .అరవై ఏళ్ల క్రితం దీనికి రూపమే లేదు. కానీ, నేడు ఎవరి నోట విన్నా కుటుంబానికి కనీసము ఒకరు ఖచ్చితముగా ఈ సమస్య తో బాధపడుతున్నారు ముఖ్యముగా ఆర్జించేవారు.
నా వరకు వస్తే కాని మానసిక ఒత్తిడి అంటే అర్ధం తెలియలేదు. అసలు ఆ ఒత్తిడి లో ఉన్నానన్న విషయమే నాకు స్పురించలేదు అయితే ఈ సమస్యకు పరిష్కారమే లేదా?మందుబిల్లలే పరిష్కారమా! ఎంతకాలము .........ఈ ప్రశ్నలన్నీ నన్ను నిలువనీయలేదు ........రాత్రి,పగలు ఆలోచించాను,సమస్య అర్ధమయింది. నెమ్మదిగా మనసు స్థిమితపడింది.
ధ్యానము చేశాను సమస్యకు మూలాన్ని కనుగొన్నాను పరిష్కారాన్ని తెలుసుకున్నాను అమలు పరిచిన తరువాత నన్ను నేను తలచుకుని నవ్వుకున్నాను ఇంత చిన్న సమస్య కా నేను ఇంత ఒత్తిడికి లోనయ్యాను నా వలన నా భర్త
పిల్లలు వేదనకు గురయ్యారు .ఇప్పుడు నేను సంతోషముగా ఉన్నాను .
నా అనుభవాలను,పరిశీలనలను మీ అందరితో చర్చించాలని ఈ వ్యాసము వ్రాస్తున్నాను.
నేడు అందరూ ఎదుర్కుంటున్న సమస్యల లో కొన్నింటిని పరిశీలిద్దాము.
ఒకప్పటి ఉమ్మడి కుటుంబాల స్థానము లో నేడు ఒంటరి కాపురాలు చోటుచేసుకున్నాయి. ఉమ్మడి కుటుంబము లో సమస్య వస్తే పరిష్కారానికి అందరూ ప్రయత్నించేవారు, సంపాదించేవారు ఎక్కువే ,కానీ నేటి కుటుంబాలలో సమస్యా భారం మొత్తం ఒక్కరిదే అందుకే ఒత్తిడికి లోనవుతున్నారు. అయితే పరిష్కారము లేదా,ఉమ్మడికుటుంబమే పరిష్కారమా?కాదు మనం అలా అనుకోకూడదు మన సమస్య ఉన్న చోటే పరిష్కారము కూడా ఉంటుంది.
కుటుంబములో నలుగురు ఉన్నారు.అందులో సంపాదించేవారు ఒక్కరే అయితే ,మిగిలిన వారు సంపాదించే స్థోమత ఉన్నవారయితే వారికి కూడా పని చేయమని చెబుదాము లేదా ఉన్నంతలో సర్దుకుపోదామని వివరిద్దాము. వారము మొత్తము వంటరిగా మనమే కాలము గడపకున్న ఒక్క రోజు మన కుటుంబ సభ్యులందరిని కలిసి వాళ్ళతో గడుపుదాం. మన కష్టసుఖాలను వాళ్ళతో పంచుకుందాము ,అప్పుడు మన మనస్సు తేలిక పడుతుంది.కేవలము మనము మాత్రమే హోటల్ కి లేదా సినిమాలకి వెళ్ళి కాలము గడిపే కన్నా అమ్మానాన్న,నాన్నమ్మతాతయ్య ఇలా ఎవరు వీలయితే వాళ్ళను కలుద్దాము ,లేదా వాళ్ళను మన ఇంటికి పిలుద్దాము. కొన్నిసార్లు ఇలా ప్రయత్నిద్దాము ఫలితము తప్పక ఉంటుందని నా నమ్మకం
అలాగే చదువు కుంటున్న పిల్లల్లో కూడా చాలా మంది ఈ ఒత్తిడికి గురవుతున్నారు.మన చిన్న తనములో చదువుతో పాటు ఆటలు ఆడుకునేవాళ్ళము, స్నేహితులతో కాలము గడిపేవాళ్లం ,కానీ నేడు పిల్లలకి చదువుచదువు అని పాఠశాలలోన ,మనము ఇంట్లోన ఒత్తిడి చేస్తున్నాము. పాఠశాలలో ఆడడానికి స్థలము కూడా ఉండడము లేదు.అయితే దీనికి పరిష్కారము మనమే పరిశీలిద్దాము ,ఈ పోటీ ప్రపంచములో మన పిల్లలు బాగా చదువుకోవాలని ఆశిస్తాము కానీ చదువుతో పాటు కొన్ని కొన్ని మార్పులు చేసి వాళ్ళ వ్యక్తిత్వ వికాసం వికసింప చేద్దాము ,సెల్ ఫోన్లలో ఆటలాడే మన పిల్లలని బయటకి పంపించి ఆడమని ప్రోత్సహిద్దాము ,వాళ్ళని స్నేహితులతో గడపనిద్దాము వాళ్ళ చదువు పాడవుతుందనే ఆలోచన పక్కన పెట్టి మనతో పాటు అన్ని శుభకార్యాలకు తీసుకు వెళదాము ,పిల్లల కోసం తమ సంతోషాలను ఆపుకుని ఎక్కడికి వెళ్లకుండా ఉన్నవారు మన లోనే చాలామంది ఉన్నారు,ఈ ధోరణి మార్చుకొని అన్నింటికీ కాకపోయిన వీలయిన వాటికి పిల్లలని తీసుకువెళదాము మనము ఆనందిద్దాము అప్పుడే మన పిల్లలకి నలుగురితో కలివిడిగా ఎలా ఉండాలి ,కష్టసుఖాలు అన్నీ అవగతమవుతాయి .
ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఒత్తిడి చర్చిద్దాము.నేడు ఈ సమస్య చాలా ఎక్కువ ఉందనే చెప్పాలి,ఒకప్పుడు భర్త సంపాద న కు బయటకు వెళితే భార్య ఇంట్లో ఉంటూ సంసారాన్ని చక్కదిద్దుకునేది ,కానీ నేటి కాలము లో అలా కాదు భార్యాభర్త ఇరువురు సంపాదిస్తే కానీ ఐదువేళ్ళు నోటిలోపలికి వెళ్లలేని పరిస్థితి ,అందువలన భార్య పై ఒత్తిడి పెరిగి వైవాహిక జీవితము ప్రభావిత మవుతుంది, మరి ఎలా ?.............., వారానికి ఐదు రోజులు పని చేద్దాము,మిగిలిన రెండు రోజులు ఎక్కడికో దూరపు ప్రాంతాలకో విహారయాత్రలకో మాల్స్ కో వెళ్లకుండా ఒక రోజు పిల్లలతో గదుపుదాము ఒక రోజు భార్యాభర్త ఇరువురు మనసు విప్పి మాట్లాడుకోవడానికి ప్రయత్నిద్దాము, ఒకరి అభిరుచులను ఒకరు గౌరవిద్దాము మనసెరిగి మనుగడ సాగిద్దాము వారాంతములో ఒకరికి ఒకరు ఎదురయిన సమస్యలు చర్చించుకుని ఒత్తిడిని దూరము చేసుకుందాము, పెళ్లిరోజులకి పుట్టిన రోజులకి హోటళ్లలో కాకున్నా ఆత్మీయుల మద్య జరుపుకుందాము.
చదువుకునే పిల్లలకు, తల్లితండ్రులకు మధ్య సరైన అవగాహన లోపించడము వలన పిల్లలు మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారు, తోటి పిల్లలతో పోల్చి ‘’ప్రక్కింటి శర్మ గారి అమ్మాయిని చూడు 98% మార్కులు తెచ్చుకుంది ,నీ సునీత అత్త కొడుకుని చూడు వాడికి ఐ‌ఐ‌టిలో సీటు వచ్చింది “...ఇలా చాలా రకాలుగా వారి మీద ఒత్తిడి తీసుకువస్తున్నాము, వారి ప్రజ్ఞాలబ్ధి [ఐ.క్యూ ]పరిగణలోకి తీసుకోకుండా ఇది చదువు,ఇలా చదువు అని మన అభిప్రాయాలను అమాంతం ఆ పసివాళ్ళ మీద ఒత్తిడి తీసుకువస్తున్నాము,ఈ సందర్భాలలో ఆ పసిమనసులు ఎంతో వేదనకు గురి అవుతున్నాయి .తల్లితండ్రులుగా మేము అన్ని సౌకర్యాలు కల్పించి చదువుకోమని ప్రోత్సహిస్తుంటే ఎందుకు చదవరు అని మనము బాధ పడుతూ పిల్లల్ని బాధ పెడుతున్నాము,మా చిన్తతనములో ఇలా ఉండేవాళ్లం,అలా చదివేవాళ్లం అని వాళ్ళని ఒత్తిడికి గురిచేస్తుంటాము ,దాని ప్రభావము వాళ్ళ ఎదుగుదలకు అవరోధాన్ని కలిగిస్తుంది
తల్లితండ్రులుగా మనము నేటి పరిస్థితులను,పిల్లల మానసిక స్థితిని ఎరిగి కొన్ని మార్పులు చేసుకుంటూ, పిల్లలలో మార్పును తీసుకురాగలము, చిన్నిచిన్ని ప్రయత్నాలు చేసి వాళ్ళ మానసిక ఒత్తిడిని దూరము చేద్దాము, మన చేతి కున్న ఐదు వేళ్ళు ఒకేలాగా ఎలాగయితే ఉండవో మనిషి మనిషి కీ మధ్య ఆలోచనా పరిజ్ఞానము,శక్తి సామర్ధ్యాలు వేరువేరుగా ఉంటాయి. కనుక ప్రప్రధమ ప్రయత్నముగా పిల్లలని వాళ్ళ తోడపుట్టిన వాళ్ళతో సహా ఎవరితోనూ మనము పోల్చవద్దు ,కానీ ‘’నువ్వు చెయ్యగలవు, నీలో ఆ శక్తి ఉంది,నాకు నీమీద నమ్మకం ఉంది’’ ఇలాంటి ఉత్సాహపరిచే మాటలతో వాళ్ళని ప్రోత్సహిద్దాము .
పిల్లలు చదువులోనే కాదు వివిధ రంగాలలో ఆసక్తి కనబరుస్తుంటారు,నలుగురిలాగానే నీవు అదేబాట లో వెళ్ళు అనేకన్నా వాళ్ళు నచ్చిన రంగములో వాళ్ళ ప్రతిభను కనబరిచే అవకాశము ఇద్దాము ,చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసము చాలా అవసరము, ఈ పోటీ ప్రపంచములో పిల్లలు ఎంత పరుగెడుతున్నారో అనే అంశము కన్నా ఎటువైపు పయనము సాగిస్తున్నారో అనే అంశానికే ప్రాధాన్యతను ఇద్దాము.
ఈవిధముగా ఒత్తిడి దూరము చేసుకోవడానికి మన వంతు ప్రయత్నిద్దాము మానసికఒత్తిడి పై విజయము సాదిద్దాము.

ఈ వ్యాసము సిరిమల్లె .కామ్ అనే అంతర్జాల పత్రికలో ఫిబ్రవరి నెల,2017 న ప్రచురితమైనది.

కర్తవ్యము

కర్తవ్యము

కడలి కన్నీటికి బెదిరితే , నావ ఆటుపోటుకి అదిరితే
అమృతం మరణానికి భయపడితే , వాయువు తుఫానుకి జంకితే
పురి విప్పి నాట్యమాడిన మయూరము వేటగాని మాటుకి నక్కితే
సూర్యుడు తన వేడిమి తాళలేక మేఘాల చాటున దాగితే
చందమామ వెన్నెల కు వణికితే,
నక్షత్రాలు తమ వెలుగు కాంచలేక తామే కనులు మూసుకుంటే
పుష్పాలు తమ జీవిత కాలము ఒక దినమేనని నిరాశకు గురైతే
చెట్లు తమ ఉనికిపై సందేహముతో చిగురించడము మానివేస్తే
అందమైన కలువ పువ్వులు బురదను చీదరించుకుంటే
ఋతువుల ఆగమనం అకాల వైపరీత్యాలకు భయపడి నిలిచిపోతే
తమ మకరందాన్ని దోచుకుంటారని తేనెటీగలు యోచిస్తే
వాన తాను కురిసే నేల బాగులేదని మార్గమద్యం లోనే ఆగిపోతే
నిప్పు తనని దుర్వినియోగపరుస్తున్నారని రాజుకోకుంటే .......
ఏమవుతుంది ఈ లోకము మరి మనిషి ప్రకృతి పట్ల తన కర్తవ్యమును విస్మరిస్తే ............ ప్రవీణ.


ఆమె

గుండె లోతులోనుండి ఉబికి పైకి వస్తున్న ఆవేధనను,
ముని పంటి కింద అణిచి పెట్టి మౌనముగా భాదను,
లోలోపలే సహిస్తున్న ఆమె కనుపాపలు,
నడి సంధ్రములో మునిగి ఊపిరాడక ,
ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైనము లో,
కనురెప్ప వాల్చితే రాలే కన్నీటిని సైతం,
తనలో ఐక్యం చేసుకుంటున్న భూమాత,అతివ సహనము,
మీయిరువురికి సాటిరారెవ్వరు...................
ప్రవీణ మురళి.

ప్రకృతి


ప్రభాతసమయాన నీలి ఆకాశములోని
శ్వేత వర్ణపు మబ్బులు అలా అలా విహరిస్తూ
ఆనందములో తేలియాడుతున్నాయి
అంతలోనే భగభగ మంటూ ఉషోదయ
సూర్యుడు ప్రకాశించాడు
ఇంకేముంది భానుడి వేడికి
తెల్లని మబ్బులు కాస్తా నల్లగా మారి
నక్కి నక్కి దాక్కున్నాయి
సాయం సంధ్యా సమయమయ్యింది
వేడి బుసలు నిప్పులు వెదజల్లిన
భానుడు అలసి సొలసి
ఆకాశములో కనుమరుగయ్యాడు
విచారముగా బాధ లో ఉన్న కారు మబ్బులు
అన్నీ తమ బాధను వెలిబుచ్చుకోవటానికి
ఒకే చోట చేరుకున్నాయి
అలా అన్నీ ఒక చోట చేరి తమ మనసులోని
బాధను వెలిబుచ్చగానే మేఘాల నుండి
కన్నీళ్లు జలజల నేలపై చినుకులై రాలి
వానగా నేలపై కురిసింది
నేల తల్లి మురిసింది
పచ్చని చెట్లు వానలో తడిసి
స్నానమాడి చల్లటి గాలులతో
ఊయలూగ సాగాయి
పక్షుల కిలకిల రావాలతో
ప్రకృతి శోభాయమానమయ్యింది
తేలిక పడిన మనసుతో
కారు మబ్బులు తమ శ్వేత వర్ణాన్ని
దరించి గగనములో ఆనందముగా
విహరించసాగాయి.
ప్రవీణ.



స్వప్నం

ముట్టుకుంటే మంచులా కరిగిపోతుంది
కనులు తెరచి చూస్తే కనుమరుగవుతుంది
ఆస్వాదిద్దామంటే ఆటంకము ఎదురవుతుంది
అయినా పిలవని అతిధి లా వచ్చే స్వప్నాలను ఆపలేముకదా!
ప్రవీణ.

తల్లి ప్రేమ

తల్లి ప్రేమ


                                           నా కోసము నీవు తొమ్మిది మెట్లను ఎక్కావు,                                         
అన్ని మెట్లలో నీకు నేను సహకరించాను,
కాని చిట్టచివరి మెట్టులో నేను నీకు సహాయపడలేక ,
నీవు పడుతున్న భాద నేను భరించలేక,చేయూతనిద్దామని ,ఒడిలోకి చేరాను,
నేను నీకు చేయూతనివ్వలేక పోగా సేవలందించుకున్నాను,
అప్పటికీ నీవు నా మీద కోపగించక అక్కున చేర్చుకున్నావు,
నీ హృదయ వస్త్రంలో నా తనువును దాచావు,
తల్లి ప్రేమ అనే పాఠశాల లో నీకు నేను విధ్యార్దినయ్యాను,
నీ గుండె మీద నాకు నడక నేర్పావు,
నా నోట ‘’అమ్మ’’ అన్న తొలి పలుకు విన్న నీ ఆనందం వర్ణనాతీతం,
నా తప్పటడుగులను,తప్పిదాలను సరిదిద్దావు ,
నాకు తల్లివై,గురువిణి వై ,స్నేహితురాలివై అన్నీ వేళలా సన్మార్గము లో నడిపించావు,
నా జీవితానికి వేసావు బంగారు బాట,
తల్లిప్రేమను వర్ణించడానికి సాటిరాదు ఏ భాష.....,
నీ ‘’తల్లి ప్రేమ’’ కు నా పాదాభివందనములు 

బంధాలు

బంధాలు


బంధాలలో బందీనైపోయానని విచారించకు
బంధాలను బహుమతులుగా స్వీకరించు
బాధ్యతలను స్వీకరించే వ్యక్తి హృదయాన్ని పలకరించి చూడు ,
నిజమైన ఆనందాన్ని నీకు పరిచయం చేస్తాడు

పలకరింపు

ఇంజనీరింగు కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న కమల్ తన విధులను నిర్వర్తించి ఇంటికి చేరుకున్నాడు.కాలింగ్ బెల్ మోగగానే ,కమల్ భార్య పుష్ప ‘’బాబు అనిల్ తలుపుతీయమ్మా నాన్న వచ్చేశారు’’ అని వంట గది లోంచి అరిచింది.
“అబ్బా! ఏంటమ్మా ఎప్పుడూ ఆట మధ్యలో పని చెబుతావు’’ అని విసుగుకుంటూ,సెల్ ఫోన్ ని చేతిలో పట్టుకొని అందులో ఆటలు ఆడుకుంటూ తలుపు తీశాడు అనిల్.
లోపలకి వస్తూ కమల్ పదవతరగతి చదువుతున్న తన కొడుకుని “ఎలా చదువుతున్నావు అనిల్’’,అంటూ ఇంకా ఏదో అడగబోతుంటే, అంతా ఒకే డాడీ అంటూ దించిన తల ఎత్తకున్నా సెల్ లో ఆటలు ఆడుతూ సమాదానమిచ్చాడు.
ఇంక ఆరవ తరగతి చదువుతున్న తన చిన్న కొడుకు సునీల్ టి‌వి లో వస్తున్న కార్టూన్ షోని చూస్తూ, తండ్రి రాకనే గమనించలేదు.
కాఫీ పెట్టమంటారా! అంటూ వంట గదిలోంచి వచ్చి కమల్ చేతిలోంచి బ్యాగ్ తీసుకుంటూ అడిగింది పుష్ప.
కాఫీ పెట్టమని చెప్పి ,బ్యాగ్ ను భార్యకు అందించి,స్నానము చేసి,గదిలో మంచము మీద నడుము వాల్చాడు కమల్.
పుష్ప కాఫీ తెస్తుందని ఎదురు చూస్తూ చిన్న కునుకు తీశాడు కమల్.
హఠాత్తుగా “ఏమండీ , ఏమండీ” అన్న పిలుపుతో ఉలిక్కి పడిలేచిన కమల్ కి ఎదురుగా కాఫీ కప్పుతో నిల్చుని కనిపించింది పుష్ప.
కాఫీ ని కమల్ కి అందిస్తూ “కాఫీ తేవడం కాస్త ఆలస్యమయ్యేసరికి అలా నిద్రపోతే ఎలాగండి,నేను పనిలో పడి మరిచిపోయాను,మీరైన కాస్త వంట గది లోకి వచ్చి అడగవచ్చు కదా!అలా ఈ గదిలోనే ఉండక పోతే’’అన్న భార్య మాటలు విన్న కమల్ విరక్తిగా ఒక నవ్వు నవ్వి కాఫీ అందుకుని తాగేసాడు.
మారు మాట్లాడకున్నా మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. “ఏమయ్యింది ఈయనకి’’ అని గెడ్డము మీద చెయ్యివేసుకుని ఆలోచిస్తూ వంట గదిలోకి వెళ్ళిపోయింది పుష్ప.
పుష్ప,కమల్ లది చూడముచ్చటైన జంట. పుష్పని బంధువుల పెళ్ళిలో కమల్ చూసి ఇష్టపడి పెద్దలతోతన మనసులోని మాటను చెప్పి, సంబంధం కుదుర్చుకుని పుష్ప అంగీకారముతో ఆమెను వివాహమాడాడు. చూడడానికి ఇది పెద్దలు కుదిర్చిన వివాహమైన,ఒక రకముగా ప్రేమ వివాహమనే చెప్పాలి,ఎందుకంటే బందువుల పెళ్ళిలో కమల్ చూసిన ఓరచూపులు ఆమె మనస్సుని కూడా తాకాయట, పెద్దల ద్వారా కమల్ సంప్రదించడం అన్నీ నచ్చి పెళ్ళికి అంగీకరించాను అని చెప్పింది పుష్ప వివాహమైన తరువాత కమల్ తో.
కమల్ చదువులో మంచి ప్రావీణ్యుడు. బి.టెక్,ఎమ్.టెక్ పూర్తి చేసి ఉపాధ్యాయ వృత్తినే ఎంచుకుని ఒక ఇంజనీరింగు కళాశాలలో ఉపాధ్యాయుడుగా చేరి,తరువాత పుష్పను వివాహమాడి,ఆమె సహకారముతో పీ హెచ్ డి డిగ్రీని పూర్తి చేసి తన వృత్తిలో అంచెలంచెలుగా ఎదుగుతూ అనతి కాలములోనే ఇంజనీరింగు కాలేజీకి ప్రిన్సిపాల్ స్థాయికి ఎదిగిపోయాడు కమల్.
పుష్ప రాత్రి వంట చేస్తూ ఇలా ఆలోచించసాగింది “ఈ మద్యన ఈయన ఎందుకు చాలానీరసముగాఉంటున్నారు.ఇదివరకటిలా హుషారుగా లేరు.నాతో కూడా సరిగ్గా మాట్లాడడము లేదు.కాలేజీ లో ఏమయినా సమస్య వచ్చిందా! ఎందుకంటే ఇంజనీరింగు కళాశాలకి ప్రిన్సిపాల్ కదా!విద్యార్ధులతో ఏమయినా సమస్యలున్నాయా,లేకపోతే సిబ్బందితో ఏమైనా ఇబ్బందులా,యాజమాన్యముతో ఏమయినా............,లేదు లేదు అలాంటివి ఏమయినా ఉంటే ఖచ్చితముగా నాతో చెబుతారు.మరి ఏమయింటుండబ్బా!ఈమద్యన మా అమ్మ కూడా ఒకసారి నాతో ఫోన్ లో చెప్పింది అల్లుడు గారు ఇదివరకటిలా హుషారుగా లేరు,మీ ఇద్దరి మధ్యన ఏమయినా గొడవ జరిగిందా అని....,అలాంటిది ఏమి లేదమ్మా అని అమ్మ కి సర్ది చెప్పాను కానీ,ఇప్పుడనిపిస్తుంది ఈయన చాలా రోజుల నుండి దిగులుగా ఉంటున్నారు. ఈ రోజు రాత్రికి మావారితో మాట్లాడాలి” అని అనుకుంటూ వంట పని ముగించి, చిన్నోడికి ఏదో ప్రోజెక్ట్ ఉందంట స్కూల్లో ఇచ్చారంట,వాడికి ఆ పనిలో సహాయము చేసేసరికి ఇంకేముంది బోజనాల సమయమయ్యింది.
పిల్లలిద్దరికి అన్నము వడ్డించి,కమల్ ని కూడా బోజనానికి పిలిచింది.పుష్ప పిలిచిన కాసేపటికి కమల్ హాల్లోకి వచ్చి బోజనము చేసి మళ్ళీ తన గది లోకి వెళ్లిపోయాడు.
పుష్ప తన పనులను త్వరగా ముగించుకుని,పిల్లలిద్దరూ పడుకున్నాక అన్ని తలుపులు వేసేసి,గదిలోకి వెళ్ళేసరికి కమల్ టి‌వి చూస్తూ కనిపించేసరికి మనసులో హమ్మయ్య ఈయన మేల్కొనే ఉన్నారు అని ఊపిరి పీల్చుకుంది. పుష్ప కమల్ పక్కన కూర్చుంది ,భార్య రాకని గమనించిన కమల్ ఒక చిన్న అరనవ్వు నవ్వాడు. బదులుగా పుష్ప కూడా ఒక చిరు నవ్వు నవ్వి “ఏమయిందండి ఎందుకలా ఉంటున్నారు?ఆరోగ్యము బాగులేదా?కాలేజీ లో ఏమయినా సమస్యాలా?నా వలన ఏమయినా పొరపాటు జరిగిందా?” ఇలా చాలా ప్రశ్నలు వేసింది.
“నేను బాగానే ఉన్నాను.నాకు ఎటువంటి ఇబ్బందులు లేవు’’ అని సమాదానమిచ్చి కమల్ పడుకుండి పోయాడు.
చేసేది ఏమీ లేక పుష్ప కూడా నిద్రలోకి జారుకుంది. తెల్లవారింది ఎప్పటిలాగే ఎవరి పనులలోకి వాళ్ళు జారుకున్నారు.
ఇలా కొన్ని రోజులు గడిచాయి. కమల్ లో ఎటువంటి మార్పు లేదు.పుష్పకి దిగులు వేసింది.ఎంతో చలాకీగా హుషారుగా ఉండే భర్త ఇలా విచారముగా ఉండడము.తనకేమీ అర్ధము కాక లోలోపలే మధన పడసాగింది పుష్ప. ఒక్కోసారి విపరీతమైన కోపముతో పిల్లవాడిమీద కూడా చేయి చేసుకోబోయి మళ్ళీ తనని తాను తమాయించుకుంది.
ఒక రోజు కమల్ తో “ఏమండీ ఏదయినా ఆరోగ్య సమస్య అయితే డాక్టర్ ని కలుద్దామా’’ అని అడిగింది
“నేను బాగానే ఉన్నానుగా డాక్టరు దగ్గరకు ఎందుకు,అయినా పదే పదే నువ్వు ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నావు.నాకు ఆరోగ్యము బాగులేక పోతే నీకు చెప్పనా?,చిన్న పిల్లవాడిని అడిగినట్లు నన్ను అడుగుతున్నావు నువ్వు’’ అని కమల్ అనేసరికి పుష్పకి ఏమి సమాధానము చెప్పాలో అర్దము కాక ఊరుకుంది.
కమల్ ,పిల్లలు వెళ్ళిన తరువాత పనులన్నీ పూర్తి చేసుకుని కాస్త నడుము వాల్చి ఇప్పుడు ఏమిచేయాలి అని కమల్ గురించి ఆలోచిస్తూ ఉండగా, ఫోన్ రింగవడముతో ఎవరైఉంటారనుకుని ఫోన్ చూసేసరికి తన స్నేహితురాలు విమల చేసింది. ఆమెతో మాట్లాడుతుందే గాని ఆలోచనలు మాత్రం కమల్ చుట్టూ తిరుగుతున్నాయి.
అది గమనించిన విమల “ఏమయిందే పరధ్యానముగా ఉన్నావు’’ అని అడిగేసరికి పుష్ప “ఏమీ లేదే అని ఇంకేమిటి సంగతులు’’ అని మాట్లాడి ఫోన్ పెట్టేసింది పుష్ప.
విమలకి అనుమానము వచ్చింది ఏదో జరిగింది పుష్పకి,లేకపోతే ఇలా మాట్లాడదు తను,పుష్ప తన చిన్ననాటి స్నేహితురాలు,ఇద్దరి వివాహాలు వాళ్ళు పుట్టి పెరిగిన ఊర్లలోనే జరిగాయి.ఇద్దరి అత్తగార్లది ఒకే ఊరు అయిన కమల్ ఉధ్యోగ రీత్యా పుష్ప సొంతఊరికి దూరముగా వెళ్ళిపోయారు,విమల భర్త వ్యాపారము అవడము వలన అదే ఊరిలో ఉండి పోయారు.అందుకే పుష్ప గురించి విమలకి బాగా తెలుసు.ఏదయినా సమస్య ఉంటే తనలోనే భాదపడుతుంది,లేదా తానే పరిష్కరించుకుంటుంది తప్ప ఎవరికి చెప్పదు,ఎవరిని ఇబ్బంది పెట్టదు.అయితే ఈ మధ్య వాట్స్ ఏప్ లో కూడా మెసేజులు పుష్ప పెట్టక పోవడముతో ఏమయింది అని తెలుసుకోవడానికి కాల్ చేసింది విమల.
ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత,ఒక రోజు కమల్,పిల్లలు అందరూ వెళ్లిపోయాక కూర్చుని పేపర్ చదువుతున్న పుష్ప కాలింగ్ బెల్ మోగేసరికి ఇప్పుడెవరైఉంటారబ్బా అని తలుపు తెరిచే సరికి ఎదురుగా విమల తన భర్తతో ప్రత్యక్షమైంది. ఇంక ఆశ్చర్యపోవడం పుష్ప వంతయింది.
“ఇక్కడే నిలబెడతావా లేక లోపలకి పిలిచేదెమయిన ఉందా అన్న విమల మాటతో ఒక్కసారి ఉలిక్కిపడిన పుష్ప “క్షమించండి’’ అని చెప్పి కంగారుగా ఇద్దరినీ లోపలికి తీసుకువెళ్లింది.
“ఏమిటే ఇలా హఠాత్తుగా చెప్పా పెట్టకుండా వచ్చేసింది అని అనుకుంటున్నావా!,ఏమి చెయ్యను నువ్వు ఫోన్ లో సరిగ్గా మాట్లాడడం లేదు కదా!అందుకే విషయం తెలుసుకుందామని నేరుగా వచ్చేశాను’’ అని విమల అనేసరికి పుష్ప కంగారుగా,ఏమి చెప్పాలో తెలియక బిత్తర చూపులు చూస్తుంటే,విమల భర్త శేకర్ ‘ఏంటి విమల నువ్వు పుష్పగారిని అలా భయపెడతావెందుకు, అలాంటిదేమీ లేదండీ రేపు మా బంధువుల ఇంట్లో పెళ్లి.అబ్బాయిది ఈ ఊరే ,అందుకే వివాహము ఇక్కడ జరగనుంది.ఈ విషయము తెలిసిన నుండి విమల ఆనందానికి అవదులే లేవు,వాళ్ళు ఉండడానికి మాకు హోటల్ లో రూమ్ ఇచ్చినా, విమల “నేను పుష్ప వాళ్ళింట్లోనే దిగుతాను’’ అని పట్టుపట్టి మరీ ఇక్కడికి తీసుకిని వచ్చింది.పోనీ మనము వస్తున్న విషయమైనా తెలియపరుచు అని చెప్పినా,వద్దు “హఠార్తుగా వెళ్ళి పుష్పని ఆశ్చర్య పరుస్తాను’’ అని చెప్పిందని’’ అని చెప్పాడు.
పుష్పకి చాలరోజులకి తన స్నేహితురాలు కలవడముతో మనసులో ఎంతో సంతోషించింది.వాళ్ళ స్నానాలు,కాఫీలు,టిఫిన్లు ముచ్చట్లు అన్నీ అయ్యాక శేకర్ ‘’నేను అలా పెళ్లి వారింటికి వెళ్ళి ముఖము చూపించి వస్తాను,నీ ముచ్చట్లు అయ్యాక తయారై ఉండు కలిసి వెళదాము’’ అని విమలకి చెప్పి అక్కడి నుండి బయలుదేరాడు.
‘’ఇప్పుడు చెప్పవే విషయము ఏంటి’’ అన్న విమల ప్రశ్నకు ఏమిటి అన్నట్లుగా ఆశ్చర్యము గా చూసింది పుష్ప.
‘’ఏ విషయము’’ అని పుష్ప అడిగేసరికి “నువ్వు ఎవరితోనూ చెప్పకుండా నీలోనే నువ్వు భాదపడుతున్న విషయం’’ అని విమల అనేసరికి పుష్ప “ఏమీ లేదే అంతా బానే ఉంది’’ అని కంగారుగా సమాదానమిచ్చింది. “నీ ముఖము,నీ కంగారూ చెబుతున్నాయే ఏదో ఉందని చెప్పు’’ అని ఎంతో బ్రతిమలాడిన తరువాత మొత్తము తన మనసులోన భాదనంతా పుష్ప విమలతో విన్నవించుకుంది.జరిగినదంతా చెప్పింది.
అంతా విన్న విమల “అయితే నాకు తెలిసిన మంచి మానసిక నిపుణుడు ఉన్నారు.అతని దగ్గరకు తీసుకువెళ్ళు చాలా బాగా చూస్తారు’’ అని చెప్పింది.
“అమ్మో డాక్టరు దగ్గరకు వెళదామని అన్నందుకే ఆయనకి కోపము వచ్చింది.ఇంక మానసిక నిపుణుడు వద్దకు అంటే ఇంకేమయిన ఉందా!’’ అని పుష్ప అనేసరికి “అదీ నిజమేలే నువ్వు మాత్రం ఎలా ఒప్పిస్తావు లే’’ అని ఆలోచించసాగింది.
అంతలోనే విమల మెదడులో మెరుపులాంటి ఆలోచన తట్టి “పుష్పతో నేను చెప్పిన డాక్టరు ఈ పెళ్ళికి రేపు వస్తున్నారు ఇక్కడకి.నువ్వు కమల్ గారు అక్కడికి వస్తే అక్కడ ఆయన్ని కలవవచ్చు మనం’’ అని చెప్పింది.
“మీ బంధువుల పెళ్ళికి మేము ఎలా వస్తామే’’ అన్న పుష్ప ప్రశ్నకి “అవన్నీ నేను చూసుకుంటాను పెళ్లివాళ్లు మాకు చాలా దగ్గరి వాళ్ళు,నా స్నేహితురాలు ఇక్కడ ఉంది అని చెప్పి మీకు ఆహ్వానము వచ్చేలా చేస్తాను,నువ్వు ఆ విషయాలన్నీ నాకు వదిలేయు నేను చూసుకుంటాను’’ అని చెప్పి తయారవడానికి గదిలోకి వెళ్లిపోయింది విమల.
మొత్తానికి విమల ఇచ్చిన మాట ప్రకారము పుష్ప వాళ్ళకి పెళ్ళికి ఆహ్వానము రావడము,పెళ్ళికి వెళ్లడానికి కమల్ ని ఒప్పించడము,పెళ్ళికి వెళ్ళడము అన్నీ జరిగిపోయాయి.పెళ్ళిలో శేకర్ కమల్ ని అందరికీ పరిచయము చేయిస్తూ,విమల చెప్పిన డాక్టర్ అరవింద్ ని కూడా పరిచయము చేశాడు,అంతలోనే ఎవరో పిలుస్తున్నట్లుగా శేకర్ “మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను’’ అని చెప్పి అరవింద్ ని కమల్ ని వదిలేసి అక్కడి నుండి వెళ్లిపోయాడు.
విమల,శేకర్ అరవింద్ కి మొత్తం కమల్ గురించి ముందే చెప్పి ఎలాగయిన పరిష్కారము చూపాలని అభ్యర్దించడముతో బంధువులవ్వడముతో అరవింద్ అందుకు అంగీకరించాడు. మొదట అరవింద్ కమల్ తో మాటలు మొదలు పెట్టాడు.ఇద్దరి మాటలు బాగా కలవడము తో కమల్ కి అక్కడ ఉన్న ఎవరు తెలియక పోవడముతో అరవింద్ తో మాటలు కొనసాగించాడు. “అలా కూర్చుని మాట్లాడుకుందామా’’ అని అరవింద్ అనడముతో కమల్ సరే అని ఇద్దరు కూర్చుని మాటలు కొనసాగించారు.అరవింద్ మానసిక నిపుణుడు కాబట్టి ఎవరితో ఎలా మాట్లాడాలో,ఏమి మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుందో తెలుసు కాబట్టి కమల్ తో తన ఉధ్యోగము తో ప్రారంభించి,తన నుండి అన్ని విషయాలు రాబట్టాడు.ఇద్దరూ చాలా సమయము మాట్లాడుకున్నారు.తరువాత పెళ్లి తంతు ముగిసింది ఎక్కడి వాళ్ళు అక్కడికి చేరుకున్నారు.అరవింద్ తో మాట్లాడిన తరువాత కమల్ ముఖము కొంచెము ప్రశాంతముగా కనిపించింది పుష్పకి.
మరుసటి రోజు కమల్,పిల్లలు వెళ్ళిన తరువాత ముందుగా అనుకున్నట్లుగానే విమల,పుష్ప అరవింద్ గారిని కలవడానికి బందువుల ఇంటికి బయలుదేరారు. అక్కడ అరవింద్ ని కలవగానే అలా బయట లాన్ లో కూర్చుని మాట్లాడుకుందామని చెప్పి విమలని,పుష్పకి చెప్పి ముగ్గురూ లాన్ లో కూర్చున్నారు.పుష్పతో అరవింద్ “చూడండి పుష్పగారు మీ భర్త కమల్ గారికి ఎటువంటి సమస్యా లేదు,ఆయన చాలా బాగున్నారు అనగానే పుష్ప లోలోపలే చాలా ఆనందపడిపోయింది.అంతలోనే మరి ఎందుకు అలా ఉంటున్నారనే ప్రశ్న మెదిలేసరికి మనసులో విచారపడింది.

“చూడండి పుష్పగారు మీవారికి వచ్చిన సమస్య ఏమిటంటే,మీవారితో చాలా సమయము మాట్లాడిన తరువాత నాకు అర్ధమయినదేమిటంటే మీ వారుకొంత ఒంటరి తనముతో బాధపడుతున్నట్లు నాకు అని పిస్తుంది.మీరు చెప్పండి మీ పెళ్ళయిన కొత్తలో మీ వారి తో మీరు ఎలా ఉండేవారు అని అడగగానే, మా వారిది గలగలా మనసులో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే స్వభావము.మాకు పెళ్లి అయిన మొదట్లో నేను మావారు బాగా మాట్లాడుకునే వాల్లము. ఆయన తన మనసులో ప్రతీ మాట నాతో చెప్పుకునే వారు.నేను అలానే నా మనసులో మాటని ప్రతీదీ ఆయనతో పంచుకునేదాన్నిఅని సమాధానమిచ్చింది పుష్ప.మీవారితో ఎక్కువ సమయము గడిపేవారు.మీరుఇరువురు చాలా అన్యోన్యముగా ఉండేవారు.అంతవరకు బాగానే ఉంది.ఆతరువాత ఆయనతో సమయము ఎలా గడుపుతున్నారు అని డాక్టరు గారి అడిగిన ప్రశ్నకు రోజులు గడిచేకొద్ది మాకు పిల్లలు పుట్టడము వలన నాకు పని భారము,ఒత్తిడి పెరగడము వలన నేను మా వారితో గడిపే సమయము తగ్గింది.ఇంట్లో పెద్దవారు ఎవరూ లేనపుడు పిల్లలని నేనే చూసుకోవాలికదా!అని పుష్ప సమాదానము ఇచ్చింది.అదే మీరు చేస్తున్న తప్పు.మీవారితో మీరు సమయము గడిపి చూడండి ఆయనలో మార్పు తప్పక వస్తుంది. ఇంక కమల్ గారి ఆఫీసు విషయానికి వస్తే ఆయన వృత్తి ప్రిన్సిపాల్ అవ్వడము వలన తన కింద పని చేసే వారితో మనసువిప్పి మాట్లాడలేరు,ఎందుకంటే వాళ్ళతో పనిచేయించుకోవాలికదా! ఇంక వాళ్ళ అమ్మ,నాన్న అన్నయ్య,చెల్లి ఇలా రక్తసంబంధీకులందరికి తన ఉధ్యోగరీత్యా దూరముగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది.అందువలన వాళ్ళనీ తరచుగా కలవలేకపోవడము వలన తన మనసువిప్పి మాట్లాడే అవకాశమే కుదరడము లేదు.ఇంక మీ పిల్లల విషయానికి వస్తే వాళ్ళు వాళ్ళ నాన్నతో సమయము గడుపుతారా అని డాక్టరు గారు అడగగానే వాళ్ళు చిన్నపిల్లలగా ఉన్నప్పుడు కమల్ తో బాగానే సమయము గడిపేవారు.కానీ వాళ్ళు పెద్దవాల్లయ్యే సరికి,పెద్దబాబు మొబైల్ ఫోన్ లో ఆటలు,వాట్ట్సాప్ ,ఫేసుబుక్ అంటూ వాటిలోనే సమయము గడుపుతున్నాడు,ఇంక చిన్నవాడు నిత్యం టి‌వి లో వచ్చే కార్టూన్లు చూస్తూ,కాలము గడుపుతున్నాడు ఇంకా చెప్పాలంటే నేను కూడా ఈ మధ్యన వాట్సాప్ లో కొంత సమయము గడుపుతున్నాను.అది చూసి ఆయన కూడా గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు అని చెప్పింది పుష్ప.మరి అందరూ అలా చేయడము వలన కమల్ ఒంటరివారయ్యారు.ఇంక చేసేదేమీ లేక ఆయనకూడా వాట్సప్ ని అలవాటు చేసుకున్నారు.ఇలా అందరూ ఉన్నా,తన మనసులోని మాటలని చెప్పుకునేవారు లేక ఒంటరివారయిపోవడమువలన ,ఒక రకమయిన విరక్తి భావనలోకి వెళ్ళిపోవడము వలన కమల్ అలా ప్రవర్తిస్తున్నారు.చూడండి పుష్పగారు మీవారికి వచ్చిన సమస్య పెద్దది అని నేను అనను,అలా అని తేలికగా తీసిపారేయవలసినది కాదు.ఇది చాలా సున్నితమైన సమస్య.అలా అని నిర్లక్ష్యము చేస్తే మంచిది కాదు.
అదునాతనమైన పరికరములు,ఇంక సామాజిక అవసరాల నిమిత్తము మనిషి ఎన్నో ఉపయోగకరమైనవి కనుగొన్నాడు.విజ్ఞాన రంగములో ఎంతో పురోగతిని సాధించి,ఎన్నో పరిశోధనలు చేస్తూ ఎంతో అభివృద్దిని సాధిస్తూనే ఉన్నారు.కానీ వాటిని మనము ఎంతవరకు అవసరమో,అంతవరకే వినియోగించుకోవాలి.అతిగా వాడకూడదు.ఇదివరకు వెనకటి రోజులలో సాయంత్ర మయ్యేసరికి అందరూ తమ పనులు పూర్తి చేసుకుని ఆరుబయట కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునేవారు.కానీ ఇప్పుడు ఎవరి ఇళ్ళల్లో,వారే తలుపులు బిగించుకుని కూర్చుని టి‌వి లకి మొబైల్ ఫోన్లకి అతుక్కుపోతున్నారు.మొబైల్ ఫోన్ల వలన రేడియేషన్,స్పోండిలైటీస్,కంటి చూపు దెబ్బతినడం,రోడ్డు ప్రమాదాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.అయిన వాటిని వినియోగించకుండా ఉండలేని పరిస్థితిని కల్పించుకుంటున్నారు.మనము వాటిని వినియోగిస్తున్నాము,మన పిల్లలకి అందిస్తున్నాము. ఆయనతో, మీరు మీ పిల్లలు సమయము గడపండి. బంధువులను తరచూ కలుస్తూ ఉండండి.ఆనందముగా గడపండి’’.అని చెప్పి డాక్టరుగారు పుష్ప చేతిలో ఒక చీటి పెట్టారు.పుష్ప ఆ చీటిని తీసుకుని డాక్టరుగారికి ధన్యవాదములు తెలిపి విమలని తీసుకుని బయలుదేరింది.బయటకి వచ్చిన తరువాత డాక్టరు గారు ఇచ్చిన చీటిని చూసిన పుష్ప ఆశ్చర్యపోయింది,తరువాత నవ్వుకుంది.ఇంటికి చేరుకుంది.విమల,శేకర్ తమ ఊరికి తిరుగు ప్రయాణమయ్యారు. పుష్ప విమలని దగ్గరకు హత్తుకుని నా సమస్యకు మంచి పరిష్కారము చూపించావు అని తన ఆనందాన్ని తెలుపుకుంది. డాక్టర్ అరవింద్ చెప్పిన విషయాలను తన పిల్లలకు అర్దమయ్యేటట్లు వివరించి,కమల్ తో పిల్లలు ఎక్కువ సమయము గడిపే విదముగా వాళ్ళను తీర్చిదిద్దింది పుష్ప.ఇంకా తను కూడా కమల్ తో వీలయినంత సమయము గడపడానికి ప్రయత్నించింది.నెమ్మ నెమ్మదిగా కమల్ లో మార్పును గమనించింది పుష్ప.తన భర్త లో మునుపటి సంతోషము,ఉత్సాహము రావడముతో తన స్నేహితురాలికి,డాక్టరుగారికి మనసులోనే ధన్యవాదములు తెలుపుకుంది. ఇంతకీఆ చీటీలో ఏముందనుకుంటున్నారు!
టాక్ –అదేనండీ మనసువిప్పి మాట్లాడుకోండి.
స్మైల్ –మనసారా నవ్వండి
లివ్ –హాయిగా జీవించండి
విషింగ్ –మనిషి మనిషి పలకరించుకోండి.
ఇక్కడ సమస్య కమల్ ది .ఇంకో ఇంట్లో పుష్పది అయ్యుండవచ్చు.సమస్య ఎవరిదైనా కావచ్చు.మంచి తరుణం మించిపోకముందే తేరుకోండి.

స్నేహబంధం


 స్నేహబంధం


 స్నేహం  ఆ పద స్మరణే మేను లో కలుగును ఒకింత పులకింత
 కుల, మత, వర్ణ, రుచి, తావి రహితమై స్వచ్చమైనది స్నేహం
 మనసులో పుట్టి మరణించేవరకు తోడుగా ఉండేది స్నేహం
 మనసులోని భావాలను వెలిబుచ్చాడానికి పరిమితులు,అనుమతులు,అవధులు లేని మనో వేదిక స్నేహం
 కష్ట సుఖాలలో మదలో మెదిలే తొలి జ్జ్ఞప్తిక స్నేహం
 క్షీరసాగర మధనములో ఉద్భవించిన అమృత కలశము వంటిది స్నేహం
 తరాలు మారినా,యుగాలు గడిచినా,ఎల్లలు దాటినా ఎప్పటికీ పదిలముగా ఉండేది స్నేహము
 తల్లి,తండ్రి,గురువు ,దైవం తో సరిసమానముగా, వెలకట్టలేని అమూల్యమైన బహుమతి స్నేహం
  ఒక పలకరింపు ,పెదవులపై చెరగని చిరునవ్వు తప్ప ఏమి ఆశించనది స్నేహం.
 మనకున్న బంధాలలో మన పై ఒక్కొక్కరికి ఒక్కో హక్కు ఉంటుంది, కానీ అన్ని  హక్కులు మనపై గల ఒకే ఒక బంధం స్నేహం
 ఎంత ధనికుడైన మంచి ఆప్త మిత్రుడు లేని వాడు బిచ్చగానితో సమానమే
 మన ఆనందములో కన్నా మనం ఆపదలో ఉన్నప్పుడు మన ప్రక్కన ఉన్నవారే నిజమైన స్నేహితులు
 పెళ్లిళ్లు స్వర్గములో నిర్ణయించబడినట్లే,స్నేహితులు కూడా అక్కడే నిర్ణయించబడతారు
అటువంటి గొప్ప పవిత్రమైనది ఈ స్నేహబంధం అని నా అభిప్రాయము.

మోణ౦గి ప్రవీణ

ప్రియమైన సోదరికి

(శ్రీకాకుళము)
ప్రియమైన సోదరి లతకు,
నీ సోదరి ప్రవీణ వ్రాయు లేఖ.ఉభయ కుశలొపరి.ఏమిటి హఠార్తుగా ఉత్తరము రావడము చూసి ఆశ్చర్యపోతున్నావా! నాకే వ్రాయాలనిపించింది. ఈ మద్యన మీ బావగారు ఆఫీసు పని మీద వేరే ఊరు వెళ్ళినపుడు బీరువా సర్దుతుంటే పాత ఉత్తరాలు బయట పడ్డాయి.అవి చదువుతుంటే అప్పటి రోజులు గుర్తుకొచ్చాయి.మొబైల్ ఫోన్లు,ఫేస్ బుక్ లు వచ్చిన తరువాత ఉత్తరాలు వ్రాసుకోవడమే మానేసాము.ఉత్తరాలు వ్రాసుకోవడము,వాటిని పోస్ట్ చేయడము,జవాబు కోసం ఎదురు చూడడము వాటిలో ఉన్న ఆనందమే వేరు.ఎదురు చూపులో ఎంతో ఆరాటము,ఉత్సుకత ఉండేవి.కానీ ఇప్పుడు ఒక క్లిక్ ద్వారా జవాబు వచ్చేస్తుంది.అందులో ఆనందమేముంది.
నీకు గుర్తుందా మా పెళ్లి కి ముందు నిశ్చితార్ధము అయిన తరువాత,మీ బావగారు వద్ద నుండి నాకు వచ్చిన ఉత్తరాన్ని ఇవ్వకుండా నువ్వు,తమ్ముడు నన్ను ఆటపట్టించిన ఆ సన్నివేశము ఇంకా నా కళ్ల ముందు కదలాడుతుంది.కానీ ఇప్పుడు పెళ్లి కుదిరిన మారు నిమిషము నుండే అబ్బాయి,అమ్మాయి ఫోన్లలో గంటలు,గంటలు మాట్లాడుకుంటున్నారు.కానీ దానిలో ఉత్సుకత ఏమి ఉంటుంది చెప్పు.మనిద్దరము వ్రాసుకున్న ఉత్తరాలు నీకు గుర్తుకున్నాయా!వాటిని ఇప్పుడు చదువుతుంటే నాకు నవ్వు వస్తున్నది.’’అక్కా!నిన్ను బావగారు బాగా చూసుకుంటున్నారా,నువ్వు అడిగినవన్నీ కొని ఇస్తున్నారా ,లేదంటే చెప్పు నేను మాట్లాడతాను’’అన్న నీ వ్రాతలు చదువుతుంటే సరదాగా అనిపించింది.
నువ్వు మీ అత్తింటి కబుర్లు తెలుపుతూ నాకు వ్రాసిన ఉత్తరము ఇప్పటికీ పదిలముగా ఉంది.మరిది గారు నీపై కురిపిస్తున్న ప్రేమ,ఆయన నీకు కొనిపెట్టిన వస్తువులు తెలుపుతూ వ్రాసిన ఉత్తరము కూడా ఉంది.ఇలాంటి ఎన్నో మాటలలో చెప్పలేని భావాలను ఉత్తరాలలోనే తెలుపగలము.పెళ్లి జరిగిన తరువాత మొదటి ఆషాడ మాసములో నేను మీ బావగారు దూరముగా ఉన్నపుడు మేము వ్రాసుకున్న ఉత్తరాలు నాకు మధురమైన బహుమతులు.మీ బావగారు నేను రాసుకునే ఉత్తరాలు,నేను వ్రాసిన ఉత్తరము ఆయనకు చేరేసరికి,ఆయన వ్రాసిన ఉత్తరము నాకు చేరాలి,అలా షరతు పెట్టుకుని రాసుకునే వాళ్ళము.అలా ఇద్దరము ఒకే సమయమున ఉత్తరాలకోసము ఎదురు చూసి ,వాటిని అందుకుని ,మా వీరహాన్ని అలా తెలుపుకునే వాళ్ళము.కానీ ఇప్పుడు అంతా ఫోన్లలోనే మాట్లాడేస్తున్నారు.
ఇదివరకట్లో ఎవరయినా మన ఇంటికి వస్తే ఫోటో ఆల్భమ్ చూపించేవాళ్లం ,ఇప్పుడు అంతా ఫేస్ బుక్ ,వాట్సాప్ లలో పంపుకుంటున్నారు .ఇంక కొత్తదనము,ఉత్సుకత ఏముంటుంది,అన్నీ కనుమరుగైపోతున్నాయి ఉత్తరాలలాగానే. తన మనవడు నా కడుపులో ఉన్నపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుపుతూ అమ్మ నాకు వ్రాసిన ఉత్తరము ఇప్పటికీ పదిలముగా ఉంది.అది చదువుతుంటే అమ్మ నా ప్రక్కనే ఉన్నట్లుండేది.మీ అందరికీ దూరముగా ఉన్నప్పుడూ మీరు వ్రాసిన ఉత్తరాలే నా ప్రియా నేస్తాలు.మీరందరూ నాకు గుర్తుకువచ్చినపుడు వాటిని చదువుకునేదాన్ని.
ఏది ఏమయినా మరళ మనము ఉత్తరాలు వ్రాసుకుందాము,ఏమంటావు!అలనాటి ఆ అనుభూతులను పొందాలని నాకు ఆశగా ఉంది. మరళ మనము ఉత్తరాలకి అంకురార్పణ చేద్దాము.
నా ఉత్తరానికి జవాబు ఉత్తరము ద్వారానే తెలుపుతావని ఆశిస్తూ...........
                                                                                                                                                                             
నీ ముద్దుల సోదరి
 
ప్రవీణ

సూర్యప్రతాపం


సూర్యప్రతాపం


మండు వేసవి భానుడు తన ప్రతాపాన్ని భూమి పై చూపిస్తున్నాడు ,మండే అగ్నిగోళం లా భగభగ మంటూ నిప్పులు చెరుగుతున్నాడు ,ఆ నిప్పు కణికల వేడిమిని తట్టుకోలేక ప్రజలు విలవిలలాడుతున్నారు .సూర్యుడు తన వేడిమి తాపాన్ని తీర్చుకోవడానికి భూమి పైన ,నదులలోన,చివరికి మానవుని శరీరము లో ఉన్న నీటిని సైతం హరిస్తున్నాడేమో అన్న తలంపు వస్తున్నది.భూమికి అతి చేరువుగా వస్తూ అత్యంత కాంతితో ,ప్రకాశవంతముగా ,అత్యంత వేడిమి కలిగిన బుసలు కొడుతూ దేదీప్యమానముగా వెలిగిపోతున్నాడు .
సూర్యుని వేడిమి భరించలేని ప్రజలు కొందరు గృహానికే పరిమితమయిపోయారు. విధి లేని పరిస్థితులలో కొందరు బయటకు సాగుతున్నారు .రోడ్లమీద జనసంచారము మందగించింది .వీధి కోళాయిల వద్ద ఆడపడుచులు బిందెడు నీటి కోసము పడిగాపులు కాస్తున్నారు .డబ్బు ఉన్న వాళ్ళందరూ ఏ‌సిల కింద కాలము వెళ్ళబుచ్చుతున్నారు .పానీయాలు ,ఐస్క్రీమ్ల బండ్ల వ్యాపారం జోరుగా సాగుతున్నది .తోపుడుబల్ల వ్యాపారస్థుల పరిస్థితి అత్యంత భాదాకరము, ఎండలో వెళ్ళలేరు వెళ్ళక పోతే పూట గడవదు .రిక్షా అబ్బి పరిస్థితి గడ్డుకాలమనే చెప్పాలి, బతుకు జీవుడా అంటూ మండుటెండలో సూర్యుడు తన శక్తి ని హరిస్తున్నా కాళ్లలో శక్తినంతా కూడా గట్టుకుని పయనం సాగిస్తున్నాడు.
మొత్తానికి ప్రతీ ఒక్కరి నోటా ఒకటే మాట ‘’బాబోయి ఎండలు భరించలేకపోతున్నాము మా వల్ల కాదు బాబోయి ‘’. స్కూల్లకి సెలవులివ్వడముతో పిల్లలందరూ ఇంటిపట్టునే ఉంటున్నారు. అమ్మ వద్దని చెప్పినా దొంగచాటుగా వీధిలోకి వెళ్ళి పిల్లలందరూ ఆడుకుంటున్నారు .ఆ వీధిలో పిల్లలందరూ క్రికెట్టు ఆడుతున్నారు .అంతా ఒకేసారి నిశ్శబ్దం అయ్యారు. సూర్య వేసే బంతికి ప్రతాప్ సిక్స్ కొడతాడలేక అవుటవుతాడా అని అందరిలో ఒకటే ఆరాటం .సూర్య బంతిని తన నిక్కరుకి రుద్దుతూనే ఉన్నాడు ప్రతాప్ వెనుక సురేశ్ బంతిని పట్టుకుని అవుట్ చేద్దామా అని సిద్దముగా ఉన్నాడు.మిగిలిన వారందరూ బంతిని ఆపడానికి ఉత్సుకతతో ఉన్నారు .మొత్తానికి సూర్య బంతిని వేయడము ప్రతాప్ సిక్స్ కొట్టడము జరిగిపోయాయి .ప్రతాప్ ని అందరూ హేయ్ అంటూ తమ మోచేతుల పైన ఎక్కించుకుని పైకి ఎత్తుతూ హాహాకారాలు చేశారు .తరువాత రెండు నిమిషాలకే ఉన్నపలముగా ప్రతాప్ కుప్పకూలిపోయాడు .అందరూ ప్రతాప్ చుట్టూ గుమిగూడారు .ఏమయింది ప్రతాప్ కి అనికంగారు పడ్డారు .అక్కడ పక్కనే ఆడుకుంటున్న ప్రతాప్ చెల్లి మల్లి పరుగెత్తు కుని వెళ్ళి విషయం అమ్మకి చెప్పింది .అందరూ కలిసి ప్రతాప్ ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు .డాక్టరు వడదెబ్బ తగిలిందని ,ఎండలు తీవ్రముగా ఉన్న ఈ సమయములో పిల్లలని ఎందుకు బయటకి పంపారని డాక్టరు ప్రతాప్ తల్లిని మందలించారు .
అందరూ సుర్యుడిని ఒకటే నిందిస్తూ ఉన్నారు .మాయదారి ఎండలు మా జీవితాలతో ఆడుకుంటున్నాయి భరించలేక పోతున్నాము ఆ సూర్యుడు మా పేదోళ్ళ మీద కన్నెర్ర చేశాడు ఇలా మనిషోమాట అంటూనే ఉన్నారు ప్రతాప్ పరిస్థితికి కారణమయిన ఎండను ,సూర్యుడిని అందరూ తప్పు పడుతున్నారు .అంతా విన్న మల్లి మాత్రం ఇంటిలో ఉన్న గుప్పెడు పువ్వులను తీసుకుని సూర్యుడి ఫోటో ముందు పెట్టి ‘’ఓ సూర్య భగవానుడా ,అందరూ నిన్ను నిందిస్తున్నారు ఎందుకు ....నువ్వు అంతా చెడ్డవాడివా ,మంచివాడివా ........,చెడ్డవాడివి అయితే చలిగా ఉన్నప్పుడు ,వర్షాలు పడినపుడు నిన్ను ఎందుకు తలుస్తారు,పిలుస్తారు,పూజిస్తారు.మంచివాడివయితే మా అన్నను ఇలా ఎందుకు చేశావు,అందరూ నిన్ను ఎందుకు తిడుతున్నారు ‘’ అని ప్రార్దించింది .
అందరూ సూర్యుణ్ణి నిందిస్తున్న సమయములో మల్లి మాత్రమే సూర్యుణ్ణి ప్రార్దించింది .వెంటనే మల్లి అనే పిలుపు వినబడేసరికి మళ్ళీ కంగారు పడింది ,’’నేనమ్మ సూర్యుణ్ణి పిలిచావుగా నన్ను ప్రశ్నించావుగా’’ అన్న మాటలు సూర్యుని ఫోటో నుండి వినిపించసాగాయి .భయపడకు నీ ప్రశ్నలకి సమాదానమిస్తాను వింటావా మరి అన ప్రశ్నకు అలాగే అన్నట్టుగా మల్లి తల ఊపింది .
చూడు మల్లి ఈ రోజున ప్రతీ ఒక్కరూ తప్పు నాదే అన్నట్లుగా నా మీదే విరుచుకుపడుతున్నారు .కానీ ఒక విషయము మాత్రము నిజం. నేను పుట్టినపుడు నుండి ఈ రోజు వరకు ఒకేవిధముగా ఉన్నాను అప్పుడు ఏ కాలములో ఎలా ప్రకాశించేవాడినో ఇప్పుడూ అలాగే నా విధి నిర్వర్తిస్తున్నాను .మద్యలో మార్పు వచ్చినదంతా మీ మానవుడి చర్యలవలనే అన్న మాటలకు ,అవునా అన్నట్లు మల్లి ఆశ్చర్యముగా చూసింది .ఇంతకు ముందు అడవులు ,కొండలు,చెట్లు అన్నీ కూడా బాగా ఎత్తుగా ,ఎక్కువుగా ఉండేవి .అవి నా వేడిమిని మీ వరకు చేర్చకుండా అడ్డుకునేవి .కాని ఇప్పుడేమీ జరిగింది మానవులు చెట్లను అన్నింటిని కొట్టేశాడు కొండలను తవ్వేసాడు అడవులలో ఉన్న చెట్లను నరికేశారు మరి నా వేడి నుండి మీకు రక్షణ ఎలా వస్తుంది .సరే చెట్లను ,కొండలను,అడవులను అవసరార్దము తవ్వేశారు అనుకుందాము .మరి నాకు మీకు మద్యన ఉండే రక్షణ కవచము ఓజోను పొరను మీ మానవులు దెబ్బతీశారు .అనేక ఫ్యాక్టరీలు పెట్టి వాటినుండి కాలుషాన్ని నా పైకి పంపించారు అది ఓజోను పొరను దెబ్బతీసింది అందుకే నానుండి వెలువడే వేడి మీకు అత్యంత సమీప మయ్యింది .రోడ్లమీద పాదాచారులు తగ్గిపోయారు అందరూ వాహనాల మీద వెళ్ళేవారే ఎక్కువయ్యారు దాని వలన వాహన ఇందన కాలుష్యం ఎక్కువయింది అది ఒక కారణమే మరి .సరే అన్నీ తెలుసుకుని కొంతమంది మేలుకుని మొక్కలు నాటే కార్యక్రమము అని మొక్కలు నాటి వెళ్లిపోతున్నారు కానీ తరువాత వాటి సంరక్షణ బాధ్యత వదిలేస్తున్నారు .మీ మానవులు కనిపెట్టిన అధునాతన వస్తువులు వాటి నుండి వెలువడే వాయువులు వలన ఓజోను పొర దెబ్బతిని నా నుండి వెలువడే అతినీలలోహిత కిరణాలు భూమి మీద మీ మనుష్యల మీద నేరుగా పడుతున్నాయి వాటి ప్రభావాన అనేక సమస్యలకు మీరు గురియవుతున్నారు ఇలా ఎన్నని చెప్పను మీ మనుషులు చేసిన తప్పిదాలు ఒకటా రెండా ......మీ సౌక్యము కోసము విలాసవంతమైన జీవితము జీవించడము కోసము పరిణామాలను పరిగణలోకి తీసుకోకుండా ఎన్నో వస్తువులను కనిపెట్టి వినియోగిస్తున్నారు. బొగ్గు , పెట్రోల్ లను వివిధ అవసరాల నిమిత్తము వినియోగాన్ని బాగా పెంచారు .కానీ వాటి నుండి వెలువడే వాయువుల పరిణామాలను ఆలోచించడము లేదు .ఇలా ఎన్నో తప్పిదాలను చేస్తూ ,తప్పు తన వైపు ఉంచుకుని నన్ను నిందిస్తున్నారు .

ఇప్పుడు చెప్పు మల్లి నన్ను పూజిస్తావో, నిందిస్తావో .......నీ ప్రశ్నకు జవాబు లభించింది అనుకుంటాను అన్న మాటలు వినిపించాయి మల్లికి తరువాత ఏమీ వినబడలేదు .మల్లికి విషయము అవగతమైంది అన్నట్లుగా అక్కడి నుండి వెళ్ళి మొట్టమొదట తన ఇంటి ముందు చిన్నచిన్న మొక్కలు నాటింది ,మల్లిని గమనించిన అందరూ తన వైపు ఆశ్చర్యముగా చూసారు .మల్లి అందరికీ విషయాన్ని తనకు అర్దంయినరీతిలో వర్ణించింది,మల్లిని చూసి అందరూ మొక్కలు నాటారు.మరి ఎందుకు ఆలస్యం పదండి మనము మల్లిని అనుసరిద్దాము.
ఈ కథ go telugu .com లో మే 2016 న ప్రచురితమయ్యింది

మనసులో మాట

మనసులో మాట [మనము చేయలేని పని ]
శ్రావణ మాసపు తొలకరి జల్లులో రేయంతా సరిగంగ స్నానమాడిన పచ్చని చెట్లు పిల్ల గాలితో ఏకమై తమ దేహాన్ని శుద్ది చేసుకుంటున్నాయి. నవ వసంతాన్ని ఆస్వాదిస్తున్న పక్షులు కిలకిల ద్వనులతో ఆకాశములో విహరిస్తున్నాయి.వర్షములో తడిసిన మట్టి వాసన అన్నీ కలగలసి ఆసుందర మనోహరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ నేను,మావారు మా ఇంటి బాల్కనీ లో కూర్చుని వేడివేడి కాఫీ త్రాగుచున్నాము. ఆదివారము అవడము వలన పొద్దున్నే వంట హడావుడి లేనందున ప్రకృతిని ఆస్వాదిస్తూ,కాఫీని సేవిస్తున్నాము.అంతలోనే మావారు పేపరు చదవడము ప్రారంభించారు.నేను కూడా ఎడిషినల్ పేపరు తీసుకుని చూడంగానే మొదటి పేజీలో వార్త.సెల్ ఫోను మాట్లాడుతూ బండి నడుపుతున్న వ్యక్తి,ఎదురుగా వస్తున్న లారీని డీకొట్టడముతో అక్కడికక్కడే మృతి చెందాడు.లారీ డ్రైవరు పరారీ లో ఉన్నాడు.కేసు నమోదు చేసిన సి.ఐ,విచారణ జరిపిస్తామన్నారు.ఆ వార్త చదివిన నాకు,ఆ మధ్యన కొన్ని రోజుల క్రితము రోడ్డు మీద జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది.
ఒక రోజు మావారు ఆఫీసు నుండి వచ్చిన తరువాత కూరగాయలు,పండ్లు తెచ్చుకుందామని ఇద్దరం బజారుకు బండి మీద బయలు దేరాము.బజారులో అన్నీ కొనుక్కుని తిరిగి వస్తున్న మాకు హఠార్తుగా కీచుమని పెద్ద శబ్ధం వినిపించింది. ఏమిటా శబ్ధం అని మావారు బండిని ఆపారు,నేను బండి దిగి ఏమయిఉంటుందా అని గమనించి చూశాను.ఆ ప్రదేశములో రెండు రోడ్లు ఉన్నాయి.ఒక రోడ్డులో ఒక వైపు నుండి ఒక ఆమె నావయసే ఉంటుంది సుమారుగా,తన కొడుకుతో బండి మీద వస్తుంది.అటువైపు రోడ్డు నుండి ఒక వ్యక్తి సెల్ ఫోను మాట్లాడుతూ వస్తున్నాడు.ఇద్దరూ ఒకే మలుపు వైపు తిరుగుతున్నారు.అటువైపు నుండి హఠార్తుగా ఏ ఇండికేటరు వేయకున్నావస్తున్న వ్యక్తి ని చూసి ఈమె కంగారుగా చెప్పాలంటే ఎంతో ఒడుపుగా బండిని ఆపింది.ఆలాచేయడము వలన రెండు బళ్ళు ఒకేసారి హఠార్తుగా ఆగడముతో ఆ శబ్దం వచ్చింది.అయితే ఒకటి ప్రమాదము తృటిలో తప్పింది.ఈ హఠాత్ పరిణామానికి ఆమె వెంటనే బండి దిగి ఒక పక్కగా బండిని పెట్టి,ఏమీ పట్టనట్లుగా తన తప్పేమీ లేదన్నట్లుగా చూస్తున్న ఆ వ్యక్తిని ఆపి ఇలా నిలదీసింది “ఏమిటండీ మీరు చూసుకుని డ్రైవ్ చేయలేరా?మలుపు తిరిగేటపుడు ఇండికేటరు వేయాలని మీకు తెలియదా! బండి నడుపుతున్నపుడు సెల్ ఫోన్ మాట్లాడకూడదని తెలియదా?నేను అప్రమత్తముగా ఉన్నాను కాబట్టి ఏ ప్రమాదము జరుగలేదు.లేదంటే ఏమవుతుంది.అయిన సెల్ లో మాట్లాడాలనుకునేటప్పుడు బండిని ఒక పక్కగా ఆపి మాట్లాడాలని తెలియదా’’?అని చేడా మాడా కడిగేసింది.అంతటితో ఆమె ఊరుకుందనుకుంటున్నారా!ఆయన చేతిలోనుండి సెల్ తీసుకుని “ఇంత అర్జంటుగా ఎవరితో మాట్లాడుతున్నారు’’ అని అడిగింది.ఆమె ప్రశ్నలకి బిత్తర పోయిన ఆ వ్యక్తి నా భార్య తో అని సమాధానమిచ్చాడు.ఆమె వెంటనే ఫోన్ అందుకుని “చూడండి భార్యామణి గారు!మీరు మాట్లాడుతున్నపుడు మీవారు బండి నడుపున్నారని మీకు తెలియదా ?ఒక ప్రక్కగా బండిని ఆపి మాట్లాడమని చెప్పలేరా ?మీరు చెప్పే విషయము ముక్యమైనదే అవ్వవచ్చు,కానీ దాని వలన మీ భర్త ప్రాణాలకే ముప్పువాటిల్లుతుందని మీకు తెలియదా!అంటూ రోడ్డుమీద జరిగిన మొత్తము ఆమెకు వివరించింది.సెల్ ఫోన్ ఉన్నది అవసరానికి వాడుకోవడానికి, ఇలా అతిగా వాడమని కాదు,అని చెప్పి ఫోనుని ఆ వ్యక్తి చేతిలో పెట్టి,తన బండిని స్టార్ట్ చేయబోతున్న ఆమెతో ,ఆ వ్యక్తి [ఫోనులో తన భార్య ఏమి చెప్పిందో తెలియదు గానీ ]నన్ను క్షమించండి సిస్టర్ అని మొరపెట్టుకున్నాడు.ఇంకా ట్రాఫిక్ పోలీసు తను చేయవలసిన పని ఆమె చేసిందని సిగ్గుతో తల దించుకున్నాడు.ఇంకా అవాక్కవ్వడము మా వంతయ్యింది.
శ్రీమతి గారు అన్న మావారి పిలుపుతో జ్ఞాపకాల నుండి వర్తమానములోకి వచ్చాను.
సెల్ ఫోన్ లో మాట్లాడుతూ వాహనాలని నడిపే వాళ్ళ ని రోజూ మనము చూస్తూ ఉంటాము.కానీ మనము ఏమీ చేయలేక వదిలేస్తున్నాము.ఇలాంటి వాళ్ళ వలన ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు.కానీ ఎవరూ పట్టించుకోవడము లేదు.జారీమానా విధించబడును అనే సూక్తి గోడలకే పరిమితమైపోయింది.సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపే వ్యక్తులతో ఆమె స్పందించినట్లుగా ప్రతీ ఒక్కరూ స్పందిస్తే ఎంత బాగుంటుంది.ఒక్కోసారి మన మనసులోని మాట ఎవరి నోటయిన విన్నపుడు, మనము చేయలేని పని ఎవరయినా చేసి చూపించినపుడు భలే ఉంటుంది కదూ!........

తొలిప్రేమ.. మధురాతిమధురం

ప్రేమ ........ఎంత తీయని పదము. తొలి ప్రేమ ....... ఇది ఇంకా మధురాతి మదురము.ప్రేమ అనిర్వచనీయము.మధురమైన అనుభూతి.మన జీవితములో తొలి ప్రేమ ఎప్పుడు ఎవరితో ఉద్భవిస్తుందో ఊహించడము కష్టమే.కానీ తప్పక చిగురిస్తుంది.ఆ అనుభూతిని,అనుభవాలను వర్ణించడానికి పదములు సరిపోవు.ఎందుకంటే తొలి ప్రేమను ఎంత వర్ణించినా అది తక్కువే అవుతుంది.
తొలిసారిగా నేను తల్లిని కాబోతున్నానని డాక్టరుగారు నన్ను పరీక్ష చేసాక, నాతో చెప్పిన ఆ మధురమైన క్షణాలను నాజీవితములో నేను ఎన్నటికీ మరువలేను.నా కడుపులో ఒక చిన్న ప్రాణము ఊపిరి పోసుకుంటుందన్న ఆలోచన,అనుభూతి,ఆనందము నేను వర్ణించలేను.ఎందుకంటే అది అనుభవిస్తే కాని తెలియదు.నేను తల్లిని కాబోతున్నానని తెలిసిన రోజు నుండి ప్రతీ రోజూ నాకు ఒక కొత్త అనుభవమే.క్రిందన కూర్చోవచ్చా!కూర్చుంటే కడుపులో ఉన్న బిడ్డకు ఏమైనా అవుతుందా,ఆహారము ఏమి తీసుకోవాలి?ఇలా ప్రతీదీ సందేహమే!మావారి ఉద్యోగరీత్యా పెద్దవారికి దూరముగా ఉండడము వలన,మా ఇరువురికీ అన్నీ సందేహాలే.ఫోన్ల ద్వారా పెద్దలను,చుట్టుప్రక్కల వాళ్లని అన్నీ అడిగి తెలుసుకుని, నా సందేహాలను నివృత్తి చేసుకునేదాన్ని.రోజురోజుకీ పెరుగుతున్న నా పొట్టని అద్దములో చూసుకుని,లోపల నా బిడ్డ ఎలా ఉన్నాడు,ఎంత పెరిగి ఉంటాడు అని ఆలోచించేలోపే తన చిట్టి పాదములతో లోపల నా బిడ్డ నన్ను తన్నే సరికి,ఆలోచనల నుండి తేరుకుని,చుట్టుప్రక్కల ఎవరూ లేరని గ్రహించి నా పొట్ట నిమురుతూ నా బిడ్డతో ఎన్నో ఊసులను,బాసలను పంచుతుంటుంటే, చిత్రముగా నాకు నా బిడ్డ “ఊ ఊ” అంటునట్లుగా అనిపించింది.తరువాత నా ఆలోచనకి నేనే నవ్వుకున్నాను.కానీ కడుపుతో ఉన్నప్పుడు మనము మన బిడ్డకి చెప్పేవన్నీ వాళ్ళకి చేరతాయంట, మా నాయనమ్మ చెప్పింది.
రోజులు దొర్లుతున్నాయి.నెలలు గడిచేకొద్ది పెరుగుతున్న నా పొట్టని చూసుకుంటే నవ్వు వస్తుంది.ప్రసవ సమయము దగ్గరవుతున్న కొలది రాత్రులు నిద్రపట్టక,ఎటువైపు తిరిగితే బిడ్డకు ఏమవుతుందో అన్న భయం,సుఖప్రసవము అవుతుందా?లేక శస్త్ర చికిత్స చేయవలసిన అవసరము ఏర్పడుతుందా? ఇలా అనేక సందేహాలతో నేను నిద్రపోకపోవడమే కాకున్నా ,మా నాయనమ్మని కూడా పడుకోనివ్వలేదు.శ్రీమంతము జరిగిన తరువాత, నన్ను అమ్మా వాళ్ళింటికి తీసుకొచ్చేశారుగా. అప్పటి నుండి మా నాయనమ్మే అన్నీ నాకు.మొత్తానికి నేను తొమ్మిది మెట్లను ఎక్కేసాను.అదేనండీ తొమ్మిది నెలలు నిండాయి అంటున్నాను.డాక్టరు చెప్పిన తారీఖు రానే వచ్చింది.ఆ రోజూ మే నెల 30వ తారీఖు 1996.
ఆ రోజూ పొద్దున్న నుండి పొట్టలో ఒకటే అసౌకర్యం ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి పొట్టలో చిన్న నొప్పి.వాటినే పురిటి నొప్పులంటారని మా అమ్మ చెబితేగాని నాకు తెలియలేదు.ఆ రోజంతా చిన్న చిన్న నొప్పులు,తిండి సహించక,నిద్రపట్టక కొంచెం కష్టము గానే గడిచిందని చెప్పాలి.ఆ రోజూ రాత్రంతా మా అమ్మ,నాయనమ్మ నాకు సపర్యలు చేసారు.వాళ్ళ ఋణము తీర్చుకోలేనిది.మరుసటి రోజు అంటే మే 31, 1996 ప్రొద్దున్న నొప్పులు ఎక్కువ అవడముతో నన్ను ఆసుపత్రిలో జాయిన్ చేయించారు నాన్న.పురిటి నొప్పులు భరించలేక పోయాను.బిడ్డను కనడమంటే ఇంతకష్టమా అని అనిపించింది.ఆ సమయములో నాకు మా అమ్మ గుర్తుకువచ్చింది.నన్ను కనేటపుడు మా అమ్మ ఇంతే కష్టపడి ఉంటుంది కదా!అని ఆలోచన వచ్చేసరికి నా కళ్ల వెంబడి నీళ్ళు వచ్చాయి.
ప్రసవ సమయము బాగా దగ్గరవుతుందేమో నొప్పులు తారాస్థాయికి చేరాయి.ఇంక భరించడము నా తరము కావడములేదు.ఆ భాదలో నేను ఏవేవో మాట్లాడేస్తున్నానంట, నా ప్రక్కనే మా నాయనమ్మని ఉండమని అంటుంటే డాక్టరుగారు వీలుపడదు.. అని చెప్పి మా నాయనమ్మ ను బయటికి పంపిస్తుంటే నా చెయ్యి ఆమె నుండి విడిపోతుంటే తను నాకు శాశ్వతముగా దూరమైపోతుందన్న భావన కలిగింది.ఈ నొప్పులు నేను భరించలేకపోతున్నాను నాకు ఆపరేషన్ చేసేయండి అలా అయితే ఈ నొప్పులు ఉండవని మా ఫ్రెండు చెప్పిందని డాక్టరు గారితో అంటుంటే డాక్టరు గారు నా వైపు చూసి నా తల నిమురుతూ ఒక నవ్వు నవ్వారు.నాకు ఇవన్నీ లీలగా గుర్తున్నాయి.ఏమయితేనేమీ మొత్తానికి నాకు సుఖ ప్రసవము జరిగింది.మరో జన్మ ఎత్తిన నాకు , పండంటి మగ బిడ్డ పుట్టాడమ్మ అన్న నర్సు మాట నా చెవిన పడింది.తరువాత కాసేపు ఏమిజరిగిందో తెలియలేదు.
కాసేపటికి నా బిడ్డను నా ప్రక్కన పడుకోబెట్టారు.వాడి చిట్టి చేతుల స్పర్శ తో నాలో “తొలి ప్రేమ చిగురించింది’’.మా తల్లి బిడ్డల ప్రేమ బంధం ఆ క్షణానే చిగురించింది.చారడేసి కళ్ళతో నన్నే చూస్తున్నాడు.ఆ చూపులో వాడికి అమ్మని నేనే అని అప్పుడే తెలిసిపోయిందా అని ఆశ్చర్యము వేసింది.వాడి బోసి నవ్వులు,చిట్టి చిట్టి ఏడుపులు,వాడి నగు మోము చూసేసరికి నా ప్రసవవేదనంతా కనుమరుగైపోయింది.ఆ రోజూ నాకు మావారికి జీవితములో ఎంతో మధురమైన రోజూ ఎందుకంటే మేము అమ్మా నాన్నల మయ్యాము.ఇంకా మరువలేనిది,మావారు నా నుదుటున చుంభన చేస్తూ తనకి పండంటి బిడ్డను కని ఇచ్చినందుకు తన ఆనందాన్నీ,ప్రేమను వ్యక్తపరిచారు.
ఇంకా ఆరోజు నుండి నా బాబే నా ప్రపంచమయిపోయాడు.బాబు చర్యలన్నీ నాకు వింతగా,కొత్తగా అనిపించి ప్రతీదీ మా అమ్మ తో నాయనమ్మ తో చెప్పుకుని మురిసిపోతుంటే, “ఓ యమ్మో నీకే ఉన్నాడు కొడుకు,మేము కనలేదు మరి’’అని మా పిన్నమ్మలు నన్ను ఆటపట్టించేవారు.బాబు నిద్రలో నవ్వుతుంటే బలే ముద్దోచ్చేవాడు.ఆ దృశ్యము ఇంకా నాకళ్ళ ముందు కదలాడుతుంది.పాల కోసం ధారాళముగా ఏడ్చేవాడు .ఒడిలోకి తీసుకోగానే ఏడుపు ఆపేసేవాడు.బాబుకు అన్నీ సేవలు చేస్తూ ఎంతో ఆనందాన్ని పొందాను.బాబు కి ఏమి పేరు పెడదామని!నేను మా వారు చాలా ఆలోచించాము.నీ పేరు ప్రవీణ కదా!బాబుకి ప్రతోనే పేరు పెడదాము అని బాబు కి ప్రమోద్ అని నామకరణము చేయించారు మా వారు.
ఆ రోజు నా ఆనందానికి అవధులు లేవు.పేగుబంధము తో పాటు పేరు బంధము కూడా ముడి పడింది.అందరూ ప్రవీణ కొడుకు బలే ముద్దుగా ఉన్నాడు,వాడి బుగ్గలు చూడండి అందరూ ముద్దులాడుతుంటే నాకు గమ్మత్తుగా,గర్వముగా అనిపించేది.అంతలోనే బాబు ని చూడడానికి వచ్చిన మా చుట్టాలు వెళ్లిపోగానే,మా అమ్మ బాబుకి దిష్టి తీస్తూ ఉండేది.బాబు రాత్రుళ్లు ఏడుస్తూ పడుకోకుండా అల్లరి పెడితే బాబుకి దిష్టి తగిలింది అని అమ్మ అంటూ ఉంటుంది.అలా మా పుట్టింటిలో మూడు నెలలు గడిచాక మావారి దగ్గరకి బాబుని తీసుకుని వచ్చేసాను.మచిలిపట్టణములో మా వారి ఉధ్యోగము.అక్కడ బాబు కి కాపడం పెట్టడానికి,స్నానం చేయించడానికి ఎవరూ దొరికేవారుకాదు.అన్నీ బాబుకి స్వయముగా నా చేతులతో నూనెతో మసాజ్ చెయ్యడం,స్నానం చేయించడం అలా రోజంతా గడిచిపోయేది.వీటివలన మా ఇద్దరి మధ్య బంధం మరింత బలపడిపోయింది.
ప్రొద్దున్న లేచిన దగ్గరనుండి రాత్రి పడుకునేవరకు బయట ప్రపంచముతో సంబంధం లేకుండా, మాదైన ఒక కొత్త ప్రపంచాన్ని ఏర్పరుచుకుని అందులోనే నేను, ప్రమోద్ విహరిస్తూ ఉంటే మధ్యలో మా వారు వచ్చి “కొంచెం నన్ను కూడా పట్టించుకోవోయ్’’ అని చతురలు విసిరుతుంటే నేను లోలపలే నవ్వుకుని “అలాగేనండి’’ అని సమాదానం ఇచ్చేదాన్ని.ఏదయినా బిడ్డకి మన చేతులతోనే స్వయముగా అన్నీ సేవలు చేస్తూ ఉంటే ఆ ఆనందమే వేరు.మళ్ళీ మళ్ళీ వాల్ల బాల్యము,ఆరోజులు రావు కదా!బాబుకి ప్రతీ నెల పుట్టిన రోజు [అంటే ప్రతీ నెల 30లేదా 31వ తారీఖు అన్న మాట]జరపడం,బోర్లా పడడము,పాకరడము,బంగరడము,కూర్చోడము అన్నింటిని మేము ముగ్గురము వేడుకలలాగా జరుపుకున్నాము.ప్రమోద్ తొలిసారిగా బుడి బుడి అడుగులు వేస్తుంటే ఒక ప్రక్క ఆనందము,మరో ప్రక్క పడిపోతాడేమో అన్న భయము కలిగాయి.ఇలాంటి భావాలు ప్రతీ తల్లికి ఉంటాయి.కానీ నా భావాలు,నా ఆనందాలు నావే కదా!అందుకే నా ఆనందాన్ని అమ్మ తో,మా అత్తగారితో ఉత్తరాల ద్వారా పంచుకున్నాను.
అన్న ప్రాసన జరిగిన రోజున బాబు తొలిసారిగా పాయసము ముట్టుకుంటే, అందరూ బాబు బాగా తిండి పుష్టిగలవాడవుతాడు అని అన్నారు.కానీ ప్రమోద్ ఈ రోజుకీ తిండి సరిగ్గా తినడు. బాబు నాతో ఎక్కువ దోబూచులాట ఆడేవాడు.నా బాబు తో గడిపిన ప్రతీ క్షణం నాకు ఈనాటికీ మధురమైన వే.బాబు తొలిసారిగా నన్ను అమ్మ అని పిలిచినపుడు ఆ పిలుపు లో అంత మాధుర్యము ఉంటుందని ఆ రోజు వరకు నాకు తెలియలేదు.బాబు పడుకున్నపుడు వాడి బుజ్జి పాదాలను,పాల బుగ్గలని ముద్దులాడుతుంటే,మా అమ్మ చూసి అన్నిసార్లు ముద్దుపెట్టకూడదు వాడికి దిష్టి తగులుతుంది అని నన్ను మందలిస్తుంటుంటే ఏంటమ్మ నువ్వు తల్లి దిష్టి కూడా తగులుతుందా ఎక్కడైనా అని వాదించేదాన్ని.
అమ్మ చుట్టుప్రక్కల లేని సమయము చూసుకుని బాబుని దొంగతనముగా ముద్దు పెట్టుకుంటుంటే బలే గమ్మత్తుగా ఉండేది.అయిన బాబు ముగ్దమనోహరమైన మోమును చూస్తుంటే ముద్దుపెట్టుకోకుండా ఎలా ఉండగలను మీరైన చెప్పండి! నా జీవితములో ఒక వరము మావారితో నా పెళ్లి అయితే,దేవుడిచ్చిన ఇంకో అద్భుతమైన వరం మా అబ్బాయి ప్రమోద్.కాలముతో పాటు ప్రమోద్ ఎదుగుతూ ఉన్నాడు.నా చుట్టూ తిరుగుతూ,నా కళ్ల ముందే తిరుగుతూ,తన చిట్టి చేతులతో వంటింట్లో నాకు అన్నీ అందిస్తూ,నేను బట్టలు ఆరవేస్తుంటే బట్టలు అందిస్తూ,పూజ గదిలో నాతో పాటు ఆదేవునికి ప్రార్దన చేస్తూ ఇలా అనేక చర్యలతో నా మనసు గెలుచుకున్న బాబు అక్షరాబ్యాసము చేయించుకుని ఈ తల్లి వడి పాఠశాల నుండి బయట ప్రపంచం అనే పాఠశాల లో చేరాడు.చూస్తుండగానే స్కూల్ కి వెళ్ళేంత పెద్దవాడయిపోయాడు ప్రమోద్.యూనిఫార్మ్,షూస్,టై,బెల్టు లో బలే ముద్దోచ్చేవాడు.
స్కూల్ నుండి బాబు రాక కోసం ఎదురుచూసే నాకు అమ్మ అని గట్టిగా అరుస్తూ నన్ను చుట్టేసి స్కూల్ లో జరిగిన విశేషాలన్నీ ఏకరవుపెట్టేవాడు.నేను కూడా వాడి ముద్దు మాటలను,ఊసులను ఎంతో శ్రద్దగా వినేదాన్ని.మావారు ఆఫీసు నుండి వచ్చిన తరువాత బాబు వాళ్ళ నాన్న తో కాసేపు ఆడుకుని తరువాత వాడు నాకోసం అమ్మ అమ్మ అని వెతుకుతూ ఉంటే మావారు నాదగ్గరకి వచ్చి బుంగ మూతి పెట్టుకుని ఇదిగో వీడికి నువ్వే కావాలంట,వీడు ఎంతైనా అమ్మ కొడుకు అని నా మీద ఆయన అలిగి గదిలోకి వెళ్లిపోతుంటే వస్తున్న నవ్వుని ఆపుకోవడం నాకు చాలా కష్టమయ్యేది.కాలము చాలా తొందరగా గడిచిపోయింది చూస్తుండ గానే ప్రమోద్ పెద్దవాడయిపోయాడు.ఇప్పుడు ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరము చదువుతున్నాడు.ఈ రోజుకీ కాలేజీలో జరిగేవన్నీ నాతో చెబుతూఉంటాడు.మా తల్లీకొడుకుల ప్రేమ బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది.ఎందుకంటే ప్రేమని ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది.ఫ్రేమ వెలకట్టలేనిది.కాగితముపై వ్రాయలేనిది.మనసులో దాచుకోలేనిది.మాటలలో వర్ణించలేనిది.ఈ జగమంతా ప్రేమ మయం.ప్రేమ లేనిదే ఈ ప్రపంచములో ఏ బంధానికీ మనుగడే లేదు.ఏదిఏమయిన బాబు చిరుప్రాయములో ఈ తల్లితో పెనవేసుకున్న తొలిప్రేమ, నాకు జీవితములో లభించిన అమూల్యమైన కానుక.

మా స్నేహ బంధం

 మా స్నేహ బంధం 
 

నా తొలి స్నేహ బంధం నేను పుట్టగానే మా అమ్మతో ఆవిర్భవించింది.నాన్నతో స్నేహ బంధం మొలకెత్తింది.తరువాత నా తోబుట్టువులతో నా స్నేహబంధం చిగురించింది.నా చిన్ననాటి ప్రాణ సఖి పూర్ణిమ తో నా స్నేహబంధం  ఎదిగింది.నాకు పెళ్లి అయిన తరువాత నా భర్త తో స్నేహ బంధం మొగ్గ తొడిగింది.నేను తల్లిని అయిన తరువాత నా బిడ్డలతో నా స్నేహ బంధం వికసించింది.
నాకు వివాహము జరిగిన తరువాత,నేను మా వారి ఉద్యోగ రీత్యా మచిలీ పట్టణములో కాపురము ప్రారంభించాము(అద్దెయింటిలో).ప్రక్క వాటాలో మలాగే అద్దెకి ఉంటున్న విజయ గారితో నాకు బాగా పరిచయము ఏర్పడింది. ఆ ఇంటిలో వున్నప్పుడే నాకు బాబు పుట్టాడు.విజయగారు నాకు అన్ని  వేళలా సహాయం చేసేవారు.మా బాబు ని బాగా ఆడిపించేది.కొద్దిరోజులకే  మా పరిచయము స్నేహము గా మారింది.రెండేళ్ళు గడిచిపోయాయి,మా వారి కి బదిలీ అవ్వడము తో మేము వైజాగ్ వచ్చేసాము.వచ్చేసేటపుడు చాలా భాద అనిపించింది నాకు,విజయాకి.
 
వైజాగ్ లో మద్దిలపాలెం లో అపార్టెమెంట్ లో అద్దెకు దిగాము.వాతావరణము కొత్తగా ఉండేది.అక్కడ పక్క ప్లాట్ లలో అద్దెకు ఉంటున్న శైలజ,విజయతో పరిచయం ఏర్పడింది.ఇద్దరు నాతో బాగా మాట్లాడేవారు.నాకు పాప పుట్టింది. శైలజ పిల్లలు ,మా పిల్లలు ఒకే వయస్సు.విజయాకి ఇద్దరు  కవల  పిల్లలు.మా పిల్లల కన్నా పెద్దవాళ్ళు.వీళ్లిద్దరితో పరిచయం కొన్నాళ్లకే స్నేహముగా మారింది.విజయ నాకు అన్ని విషయాలలో తోడుగా నిలిచింది.మేము బయటకి వెళితే మా పిల్లలని చూసుకునేది.తనదగ్గర కుటుంబ విలువలను తెలుసుకున్నాను,మంచి ఆప్తమిత్రురాలయింది నాకు.
 శైలజ,నేను ఒకే వయస్సు వాళ్ళం అవడం వలన,మా కష్ట సుఖాలను మనసువిప్పి మాట్లాడుకునే వాళ్ళం.శైలజ పిల్లలు మా పిల్లలు బాగా ఆడుకునేవారు.వీళ్ళిద్దరు అన్నింటా నాకు తోడు నీడ గా ఉండేవారు.తరువాత కొన్నాళ్ళకి శైలజకి ,విజయా కి వేరే ఉర్లకి బదిలీ అవడము తో చెరో చోటుకి వెలిపోయారు. మేము కూడా అపార్టెమెంట్ కొనుక్కుని సీతమ్మదార కి మారిపోయాము.
 
అక్కడ నాకు శిరీషా,ఉదయశ్రీ, రమగారు పక్క ప్లాట్ లలో ఉంటున్న వీళ్లతో పరిచయమేర్పడింది.శిరీష,ఉదయశ్రీ నాతోటి వయసు వారే.కొద్దిరోజులకే వాళ్ళతో పరిచయం స్నేహము గా మారింది.చక్కగా మనసు విప్పి మాట్లాడుకునేవాల్లము.ఇంకా రమ గారు నాకన్నా కొంచెం వయసులో పెద్దవారు.ఆవిడతో నా స్నేహం నాకు మా అమ్మతో ఉన్నట్లే ఉండేది.తన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.జీవితములో ఎదురయ్యే కష్టాలను ఎదురుకుని ఎలా పోరాడాలి,పిల్లల పట్ల మన ప్రవర్తన ఎలా ఉండాలి,భార్య భర్తల బంధం ఎలా ఉండాలి,అన్ని విషయాలనూ సానుకూల దృక్పదముతో ఎలా చూడాలి,ఇలాంటి ఎన్నో నేర్చుకున్నాను.ఆవిధముగా  ముగ్గురితో నాకు స్నేహము ఏర్పడింది.
తరువాత మావారికి నరసారావుపేట,గుంటూరు జిల్లాకు బదిలీ అయ్యింది.కొత్త ప్రదేశము,అందరూ ఎలా ఉంటారో అని భయపడుతూ వేంకటేశ్వర అపార్టెమెంట్ లో అద్దెకు దిగిన నాకు మొదట పక్క ప్లాట్ లో అద్దెకు ఉంటున్న పధ్మజ పరిచయమయ్యింది.తన ద్వారా పద్మజ స్నేహితులయిన కిరణ్మయి,శిరీష,షాలిని,రోజ నాకు పరిచయమయ్యారు.అందరూ ఇంచుమించు నా వయస్సు వాళ్ళే.కొద్ది రోజులకే మేమంతా మంచి స్నేహితులయ్యాము.అందరం ఒక కుటుంబంలా కలిసిపోయాము.
ఎక్కడినుందో వచ్చిన నన్ను వాళ్ళతో కలుపుకుని నాకు స్నేహహస్తం అందించారు.నా కష్ట సుఖాలలో తోడుగా నిలిచారు.మా అందరిలో ఎవరికయిన కష్టము వస్తే మిగతవాళ్లు పోటీపడి సాయము చేసేవారు.అందరమూ కలిసి వాకింగ్ కి,షాపింగ్ కి ,గుడి కి వెళ్ళేవాల్లము.పుట్టిన రోజులు,పెళ్లిరోజులు అన్నీ బాగా జరుపుకునే వాల్లము.ఎవరింట్లో ఫంక్షన్ జరిగిన అందరం తల ఒక చెయ్యివేసి సహాయము చేసేవాల్లము.నూతన సంవత్సర వేడుకలు,స్నేహితులరోజు,మహిళా దినోత్సవము,వినాయక చవితి అన్నీ అందరమూ కలిసి అపార్ట్మెంట్ సెల్లార్ లో చాలా సరదాగా జరుపుకునే వాళ్ళం.పిల్లలందరూ కలిసి చక్కగా ఆడుకునేవారు.
నా స్నేహితులు ఐదుగురి లోనూ ఒక్కక్కరిలో ఒక్కో ప్రత్యేకత ఉంది.వాటన్నింటిని నేను నేర్చుకున్నాను.ఒక్క పూట ఎవరు బయట కనిపించక పోయిన,ఏమయింది అని వెంటనే తలుపు తట్టేవాల్లము.ఎన్నో విషయాలలో నేను బయపడుతుంటే భయపడకూడదు,దైర్యముగా ఉండాలి అని ఒకరు,మా అమ్మాయి స్కూల్ నుండి కడుపు నొప్పి అని ఫోన్ చేస్తే నన్ను తన బండిమీద స్కూల్ కి తీసుకు వెళ్ళిన వారు ఒకరు,నాకు ఆరోగ్యము బాగోక ఆసుపత్రికి వెళ్ళినపుడు మా అమ్మాయిని చూసుకునే వారు ఒకరు,ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి,వాళ్ళు నాకు చేసినవి,మా స్నేహము గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది.వాళ్ళు నాకు చేసిన సహాయము తో పోల్చితే నేను వాళ్ళకి చేసింది చాలా తక్కువే,అసలు లేదనే చెప్పాలి.బదులు ఏమి ఆశించనిదే స్నేహం అంటారు అందుకేనేమో.
వాళ్ళతో నా స్నేహము నా జీవితములో ఒక భాగమైపోయింది.చిన్ననాటి నా స్నేహితులతో గడిపిన రోజులు గుర్తుకొచ్చాయి నాకు.నేను కొంచెం దిగులుగా ఉన్న,ఏడిచినా,వాళ్ళతో సరిగా మాట్లాడక పోయినా ఉరుకునే వా రుకాదు. విషయము తెలుసుకొని ఓదార్చేవారు,దైర్యము చెప్పేవారు,నీకు మేము ఉన్నాము అని భరోసా ఇచ్చేవారు.అంతటి గొప్ప స్నేహబంధం మాది.అటువంటి బంధాన్ని వదిలి మేముశ్రీకాకుళము వచ్చేసినపుడు మా పరిస్థితి ఊహించడము ఎవరి తరము కాదు,అందరూ వాళ్ళ భాదను లోలోపలే దాచుకుని నాకు వీడ్కోలు చెప్పారు,కానీ నేను ఆపుకోలేక పద్మజాని పట్టుకుని ఏడ్చేశాను.ఇప్పటికీ మా స్నేహబందం అలాగే కొనసాగుతుంది.మా స్నేహానికి గుర్తుగా నేను ఒక కవితను కూడా రాశాను.
                     
మా స్నేహం 

సూర్యుడి ‘’కిరాణా’’లు సోకిసోకగానే,
వికసించిన ‘’పధ్మ’’ము మన స్నేహము,
అపుడే పూచిన ‘’రోజా’’ పూలతో ,ఆ’’లక్ష్మి’’ని పూజించి,
కోటి రాగాలతో ‘’వీణ’’ను మీటగా వచ్చే,
నవ్వుల ‘’శిరి’’యే మన స్నేహ’’షాలిని’’,
గలగలా పారే గోదావరిని,
జలజల సాగే మన స్నేహాన్ని ,
ఎవరూ ఆపలేరు .
 
మేము శ్రీకాకుళము వచ్చిన తరువాత కొన్ని నెలలకి,మా వారి ఇంజనీరింగు లో కలిసి చదువు కున్న స్నేహితుల ఫ్యామిలి రీయూనియన్ హైదరబాద్ లో లియోనియా రిసార్ట్స్ లో జరిగింది.చాలా బాగా జరుపుకున్నాము.మా వారి స్నేహితులలో చాలా మందిని  కలవడం అదే మొదటిసారి.అక్కడ మావారితో పాటు ఇంజనీరింగ్ చదువు కున్న సత్యవతి గారిని ,నాకు మావారు పరిచయము చేశారు.సత్యవతిగారు నేను ఒక ఫ్రీలాన్స్ రైటర్ని,నా బ్లాగ్ చూడండి అంటూ ఏవో చెబుతూ తనని తాను పరిచయము చేసుకుంటున్నారు.నాకు ఏమి అర్ధము కాలేదు.ఆమె మాటలు విన్న మా అబ్బాయి ‘’ఆంటీ మా అమ్మ కూడా కవితలు,కథలు రాస్తుంది ‘’అని చెప్పాడు.
అప్పుడు సత్యవతిగారు ‘’అవునా అయితే మీరు వ్రాసి ప్రచురణకి పంపించండి ‘’అని ప్రోత్సహించారు.నేను మీలాగా వ్రాయలేను అని భయపడుతున్న నాకు మీరు వ్రాయగలరు అని నాకు దైర్యము చెప్పారు.హైదారాబాద్ లో మేము మాట్లాడింది కొన్ని నిమాషాలే.కానీ తరువాత నాకు ఫోన్లో నేను ఎలా వ్రాయాలి,అంతర్జాలములో పత్రికలుంటాయి,వాటిని  ఎలా  పంపాలి అన్నీ నాకు అడుగడుగున పోత్సహిస్తూ సహాయం చేశారు.సత్యవతిగారి పరిచయము తో మరుగున పడిన నా కళకు జీవము పోసినట్లయింది.తన ఋణము నేను తీర్చుకోలేనిది.నేను రాసిన కథలు ,కవితలు ప్రచురణ అయ్యాయి.ఇదంతా ఆమె ఇచ్చిన స్పూర్తి.ఆమె నాకు ఎంత స్పూర్తి ని ఇచ్చారంటే  ప్రతిలిపి.కామ్లో ఆమెతో పాటు పోటీలో నన్ను నిలబెట్టారు.నా జీవితములో సత్యవతి గారితో స్నేహబంధం ఒక అద్బుతమ్ అంటాను.
 
నా జీవితము లో ఏర్పడ్డ ఏ స్నేహబందాన్ని నేను విడిచిపెట్టను,అన్నీ నాకు గొప్పవే,ఒక్కో స్నేహం ఒక్కో అనుభూతి. మా వారు నాతో ఎప్పుడు అంటూఉంటారు ‘’నీలో ఏదో ఒక అద్భుతమైన శక్తి ఉంది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా మంచి స్నేహాన్ని,స్నేహితులను సంపాదించుకుంటావు,నాకు మాత్రం చేతనవదు అని’ ఏమో మరి నాకు సంభందించినంతవరకు నా స్నేహబంధం ఆ దేవుడు నాకు ఇచ్చిన వెలకట్టలేని ఒక వరములా భావిస్తాను.

అమ్మ పిలుపు

అందమైన విశాఖపట్టణం లో ఒక మధ్యతరగతి మానవుని నివాస గృహం అది. ఆ ఇంటిలో అద్దెకు నివసిస్తున్నారు ఆదినారాయణ,లలితాంబ దంపతులు ,వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు లక్ష్మి,పార్వతి. లక్ష్మి వయస్సు ఆరు సంవత్సరాలు,పార్వతి వయస్సు మూడు సంవత్సరాలు.ఆదినారాయణ ఒక ప్రైవేట్ కంపెనీ లో చిన్న ఉద్యోగము చేస్తున్నాడు,నెలకి జీతము ఏడువేలు. భార్య లలితాంబకు నాట్యము లో కాస్త ప్రావీణ్యం ఉండడం చేత చుట్టు ప్రక్కల పిల్లలకు నాట్యం నేర్పుతూ ఒక మూడు వేలు సంపాదిస్తుంది. ధరలు నెత్తిన కూర్చుని తాండవిస్తున్న ఈ రోజులలో ఆ ఇద్దరి సంపాదన ఏ పాటి .ఇద్దరి పిల్లలతో ఆ చిన్న మొత్తముతో సంసారాన్ని నెట్టుకువస్తున్నారు. పెద్దమ్మాయి లక్ష్మి ఒకటవ తరగతి చదువుతుంది ఇక చిన్న అమ్మాయిని స్కూల్ లో వేసే వయస్సు వచ్చేసింది. పెద్దమ్మాయిని జాయిన్ చేసి డొనేషన్లు నెల తిరిగే సరికి ఫీజులతో సతమత మయ్యే ఆదినారాయణకు ఇప్పుడు చిన్నమ్మాయి ని స్కూల్లో చేర్పించడానికి డబ్బులకి తడుముకోవలసిన పరిస్థితి ఏర్పడింది.మొత్తానికి ఎలాగయితేనేమీ డబ్బు ఏర్పాటు చేసి పార్వతిని కూడా స్కూల్ లో చేర్పించారు ఇద్దరు పిల్లలు శ్రద్దగా చదువుకుంటున్నారు .
ఒకనాటి రాత్రివేళ ఆదినారాయణ ,లలితాంబ తమ సంసారాన్ని గురించి ముచ్చడించుకుంటూ ఇప్పుడున్న పరిస్థితులలో మూడవ బిడ్డ ఇంక వద్దు కుటుంబనియంత్రణ చేయించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఇద్దరు ఆపరేషన్ నేను చేయించు కుంటానంటే నేను చేయించుకుంటాను అని పోటీపడ్డారు ఎటూ తేలక విషయాన్ని వాయుదా వేస్తూ నిద్రకు చేరువయ్యారు.
తెల్లవారింది. లలితాంబ తన పనులలో నిమగ్నమయింది. పిల్లలిద్దరూ స్కూల్ కి వెళ్లడానికి తయారవుతున్నారు.ఆదినారాయణ పేపరు చదువుతూ వాల్ కుర్చీలో కూర్చున్నాడు పేపరులో ఉన్న ఒక ప్రకటన చదువుతున్న ఆదినారాయణకు భార్య తనని పిలుస్తున్న పిలుపు అతని చెవిన పడలేదు .భర్తని అంతగా ఆకర్షించిన విషయము ఏమిటబ్బా అని ఆలోచిస్తూ అదే విషయాన్ని భర్తను అడిగింది ఆలోచనల నుండి బయటకి వచ్చిన ఆదినారాయణ భార్యతో ‘’నీ పని అంతా ముగిశాక ఒకసారి వస్తే నీతో ఒక విషయము మాట్లాడాలినేను ఆఫీసుకి కూడా ఈ రోజు సెలవు పెడుతున్నాను ‘’ అని చెప్పాడు .సెలవుపెట్టి మరీ మాట్లాడుకోవలసిన విషయము ఏమయిఉంటుంది అని గెడ్డము మీద చెయ్యి వేసుకుంటూ వంటింట్లోకి వెళ్ళి పోయింది .
ఆదినారాయణ తన స్నానము అనీ ముగించుకుని భార్య రాకకై ఎదురుచూస్తూ ‘’లలితాంబ ఎంతసేపు త్వరగా రా ‘’అని పిలిచాడు ‘’ఇదిగో వస్తున్నానండి ‘’అంటూ కాఫీ గ్లాస్ ను భర్తకు అందిస్తూ ‘’ఇప్పుడు చెప్పండి ఆ ముఖ్యమైన విషయం’’ అని భర్త పక్కనే కూర్చుని అడిగింది.అప్పుడు ఆదినారాయణ భార్యకు పేపరులో ఉన్న ప్రకటన చూపించాడు ఆ ప్రకటన లో ఇలా వ్రాసి ఉంది అమెరికా లో దనవంతులైన ఒక దంపతులకు పిల్లలు లేని కారణముగా వాళ్ళు భారతదేశములోని ఒక బిడ్డను దత్తత చేసుకోవడానికి ఆశపడుతున్నారు కానీ పుట్టిఉన్న బిడ్డని కాకున్నా పుట్టబోయే బిడ్డను దత్తత తీసుకోవాలని అనుకుంటున్నారు అందుకొరకు బాగా ఆరోగ్యముగా ఉన్న దంపతులు తమకు ఒక బిడ్డను కని ఇవ్వాలని అందుకు బదులుగా కోటి రూపాయలు చెల్లించుకుంటారు ఆసక్తి కల దంపతులు ఈ కింది చిరునామా లో సంప్రదించగలరు అని కిందన చిరునామాను చూపించాడు భార్యకి ఆదినారాయణ .
లలితాంబ ప్రకటన చదివి ఇది నన్నెందుకు చదవమన్నారు అంటూ భర్త వైపు అర్ధముకానట్లుగా చూస్తూ అడిగింది ‘’ఆ బిడ్డను కని ఇచ్చే దంపతులము మనమే ఎందుకు కాకూడదని’’ ఆదినారాయణ భార్యని అడిగాడు ‘’మీకు మతి పోయిందా! ఏమిటి బిడ్డను మనము కనివ్వడమేమిటి వేళాకోలముగా ఉందా!’’ అని భర్తను అడిగింది.వేళాకోలము కాదు కాస్త ప్రశాంతముగా ఆలోచించి ప్రకటన మరోసారి చూడు అని పేపరు ఇచ్చి నచ్చ చెప్పబోయాడు. ఎన్ని సార్లు చదివిన సరే ఇందుకు నేను ఒప్పుకోనని లలితాంబ చెప్పేసింది. చూడు బదులుగా మనకి కోటి రూపాయలు వస్తాయి మన ఆర్ధిక పరిస్థితి మెరుగవుతుంది మన పిల్లలను బాగా చదివించవచ్చు అని చాలా రకాలుగా భర్త నచ్చ చెప్పినా ఆమె అందుకు అంగీకరించలేదు, “బిడ్డను కని ఇచ్చేయడమంటే అంత తేలిక అనుకుంటున్నారా?అది పేగు బంధం ఏ తల్లి తన బిడ్డను దూరము చేసుకుని ఉండలేదు ,అంతవరకు ఎందుకు మన లక్ష్మీనో ,పార్వతినో ఎవరికో దత్తత ఇస్తే మీరు ఉండగలరా’’అని ప్రశ్నించింది . “అది వేరు ఇది వేరు నీవు మన పిల్లలని కనడమే కాకుండా పెంచావు కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది కానీ ఇక్కడ అలా కాదు మనము కన్న వెంటనే బిడ్డను చూడకుండా వాళ్ళకు ఇచ్చేయడమే అంతే ఇది చాలా తేలిక పైగా మనము ఇప్పుడున్న పరిస్థితులలో లక్ష రూపాయలు సంపాదించాలంటే చాలా కష్టము అలాంటిది కోటి రూపాయలంటే మాటలా అయిన మనము అనుకోగానే అయిపోతుందా మనము వాళ్ళని కలవాలి,వాళ్ళకు మనము నచ్చాలి ఇవన్నీ జరిగాకే నువ్వు బిడ్డను కని ఇవ్వాలి’’ అని భార్యని చాలా రకాలుగా నచ్చజెప్పి చిట్టచివరకు వాళ్ళను కలవడానికి ఒప్పించాడు.కానీ లలితాంబ అయిష్టముగానే అంగీకారము తెలిపి భర్త వెంట పేపరు లో తెలిపిన చిరునామాను వెతుక్కుంటూ బయలుదేరారు. మొత్తానికి అందులో తెలిపిన నాలుగంతస్తుల భవనానికి ఇద్దరు చేరుకున్నారు లిఫ్ట్ లో నాలుగో అంతస్తుకి చేరుకున్నారు. అక్కడ వాళ్ళకి ఒక విషయము ఆశ్చర్యచకితులని చేసింది. వీరిలాగానే బిడ్డను కని ఇవ్వడానికి అక్కడ చాలా మంది దంపతులు ఉద్యోగము కొరకు దరఖాస్తులు పెట్టుకోవడానికి వచ్చినట్లు బారులు తీసి ఉన్నారు. అది చూసిన ఆదినారాయణ భార్యతో ‘’చూసావా బిడ్డను కని ఇవ్వడము నేరము పాపము అని అన్నావు అది నేను నీ చేత చేయిస్తున్న పాపము అని అన్నావు ఇక్కడ చూడు ఎంత మంది ఉన్నారో వాళ్ళది మాత్రం కన్న ప్రేమ కాదా వాళ్ళు నవమాసాలు మోయరా! అంతటికీ కారణం డబ్బు లలితాంబ డబ్బు అదిలేనిదే మనుగడ లేదని నేటి మానవుడు బాగా గ్రహించాడు అందుకే బిడ్డ కావాలనుకునేవాడు డబ్బుని ఆశగా చూపాడు ఆడబ్బు కోసమే మనం బిడ్డను ఇవ్వడానికి వచ్చాము అంతా డబ్బు మహిమ ఏమి చేస్తాము నడు’’అన్నాడు. లైను లో నిల్చోమని వాచమన్ ఆదేశించడముతో ఇద్దరు లైనులో నిల్చున్నారు చివరకు సాయంత్రము ఆరుగంటలకి ఆదినారాయణ లలితాంబలను లోనికి పిలిచారు. లోనికి వెళ్ళిన వెంటనే అక్కడ ఉన్న ఇద్దరు మగ వ్యక్తులకు ఇద్దరు నమస్కారము చేసి వాళ్ళు సూచించిన కూర్చిలలో కూర్చున్నారు ఇద్దరు.అక్కడ ఉన్న ఇద్దరిలో ఒకరు ప్రశ్నలు వేయగా ఒకరు ఆదినారాయణ చెప్పిన సమాధానాలను వ్రాస్తున్నాడు .కుటుంబము,ఉద్యోగము,పిల్లలు తాతలు ముత్తాతలు ఇలా చాలా రకాల ప్రశ్నలు బిడ్డను ఎందుకు కని ఇవ్వాలనుకుంటున్నారు,ఇద్దరికీ అంగీకారమేన మొత్తము ఇలా 45 నిమిషాలు పాటు ప్రశ్నల వర్షము కురిపించారు అన్నింటికీ ఆదినారాయణ చాలా ఓపికగా సమాదానమిచ్చాడు .సరే అతి త్వరలో మా నిర్ణయాన్ని తెలుపుతూ మీకు లేఖ వస్తుంది అప్పుడు మీరు మమ్మల్ని సంప్రదించవలసి ఉంటుంది అంటూ ఆ ఇద్దరు ఆదినారాయణకు కరచాలనము చేసిన తరువాత దంపతులిద్దరూ ఇంటిముఖం పట్టారు.
ఇద్దరు ఇంటికి చేరేసరికి పిల్లలిద్దరూ పక్కింట్లో ఆడుకుంటూ అమ్మానాన్నలని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఇద్దరినీ నడుము చుట్టూ చేతులతో చుట్టేస్తూ “మమ్మల్లి ఒదిలి ఎక్కడికి వెళ్లారు’’? అని ప్రశ్నిస్తున్నవాళ్ళకి లలితాంబ ఏదో చెప్పి నచ్చజెప్పి పక్కింటి వాళ్ళకి ధన్యవాదాలు తెలిపి తాళము తీసి ఇంట్లోకి వెళ్లింది.గబగబా స్నానము ముగించుకుని వంట చేసి పిల్లలకి తినిపించి వాళ్ళని నిద్రబుచ్చి భర్తకి వడ్డించి తను తిని నిద్రకు ఉపక్రమించింది
తెల్లవారింది ఎవరి డ్యూటిలకు వాళ్ళు వెళ్ళిపోయారు .ఆఫీసుకు బయలుదేరుతూ ఆదినారాయణ పోస్ట్ వస్తే నాకు ఫోన్ చేసి చెప్పు అని బయలుదేరాడు .ఆఫీసుకి వెళ్లాడే గాని లెటర్ వస్తుందా అనే ఆలోచనలోనే కాలం గడిపాడు .ఇంటికి వస్తూనే పోస్ట్ ఏమయినా వచ్చిందా అని భార్యను ప్రశ్నించాడు అందుకు ఆమె రాలేదని తల అడ్డముగా ఊపింది. ఇలా వరుసగా 20 రోజులు గడిచాయి ఇంక తనకి లెటర్ రాదేమో అని నిరుత్సాహముగా ఉన్న ఆదినారాయణకు లెటర్ వచ్చింది అన్న మాటను భార్య నోట విన్న తరువాత అతని ఆనందానికి అవదులు లేవు .మరుసటి రోజు ఆ లెటర్ తీసుకుని బార్యభర్తలు ఇద్దరు ఆ నాలుగంతస్తుల భవనానికి చేరుకున్నారు .అక్కడ వీళ్లలాగే మరికొంత మంది దంపతులు లెటర్లు పట్టుకుని కూర్చుని ఉండడము గమనించిన ఆదినారాయణ కొంచెం నిరుత్సాహపడ్డాడు. అందరినీ లోపలికి ఒకేసారి పిలవడంతో అందరూ లోనికి వెళ్ళి కూర్చున్నారు .అక్కడ ఉన్న వ్యక్తి వీళ్లతో ‘’చూడండి మొత్తము అందరిలో మిమ్మల్ని మేము ఎంచుకున్నాము మీరు మేము చెప్పిన పరీక్షలు అన్నీ చేయించుకోండి. రిపోర్ట్స్ వచ్చాక మిగతా మాట్లాడుకుందాము’’ అని చెప్పి వాళ్ళందరికీ ఒక ఆసుపత్రి పేరు చెప్పి అక్కడికి పంపించాడు. పరీక్షలు అన్నీ అయిన తరువాత ‘రిపోర్ట్స్ వచ్చాక మీలో ఎవరికయితే మావద్ద నుండి లెటర్ వస్తుందో వాళ్ళు మమ్మల్ని సంప్రదించవలసి ఉంటుంది’’అని ఆ వ్యక్తి చెప్పడం తో ఆదినారాయణ ,లలితాంబ అక్కడినుండి ఇంటి ముఖం పట్టారు. రాత్రి పక్క సర్దుతూ ‘’ఈ టెస్టులు ఏమిటో లెటర్లు ఏమిటో అంతా గందర గోలముగా ఉంది వాళ్ళకి ఒక బిడ్డ కావాలంటే మనకి ఎన్ని తిప్పలు పెడుతున్నారు ఏమిటీ కర్మ’’ అని లలితాంబ విసుగుకుంది .దానికి ఆదినారాయణ “ఎందుకలా విసుగుకుంటావు డబ్బులు రావడం అంటే మాటలా! కష్టపడితే గాని ఫలితము దక్కదు అలాగే ఇది కూడా’’అని చెప్పి నిద్రలోకి జారుకున్నాడు .
ఆదినారాయణ మరల లెటర్ కోసం ఎదురుచూడసాగాడు మనసులో దేవుణ్ణి లెటర్ తనకే వచ్చేటట్లు చెయ్యమని ప్రార్దించసాగాడు .లలితాంబ మాత్రం ఆ విషయమే పట్టనట్లుగా తన పనిలో తాను లీనమయిపోయింది .మొత్తానికి లెటర్ వచ్చింది భార్యభర్తలిరువురు లెటర్ లో చెప్పిన ప్రదేశానికి చేరుకున్నారు ఈ సారి అక్కడ వీళ్లలాగా ఎవరూ లేకపోవడము గమనించిన ఆదినారాయణ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు.లోపలికి వెళ్ళగానే అక్కడ ఉన్న వ్యక్తి “కంగ్రాట్స్ ఆదినారాయణ గారు మొత్తము పది జంటలలో మేము మిమ్మల్ని సెలెక్ట్ చేశాము’’ అని చెప్పి ఇద్దరినీ కూర్చోమని చెప్పి,ఇక షరతుల విషయానికి వద్దామని వాటిని వివరించాడు “మొదటిది మీ భార్యకు గర్భం వచ్చిన వెంటనే మాకు తెలియబరచాలి. ఆ నిమిషము నుండి ఆవిడ ప్రసవము అయ్యేవరకు మీ కుటుంబము మొత్తము మేము నిర్దేశించిన బంగళాలో ఉండాలి. ఆవిడ పరీక్షల నిమిత్తము ఇంటివద్దే డాక్టర్ వచ్చి చూస్తారు .ప్రశవానికి మాత్రమే ఆసుపత్రికి తరలిస్తాము .రెండవది, బిడ్డ పుట్టిన వెంటనే మాకు అప్పగించాలి. వెను వెంటనే మీ డబ్బు మీకు అందుతుంది.ఆతరువాత ఒకరితో ఒకరికి ఎటువంటి సంబంధం ఉండదు.అందుకే బిడ్డను కోరే తల్లితండ్రులను మీకు చూపించలేదు. వాళ్ళకి మీగురించి తెలియదు ఇక ఆ బిడ్డ గురించి ఎప్పుడూ ఆరా తీయకూడదు .ఈ షరతులన్నీ మీ ఇద్దరికీ అంగీకారమయితే ఈ పత్రము మీద అన్నీ చదువుకుని బాగా ఆలోచించి ఇద్దరు సంతకాలు లు పెట్టండి’’అని ఆదినారాయణకు పేపర్లు అందించాడా వ్యక్తి .ఇద్దరు వాటిమీద సంతకాలు చేసి పేపర్లు అందిస్తూ “మమ్మల్నే మీరు ఎంచుకోవడానికి కారణము తెలుసుకోవచ్చా!అని ఆదినారాయణ అడిగాడు.అందరిలో ‘’మీది మంచి కుటుంబము,ఏ దూరాలవాట్లు లేవు మీరు పరిపూర్ణ ఆరోగ్యవంతులు అందుకే మిమ్మల్ని ఎంచుకున్నాము’’ అని చెప్పగానే ఆదినారాయణ చిరునవ్వు తో కృతజ్ఞతలు తెలిపి అక్కడి నుండి ఇంటికి చేరుకున్నారు.
కొన్ని రోజులతరువాత లలితాంబ వాంతులు చేసుకోవడముతో డాక్టర్ తో పరీక్ష చేయించుకుని తను గర్భవతి అని నిర్దారణ అయిన తరువాత ఆదినారాయణ తనకి ఇచ్చిన ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి విషయము తెలిపాడు. “మీరు
వెంటనే ఆ ఇల్లు ఖాళీ చేసి నేను చెప్పిన ఇంటికి మారిపోండి ,మీ భార్య గర్భవతి అని ఎవరికి తెలియకూడదు’’అని చెప్పి కొత్త ఇంటి అడ్రస్సు చెప్పాడా వ్యక్తి .వెంటనే ఆదినారాయణ ఇంటి ఓనరు వద్దకు వెళ్ళి ఇల్లు ఖాళీ చేస్తున్నామని చెప్పగా దానికి ఓనరు ఇలా భాద పడ్డాడు ‘’మీ లాంటి మంచివాళ్ళు మాకు మళ్ళీ దొరకరు,ఎందుకు ఖాళీ చేస్తున్నారు’’ అని ప్రశ్నించాడు.దానికి ఆదినారాయణ ఏమి చెప్పలేకపోయాడు.చుట్టుపక్కల ఉన్నవాళ్ళు రకరకాల ప్రశ్నలు వేశారు,దానికి భార్యాభర్తలిరువూరు సమాదానము చెప్పలేకపోయారు,ఎందుకంటే అబద్ధం చెప్పడమనేది వాళ్ళకి చేతకాదు కనుక.ఆదినారాయణ కుటుంబంతో సహా ఇల్లు మారాడు.అది చాలా పెద్ద బంగాళా,ఇంటి నిండా నౌకర్లు,ఇంటి ముందు పెద్ద పూలతోట.
పిల్లలిద్దరూ ఇంటిని చూడగానే చాలా ఆనందంతో ఇల్లంతా గంతులేశారు. “నాన్న ఇల్లు చాలా బాగుంది”అని లక్ష్మి ఆదినారాయణ తో చెప్పి చెల్లి తో తోటకి పరుగులు తీసింది. ఆదినారాయణకు జీవితంలో అటువంటి ఇంట్లో అద్దెకు దిగి ఉండగలనని కూడా అనుకోలేదు,అలాంటిది ఆ బంగళా తమ సొంతం అని తెలిసేసరికి,కళ్ళ వెంబడి నీళ్ళు తిరిగాయి.భార్యకి కూడా నీళ్ళు తిరిగాయి ,కాని బంగళా గురించికాదు,పాపం చేస్తున్నానేమోనని,అదే విషయం భర్త తో చెప్పింది.దానికి ఆదినారాయణ భార్యను కూర్చోబెట్టి “చూడు లలితాంబ మనం పాపం చేస్తున్నామని ఎందుకు అనుకుంటున్నావు డబ్బు తీసుకొని,బిడ్డను ఇస్తున్నామనే కదా! నువ్వు అలా ఎందుకు అనుకోవాలి,బిడ్డలు లేని ఒక దంపతులకు నువ్వు బిడ్డను కని వరంగా ఇస్తున్నావు,దానిని త్యాగం అంటారు,ఏ తల్లి తన బిడ్డను ఇవ్వలేదని అన్నావు,అలాంటిది నువ్వే ఇస్తున్నావు అంటే,నీమనసు అంత ఊదారమైనది,త్యాగమైనది,ఇంకొకరికి మనశ్శాంతిని బిడ్డ రూపము లో ఇస్తున్నావు.ఇక డబ్బు అంటావా,అది నువ్వు జెల్సా చెయ్యడానికో,నేను జెల్సా చెయ్యడానికో కాదు ,మన బిడ్డల భవిషత్తు కోసం,ఆదేవుడే చూపించిన దారి ఇది అనుకో,అంతేకాని పదే,పదేతప్పుచేస్తున్నావని ఎందుకు మనసులోనే బాధపడతావు,ఇలాంటి సమయము లో నువ్వు ఎంతో ప్రశాంతంగా ఉండాలి,మనం ఆ దంపతులకిచ్చిన మాటను నిలబెట్టుకోవాలి.
వాళ్ళకి డబ్బు ఉంది కాబట్టి ఇస్తున్నారు కానీ మనం చేసేది,బిడ్డను దానం చేయడం,అది చాలా గొప్పది,సరేనా.....మనసులో ఎటువంటి ఆలోచన పెట్టుకోకున్నా ప్రశాంతంగా ఉండు’’ అని చెప్పి లోపలికి వెళ్లిపోయాడు.భర్త చెప్పిన మాటలు లలితాంబకు కాస్త ఊరటకలిగించాయి .ఆ రోజు నుండి బంగళాలో వాళ్ళ జీవితం మొదలైయింది.లలితాంబ కాళ్ళు కిందపెట్టకుండా అనుక్షణము చూసుకోవడానికి ,టైమ్ ప్రకారం మందులు ఇవ్వ డానికి,పిల్లలను చూసుకోవడానికి,ఇల్లంతా నౌకర్లు ఉన్నారు ఆ ఇంట్లో,తనకు బోరు కొట్టకుండా కారులో తీసుకువెళ్ళడం,వాకింగ్ కి తీసుకు వెళ్ళడంఅన్నీ పద్దతి ప్రకారం జరుగుతున్నాయి. రోజులు దొర్లుతున్నాయి ,లలితాంబకు నెలలు నిండుతున్నాయి క్రమము తప్పకుండా డాక్టరు వచ్చి చూసి వెళుతున్నారు .తొమ్మిది నెలలు నిండగానే ఆసుపత్రి లో జాయిన్ చేశారు లలితాంబని .అయితే ఆపరేషన్ చేయాలన్నారు డాక్టరు .ఆదినారాయణ కాస్త కంగారుపడ్డాడు,లలితాంబ తనకు కుటుంబనియంత్రణ శస్త్రచికిత్స కూడా చేయ్యించమని కోరగా ఆదినారాయణ సరే అని అన్నాడు .ఆపరేషన్ జరిగింది లలితాంబ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది .
కొంతసేపటికి లలితాంబకు స్పృహ వచ్చింది .చుట్టూ వెతికింది తన బిడ్డకోసం ,ఊయలలో నిద్రపోతున్న తన బిడ్డని తన పక్కన పడుకోబెట్టమని నర్సుని కోరింది .తన బిడ్డని తేరిపార చూసుకుంది బాబు బొద్దుగా ముద్దుగా ఉన్నాడు వాడి ముఖం తేజస్సు గా ఉంది మేను రంగు పాలతో పోటీ పడుతున్నట్లు ఉంది చక్రాల్లాంటి కళ్ళు అటుఇటు తిప్పుతూ చూస్తున్నాడు అచురుకు ,చూపు,నవ్వు,చూస్తే ఎవరైనా ఇట్టే ఆకర్షితులైపోతారు .బాబు ఛాతీ మీద గుమ్మడిగింజ పరిమాణముతో పుట్టుమచ్చ వాడి తెల్లని మేను మీద పెట్టిన మచ్చలా ఉంది .ఆపరేషన్ జరగడమువలన బాబుని తనివితీరా ముద్దాడలేకపోయింది ,లాలించలేకపోయింది ,ఆదినారాయణ కూడా వచ్చి భార్య పక్కన కూర్చొని బాబుని ముద్దులాడాడు ,వాళ్ళిద్దరి ముచ్చట్లు బాబుతో తీరక ముందే ఆ ఇద్దరు వ్యక్తులు వచ్చి బిడ్డను అప్పగించవలిసిందిగా ఆదినారాయణను కోరారు .బిడ్డను వాళ్ళకు అప్పగిస్తుండగా లలితాంబ బోరున విలపించింది ఆవేదన వర్ణాతీతమైంది .ఆమె కనుక తన కడుపులో భాదని ఆపుకోలేక ఎడ్చిందో ఆ ఆసుపత్రే కూలిపోతుంది ,అంత భాదని తనలోనే దాచుకుని కన్నీళ్లని మాత్రం నేల తల్లికి సమర్పించుకుంది .
ఆదినారాయణకు అప్పటివరకు ఏమి అనిపించలేదు ,కాని బిడ్డను వాళ్ళ చేతిలో పెడుతుంటే డబ్బు కోసం బిడ్డను అమ్ముకునే నీచ స్థితికి నేను దిగజారానా అనే భయం అతడి మనసులో చెలరేగింది ,చేతులు వణికాయి ,గుండెల్లో ధడ మొదలైంది .లలితాంబ ఆడది కనుక తన భాదని కన్నీళ్ళ రూపం లో తన వేదన బయటపెట్టింది.కాని ఆదినారాయణ మనసు లోలోపలే కుమిళిపోయాడు. బిడ్డలు లేనివాళ్ళకు సాయం చేస్తున్నానని తన మనసుకి సరిచెప్పుకుని బిడ్డను అప్పగించాడు .వాళ్ళు బిడ్డను అందుకుని వెనువెంటనే కోటి రూపాయలను ఆదినారాయణకు అందజేస్తూ షరతులన్నీ గుర్తున్నాయి కదా ,ఇక ఈ బిడ్డను మరిచిపోండి అని చెప్పి అక్కడి నుండి ఆ ఇద్దరు వ్యక్తులు వెళ్ళిపోయారు .డబ్బులు అందుకున్న ఆదినారాయణ భాదతో అక్కడే కుర్చీలో కూలబడ్డాడు .తన బిడ్డకు పాలైనా ఇవ్వకుండా దూరం చేసుకున్నానే అని లలితాంబ ఆవేదన వ్యక్తం చేసింది .భర్త ఎన్నో విదాలుగా ఓదార్చడానికి ప్రయత్నించాడు .కొద్ది రోజులకి ఆమె ఆసుపత్రి నుండి ఇంటికి చేరుకుంది. ఆదినారాయణ పెద్ద కూతురు లక్ష్మి తల్లి ని “బుజ్జిబాబు ఏడి’’అని ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు ఆమె బదులు ఇవ్వలేక లోలోపల కుమిలిపోయింది. “ఓహో బుజ్జిబాబు ఇంకా పుట్టలేదా! అని అడిగి అక్కడ నుండి వెళ్ళిపోయింది.
రోజులు దొర్లుతున్నాయి. లలితాంబ ఏడుస్తూనే వుంది. ఆదినారాయణ కు ఆమె ను ఓదార్చడం అనేది పెద్ద సమస్యగా మారింది. చేసేదేమీ లేక కాలమే మాన్పుతుంది అని మౌనం గా వున్నాడు.
ఆదినారాయణ తన పిల్లలను మంచి స్కూల్ ల లో చేర్పించాడు. తన బార్య నాట్యం ద్వారా బిడ్డ గురించి మర్చిపోతుందని భావించి నాట్య కళాశాలను స్థాపించాడు. అందులో “ఉచితంగా నాట్యమునకు శిక్షణ ఇవ్వబడును” అనే ప్రకటన చాలా మందిని ఆకర్షించింది. ఇప్పుడు ఆ కళాశాల లో చాలా మంది లలితాంబ వద్ద నాట్యాన్ని అభ్యసిస్తున్నారు. ఆ విధంగా ఆమెకు కాస్త ఊరట కలిగింది.
రోజులు కాస్త నెలలు. నెలలు కాస్త సంవత్సరాలుగా దొర్లిపోయాయి. ఆదినారాయణ, తన బార్య బాబు గురించి మర్చిపోయింది అని భావిస్తున్నాడు. కానీ తాను మాత్రం లోలోపలే బాధ పడుతున్నాడు. ఆయనకి తెలియని విషయం ఏమిటి అంటే భార్య ఆ విషయాన్ని మర్చిపోనే లేదు. ప్రతి సంవత్సరం తన బాబు పుట్టిన రోజున పది మంది పేద వారికి కడుపునిండా అన్నం పెట్టి నూతన వస్త్రాలు వారికి ఇవ్వడం ద్వారా తన బాబు పుట్టిన రోజుని జరుపుతుందని భర్తకు తెలియధు.
లక్ష్మి పార్వతి ఇద్దరు నాట్యం లో ఉత్తీర్ణులయ్యారు. ఇద్దరు అదే కళాశాలలో తన తల్లి వలె పలువురి విధ్యార్ధులకు నాట్యం నేర్పిస్తున్నారు. లక్ష్మి కి పెళ్లి వయసు వచ్చింది. ఆదినారాయణ తన బిడ్డకు మంచి వరుడ్ని వెతికి వైభవంగా పెళ్లి జరిపించాడు లక్ష్మి తన అత్త వారింట్లో ఆనందముగా అడుగుపెట్టింది.
ఇది ఇలా వుండగా అమెరికా లో ఆదినారాయణ బిడ్డ రాకేష్ పెంచుకున్న తల్లి తండ్రులకు గారల బిడ్డగా పెరిగాడు. రాకేష్ తల్లి తండ్రులకు బిడ్డే ప్రపంచము. రాకేష్ లేనిదే వాళ్ళకు జీవితమే లేదు. రాకేష్ కు పెంచుకున్న బిడ్డ అనే భావం రాకుండా పెంచారు. రాకేష్ కి ఇప్పుడు 20 సంవత్సరములు నిండాయి. భారతదేశం లో నాట్యకళలమీద పరిశోధన చేయడానికి అమెరికా నుండి బయలు దేరి ఇండియా చేరుకున్నాడు. తన పరిశోధన నిమిత్తము ఆంధ్ర ప్రదేశ్ లో విశాఖపట్నం చేరుకున్నాడు. అక్కడ లలితాంబ నడుపుతున్న కళాశాల గురించి నాట్యం లో ఆమెకు వున్న ప్రావీణ్యము గురించి ముఖ్యముగా ఉచితం గా నాట్యం నేర్పుతున్నారు అని తెలుసుకుని ఆ కళాశాలకు చేరుకున్నాడు. లలితాంబ ను కలుసుకోవడానికి అపాయింట్మెంట్ తీసుకుని ఆమె ఆఫీసు రూమ్ లోకి వెళ్ళాడు. ఆమెను చూడగానే రాకేష్ కు ఏదో తెలియని అనుభూతి, ఆనందం కలిగాయి. ఆ భావం బయటికి తెలుపలేనటువంటిది. ముఖ పరిచయం కూడా లేని ఈమెను చూస్తుంటే నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది అని మనసులో అనుకున్నాడు. లలితాంబకు కూడా అదే అనుభూతి కలిగింది. తన కొడుకుకి ఇప్పుడు సరిగ్గా ఇంతే వయసు ఉంటుంది అని తన మనసు లో అనుకుంది.
రాకేష్ తాను వైజాగ్ వచ్చిన పని గురించి తన పరిశోధన గురించి లలితాంబ తో చర్చించాడు. అయితే తన పరిశోధన జరిగినంత కాలం రాకేష్ ని లలితాంబ తన ఇంటి వద్దనే వుండమని చెప్పింది. ఆమె తో మాట్లాడిన తరువాత రాకేష్ కి అభ్యంతరము చెప్పాలనిపించలేదు.సరే అని చెప్పి మేనేజర్ ని కలిసి లలితాంబ వాళ్ళ ఇంటికి చేరుకున్నాడు. ఆ పెద్ద బంగళాలో తన కి ఇచ్చిన గదిలో విశ్రాంతి తీసుకున్నాడు. రాత్రి బోజనానికి రాకేష్ ని డైనింగ్ టేబల్ దగ్గిరికి పిలిచారు. అక్కడ లలితాంబ భర్తకి ,కూతురికి రాకేష్ ని పరిచయం చేసింది. రెండు రోజుల్లోనే రాకేష్ వాళ్ళతో బాగా కలిసిపోయాడు. తన పరిశోధన నిమిత్తం నాట్యకళల గురించి లలితాంబ ద్వారా చాలా విషయాలను సేకరించాడు. “ఇంత ఆప్యాయతను మా అమ్మ నాన్నల తరువాత నేను మీ ద్వారా పొందుతున్నాను ఆంటీ’’ అని ఒక సందర్బం లో లలితాంబ తో రాకేష్ అన్నాడు. దానికి ఆమె “ నీలో నేను నా కొడుకుని చూసుకుంటున్నాను బాబు’’అని అంది. “మీకు కొడుకు వున్నాడా! ఎక్కడ ఇన్నాళ్ళు నాకు చెప్పనేలేదు’’ అని రాకేష్ ప్రశ్నించాడు . ఆమెకి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు . కళ్ల వెంబడి నీళ్ళు మాత్రం వచ్చాయి. వెంటనే కన్నీళ్లు తుడుచుకొని “అలా కాదు రాకేష్ నాకు ఇద్దరూ ఆడపిల్లలే కదా!అందుకే అలా అన్నాను’’ అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయింది. కానీ రాకేష్ కు మాత్రం ఏదో అనుమానం వచ్చింది. ఆంటీ మనసులో ఏదో బాధ పడుతుంది అని మనసులో అనుకున్నాడు.
ఇది ఇలా వుండగా ఒక రోజు లలితాంబ కు అర్దరాత్రి అయిన రాకేష్ గదిలో లైట్ వెలిగి వుండటం తో గది తలుపు తట్టి “ఇంకా పడుకోలేదా!ఏం చేస్తున్నావ్ బాబు’’ అని అడిగింది. వస్తున్నా ఆంటీ అని తలుపు తెరిచిన రాకేష్ ని చూడగానే ఆమెకు ఆశ్చర్యం వేసింది. చొక్కా వేసుకోకుండా వుండడం వల్ల రాకేష్ గుండెమీద వున్న పుట్టుమచ్చ ఆమెకు కనిపించింది. వెంటనే తన కొడుకు గుర్తుకొచ్చాడు. తనబిడ్డకు కూడా ఛాతీ పైన గుమ్మడిగింజ పరిమాణం లో పుట్టుమచ్చ వుంది. ఆమెకు బాగా గుర్తు . ఆ విషయం మర్చిపోలేధు. ఇలా ఆలోచనలలో మునిగిన ఆమెకు “ఆంటీ ఆంటీ’’ అన్న పిలుపుతో ఒక్కసారి ఉలిక్కిపడింది. ఏమైంది ఆంటీ అలా వుండిపోయారు అన్న రాకేష్ ప్రశ్నకు అర్దరాత్రి అయినా పడుకోకుండా ఇంకా ఏం చేస్తున్నావ్ అని ప్రశ్నిచింది.
పరిశోధనిని అంతా ఫైల్ చేస్తున్నాను అని చెప్పాడు. “ నీ గుండెమీద పుట్టుమచ్చ నీ చిన్నప్పటినుంచి వుందా! అని నెమ్మదిగా అక్షరాలను మింగుతూ అడిగింది. అవును ఆంటీ అన్నాడు. సరే పడుకో అని చెప్పి లలితాంబ అక్కడనుంచి వెళ్ళి పోయింది. ఆమెకు ఆ ఆరాత్రంతా నిద్ర పట్టలేదు. తన బిడ్డ నే రాకేషా, అదే పుట్టుమచ్చ, అదే వయస్సు . రాకేశ్ ని మొదటిసారి చూసినప్పుడు ఆమె లో కలిగిన భావన వెరసి తన బిడ్డే రాకేష్ అయ్యుంటాడని అనుమానం. కాదు నిర్ణయానికే వచ్చేసింది. దేవుడే తన వద్ద కుబిడ్డ ను పంపించాడని ఆనంద పడింది.పోద్దున్న రాకేష్ కు టిఫిన్ వడ్డిస్తూ “నీ పుట్టిన రోజు ఎప్పుడు బాబు’’అని లలితాంబ రాకేశ్ ని అడిగింది. వచ్చే నెల 5thన అని చెప్పాడు .సంవత్సరము అడిగితే 1996 అని చెప్పాడు. ఎందుకు ఈ వివరాలు అడుగుతున్నారు ఆంటీ అని అడిగిన రాకేశ్ తో ఏమి లేదు నువ్వు తిను బాబు అని మాట దాటేసింది. రాకేశ్ కు మాత్రం మనసులో సందేహం మొదలయ్యింది. లలితాంబ ఆనందానికి అవధులు లేవు. తాను బిడ్డకు జన్మనిచ్చింది కూడా అదే సంవత్సరం అదే నెల అదే రోజు. అనుమానం లేదు రాకేశ్ తన బిడ్డే అని ఎగిరి గంతేసింది.
ఇన్నాళ్లకు నా బిడ్డ నా వద్ద కు వచ్చాడు. నేను వెళ్లనివ్వను. నా బిడ్డ తో మాట్లాడాలి. అని హడావిడి గా వెళ్లబోతు ఆగింది. ఇప్పుడు ఏ ముఖము పెట్టుకుని వాడికి నేను నీ తల్లి ని అని చెప్తాను. కోటి రూపాయలకు నిన్ను అమ్మేశాను అని చెప్పాలా.ఇలా తన మనసు లో చాలా రకాలుగా అనుకుని ఆంటీ గా వున్న స్థానాన్ని కూడా పోగొట్టుకుంటాను అని చెప్పకుండా వుండిపోయింది. ఆమెకు ఏం చెయ్యాలో అర్దంకాలేదు. తన బిడ్డ ఎదురు గా వున్నా నీ తల్లి ని నేనే అని చెప్పుకోలేని దుస్థితి ఏ తల్లికీ రాకూడదు అని వేదన పడింది. భర్త కి ఈ విషయం చెపుదాము అని నిర్ణయించుకొని తాను సేకరించిన విషయాలన్నింటిని భర్త తో చర్చించి రాకేశ్ మన బిడ్డే అని వివరించింది. ఆ విషయం విన్న ఆదినారాయణ కు బాధ,ఆనందంతో కళ్ళవెంబడి ఒక్కసారిగా నీళ్ళు తిరిగాయి. తన కాళ్ళు కట్టేసినట్టు ఎవరో వెన్నకి లాగుతున్నట్లు గా అనిపించింది. తన కొడుకుని చూడాలని ,మాట్లాడాలని అనుకుంటున్న వెళ్లలేకపోతున్నాడు.
ఇరవై ఏళ్ళ ముందు జరిగిన ఒప్పందం కళ్ల ముందు కడలాడింది. అదే విషయాన్ని భార్య కు వివరించి రాకేశ్ మన బిడ్డే అన్న విషయాన్ని ఆనందించడం తప్ప మనమేమీ చేయలేము అని భార్య ని ఓదర్చాడు. అదే సమయం లో వీరి గది వైపుగా వస్తున్న రాకేశ్ కు వీళ్ళ మాటలు అనుకోకుండా చెవున పడ్డాయి. మొదట రాకేశ్ కి ఏమి అర్దంకాలేదు తరువాత ఆశ్చర్యపోయాడు. నెమ్మదిగా తన గదిలోకి వెళ్ళి ఆలోచించ సాగాడు. నేను వీళ్ళ బిడ్డనా! మరి అమెరికా లో వున్న నా తల్లి తండ్రులెవరు. కోటి రూపాయల కోసం నా తల్లి తండ్రులు నన్ను అమ్మేసారా! ఏమిటి అంతా గంధరగోళము గా వుంది అనుకుంటూ, రాకేశ్ ఆ ఇంటికి వచ్చిన నుంచి జరిగిన విషయాలన్నీ గుర్తుచేసుకున్నాడు. ఏమి అర్దంకాక ఎంతకీ తనకు నిద్రపట్టలేదు. రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని పడుకున్నాడు. ప్రొద్దున్నే లేచి ఆంటీ తో “ నేను కొద్ది రోజులలో అమెరికా వెళ్తున్నాను’’ అని చెప్పాడు. ఇంత అకస్మాత్తు గా ప్రయాణం ఏంటి బాబు అని అడిగిన ఆంటీ తో ఏం చెప్పాలో తెలియక “మా అమ్మ కు ఒంట్లో బాగులేదు అని చెప్పి మరలా నా రీసెర్చ్ పూర్తిచెయ్యడానికి వస్తాను’’ అని చెప్పి అక్కడ్నుంచి బయలుదేరిపోయాడు.

కొద్ది రోజులకి రాకేశ్ అమెరికా చేరుకున్నాడు. తన అమ్మానాన్నకి తన రాకని చూసి ఆశ్చర్యం కలిగి “ఏంటి బాబు రీసెర్చ్ పూర్తయ్యిందా’’! అని తల్లి ప్రశ్నించింది. “లేదమ్మా! నాట్యకళలు మీద రీసెర్చ్ చేస్తుంటే వేరే రీసెర్చ్ చీయాల్సిన అవసరం ఏర్పడింది’’ అని చెప్పి తన గది లోకి వెళ్లిపోయాడు,. తల్లి కి ఏమి అర్దమవక ఒక నిట్టూర్పు విడిచి తన పనిలో నిమగ్నమయిపోయింది. రాకేశ్ ఒక రోజంతా ఆలోచించాడు. ఎలా తెలుసుకోవాలి ఎలా అడగాలి. అసలు అడగనా వద్దా ఇలా చాలా రకాలు గా తనలోనే తాను మదన పడి చిట్టచివరకు ధైర్యము చేసి తన తల్లితండ్రులను కూర్చోబెట్టి సున్నితంగా ప్రస్తావన మొదలపెట్టాడు. రాకేష్ భారతదేశం వెళ్ళిన నుండి లలితాంబ ఆదినారాయణ మాట్లాడుకున్న మాటలు వరకు మొత్తం అన్నీ విషయాలను వివరించాడు. రాకేశ్ చెప్పిన విషయాలను వింటున్న తల్లితండ్రులు నిశ్చేస్టులు అయిపోయారు. వాళ్ళకి తమ బిడ్డకు ఏం చెప్పాలో అర్దంకాక కుప్పకూలిపోయారు. తమ బిడ్డకు నిజం తెలిసిపోయిందని తెలిసిన ఆ తల్లితండ్రుల బాధ వర్ణనాతీతమైంది. బాధ తో ఏడుస్తున్న తన అమ్మ నాన్న లను రాకేశ్ ఓదార్చి ‘’మిమ్మల్ని భాద పెట్టడం నా ఉద్దేశ్యము కాదు నిజం తెలుసుకోవాలని అడిగాను. నేను మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళను. నేను ముమ్మాటికి మీ బిడ్డనే అని’’ అమ్మానాన్నను పట్టుకొని ఏడ్చాడు.
రాకేశ్ అమ్మానాన్న జరిగినదంతా భారతదేశంలో తాము ఇచ్చిన ప్రకటన నుండి బిడ్డను డబ్బులిచ్చి తీసుకోవడం షరతులు అన్నీ వివరించారు. ఇందులో వాళ్ళ తప్పులేదు, మా తప్పు లేదు వాళ్ళకు డబ్బు ఆశ చూపింది మేమే వాళ్ళ ఆర్ధిక పరిస్థితి బాగులేదు మాకు బిడ్డ కావాలి. అందుకే ఇలా జరిగింది అని రాకేశ్ కు తండ్రి వివరణ ఇచ్చాడు. ఇప్పుడు రాకేశ్ కు విషయమంతా తేటతెల్లమయి మనసు తేలికపడింది. మరుసటిరోజు “ అమ్మా! నేను కొద్ది రోజుల్లోనే వైజాగ్ వెళ్తున్నాను’’ అని తల్లితో చెప్పాడు. ఆ మాటలు విని కంగారు పడిన తల్లితో, “ కంగారు పడకమ్మా! నేను ని బిడ్డ ని మళ్ళీ నీ దగ్గరికే వస్తాను. రీసెర్చ్ పూర్తిచేసుకొని అని చెప్పిన కొన్నాళ్ళకి రాకేశ్ భారతదేశానికి బయలుదేరి వైజాగ్ చేరు కున్నాడు.
రాకేష్ ని చూడగానే ఆదినారాయణ లలితాంబ కళ్ళల్లో ఒక్కసారిగా ఆనందం ఎగిసింది. “ఏం బాబు మీ అమ్మగారి ఆరోగ్యం బాగుందా!’’ అని ఆమె రాకేష్ ని ప్రశ్నించింది. “ఆ బాగుంది అమ్మ! అని అప్రయత్నం గా రాకేష్ నోటినుండి ‘’అమ్మ’’ అని వెలువడింది. ఆ మాటకి ఆమె ఎంతో పులకరించిపోయింది.
మొత్తానికి రాకేష్ ఇక్కడ కూడా తన తల్లితండ్రులను కూర్చోపెట్టి నాకు విషయము అంతా తెలిసిపోయింది, జరిగిందంతా చెప్పండి అని నిలదీశాడు. ఆదినారాయణ జరిగినదంతా తన కొడుకుకి చెప్పి తన ధీన స్థితి ని వివరించి “ నీచుడైన ఈ తండ్రిని వీలయితే క్షమించు. అని ఎరవై ఏళ్ల తన మనోవేదనను వెల్లడించాడు. ఏకధాటిగా ఏరులై ప్రవహిస్తున్న తన తల్లితండ్రుల కన్నీటిని చూసిన రాకేష్ కి వాళ్ళని ఎలా ఓదార్చలో అర్దంకాక చాలా ప్రయత్నాలు చేసి విఫలుడయ్యాడు. అప్పుడే అటుగా వచ్చిన రాకేష్ అక్క పార్వతి’’ ఏడవని అన్నయ్యా ,ఏడవని అప్పుడే ఇన్నాళ్ళు వాళ్ళు లోలోపల దాచుకున్న బాధనంత పోగొట్టుకుంటారు.’’ అని తమ్ముడి భుజం మీద చెయ్య వేసింది. కాసేపయినతరువత తన తల్లితండ్రుల పక్కన కూర్చొని వాళ్ళతో “అమ్మ! నాన్న! ఇక బాధ పడవద్దు. ఇప్పుడు నా మనసులో ఎవరిమీద ఎటువంటి కోపం, బాధ లేవు. పరిస్థితులకు అనుగుణం గా మీరు చేశారు అంతే విషయం తెలుసుకుని పగను పెంచుకుని బాధ పడడానికి నేను అలాంటి ఇలాంటి అబ్బాయిని కాదు ఇద్దరమ్మల ముద్దుల కొడుకుని. అందరికి ఒక అమ్మ ఒక నాన్న అయితే నాకుమాత్రం ఇద్దరు అమ్మలు ఇద్దరు నాన్నలు’’ అని రాకేష్ వాళ్ళని ఓదార్చాడు.
జరిగినదంతా ఈ అమ్మ నాన్నలకు ఆ అమ్మానాన్నలకు వివరించి ఫోన్ లో ఇరువురికి సంబాషణ కలిపాడు.ఇప్పుడు అందరూ సంతోషం గా వున్నారు. రాకేష్ తన రీసెర్చ్ ను పూర్తి చేసుకొని అమెరికా కి ప్రయాణం అయ్యాడు. సంవత్సరానికి ఒకసారి వైజాగ్ వచ్చి తన అమ్మానాన్నలోతో గడిపి సంతోషంగా వెలిపోతున్నాడు. ఈ విదముగా వాళ్ళ కధ సుఖాంత మయ్యింది.
ఇరవై ఏళ్ల ఆ తల్లి భాద,ఆవేధన,ఎల్లలు దాటి ఆ “అమ్మ పిలుపు’’ను ఆ బిడ్డకు చేరవేసి ఆ తల్లి బిడ్డను కలిపిన ఆ భగవంతునికి శతకోటి ప్రణామములు.