Saturday 25 March 2017

అమ్మ పిలుపు

అందమైన విశాఖపట్టణం లో ఒక మధ్యతరగతి మానవుని నివాస గృహం అది. ఆ ఇంటిలో అద్దెకు నివసిస్తున్నారు ఆదినారాయణ,లలితాంబ దంపతులు ,వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు లక్ష్మి,పార్వతి. లక్ష్మి వయస్సు ఆరు సంవత్సరాలు,పార్వతి వయస్సు మూడు సంవత్సరాలు.ఆదినారాయణ ఒక ప్రైవేట్ కంపెనీ లో చిన్న ఉద్యోగము చేస్తున్నాడు,నెలకి జీతము ఏడువేలు. భార్య లలితాంబకు నాట్యము లో కాస్త ప్రావీణ్యం ఉండడం చేత చుట్టు ప్రక్కల పిల్లలకు నాట్యం నేర్పుతూ ఒక మూడు వేలు సంపాదిస్తుంది. ధరలు నెత్తిన కూర్చుని తాండవిస్తున్న ఈ రోజులలో ఆ ఇద్దరి సంపాదన ఏ పాటి .ఇద్దరి పిల్లలతో ఆ చిన్న మొత్తముతో సంసారాన్ని నెట్టుకువస్తున్నారు. పెద్దమ్మాయి లక్ష్మి ఒకటవ తరగతి చదువుతుంది ఇక చిన్న అమ్మాయిని స్కూల్ లో వేసే వయస్సు వచ్చేసింది. పెద్దమ్మాయిని జాయిన్ చేసి డొనేషన్లు నెల తిరిగే సరికి ఫీజులతో సతమత మయ్యే ఆదినారాయణకు ఇప్పుడు చిన్నమ్మాయి ని స్కూల్లో చేర్పించడానికి డబ్బులకి తడుముకోవలసిన పరిస్థితి ఏర్పడింది.మొత్తానికి ఎలాగయితేనేమీ డబ్బు ఏర్పాటు చేసి పార్వతిని కూడా స్కూల్ లో చేర్పించారు ఇద్దరు పిల్లలు శ్రద్దగా చదువుకుంటున్నారు .
ఒకనాటి రాత్రివేళ ఆదినారాయణ ,లలితాంబ తమ సంసారాన్ని గురించి ముచ్చడించుకుంటూ ఇప్పుడున్న పరిస్థితులలో మూడవ బిడ్డ ఇంక వద్దు కుటుంబనియంత్రణ చేయించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఇద్దరు ఆపరేషన్ నేను చేయించు కుంటానంటే నేను చేయించుకుంటాను అని పోటీపడ్డారు ఎటూ తేలక విషయాన్ని వాయుదా వేస్తూ నిద్రకు చేరువయ్యారు.
తెల్లవారింది. లలితాంబ తన పనులలో నిమగ్నమయింది. పిల్లలిద్దరూ స్కూల్ కి వెళ్లడానికి తయారవుతున్నారు.ఆదినారాయణ పేపరు చదువుతూ వాల్ కుర్చీలో కూర్చున్నాడు పేపరులో ఉన్న ఒక ప్రకటన చదువుతున్న ఆదినారాయణకు భార్య తనని పిలుస్తున్న పిలుపు అతని చెవిన పడలేదు .భర్తని అంతగా ఆకర్షించిన విషయము ఏమిటబ్బా అని ఆలోచిస్తూ అదే విషయాన్ని భర్తను అడిగింది ఆలోచనల నుండి బయటకి వచ్చిన ఆదినారాయణ భార్యతో ‘’నీ పని అంతా ముగిశాక ఒకసారి వస్తే నీతో ఒక విషయము మాట్లాడాలినేను ఆఫీసుకి కూడా ఈ రోజు సెలవు పెడుతున్నాను ‘’ అని చెప్పాడు .సెలవుపెట్టి మరీ మాట్లాడుకోవలసిన విషయము ఏమయిఉంటుంది అని గెడ్డము మీద చెయ్యి వేసుకుంటూ వంటింట్లోకి వెళ్ళి పోయింది .
ఆదినారాయణ తన స్నానము అనీ ముగించుకుని భార్య రాకకై ఎదురుచూస్తూ ‘’లలితాంబ ఎంతసేపు త్వరగా రా ‘’అని పిలిచాడు ‘’ఇదిగో వస్తున్నానండి ‘’అంటూ కాఫీ గ్లాస్ ను భర్తకు అందిస్తూ ‘’ఇప్పుడు చెప్పండి ఆ ముఖ్యమైన విషయం’’ అని భర్త పక్కనే కూర్చుని అడిగింది.అప్పుడు ఆదినారాయణ భార్యకు పేపరులో ఉన్న ప్రకటన చూపించాడు ఆ ప్రకటన లో ఇలా వ్రాసి ఉంది అమెరికా లో దనవంతులైన ఒక దంపతులకు పిల్లలు లేని కారణముగా వాళ్ళు భారతదేశములోని ఒక బిడ్డను దత్తత చేసుకోవడానికి ఆశపడుతున్నారు కానీ పుట్టిఉన్న బిడ్డని కాకున్నా పుట్టబోయే బిడ్డను దత్తత తీసుకోవాలని అనుకుంటున్నారు అందుకొరకు బాగా ఆరోగ్యముగా ఉన్న దంపతులు తమకు ఒక బిడ్డను కని ఇవ్వాలని అందుకు బదులుగా కోటి రూపాయలు చెల్లించుకుంటారు ఆసక్తి కల దంపతులు ఈ కింది చిరునామా లో సంప్రదించగలరు అని కిందన చిరునామాను చూపించాడు భార్యకి ఆదినారాయణ .
లలితాంబ ప్రకటన చదివి ఇది నన్నెందుకు చదవమన్నారు అంటూ భర్త వైపు అర్ధముకానట్లుగా చూస్తూ అడిగింది ‘’ఆ బిడ్డను కని ఇచ్చే దంపతులము మనమే ఎందుకు కాకూడదని’’ ఆదినారాయణ భార్యని అడిగాడు ‘’మీకు మతి పోయిందా! ఏమిటి బిడ్డను మనము కనివ్వడమేమిటి వేళాకోలముగా ఉందా!’’ అని భర్తను అడిగింది.వేళాకోలము కాదు కాస్త ప్రశాంతముగా ఆలోచించి ప్రకటన మరోసారి చూడు అని పేపరు ఇచ్చి నచ్చ చెప్పబోయాడు. ఎన్ని సార్లు చదివిన సరే ఇందుకు నేను ఒప్పుకోనని లలితాంబ చెప్పేసింది. చూడు బదులుగా మనకి కోటి రూపాయలు వస్తాయి మన ఆర్ధిక పరిస్థితి మెరుగవుతుంది మన పిల్లలను బాగా చదివించవచ్చు అని చాలా రకాలుగా భర్త నచ్చ చెప్పినా ఆమె అందుకు అంగీకరించలేదు, “బిడ్డను కని ఇచ్చేయడమంటే అంత తేలిక అనుకుంటున్నారా?అది పేగు బంధం ఏ తల్లి తన బిడ్డను దూరము చేసుకుని ఉండలేదు ,అంతవరకు ఎందుకు మన లక్ష్మీనో ,పార్వతినో ఎవరికో దత్తత ఇస్తే మీరు ఉండగలరా’’అని ప్రశ్నించింది . “అది వేరు ఇది వేరు నీవు మన పిల్లలని కనడమే కాకుండా పెంచావు కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది కానీ ఇక్కడ అలా కాదు మనము కన్న వెంటనే బిడ్డను చూడకుండా వాళ్ళకు ఇచ్చేయడమే అంతే ఇది చాలా తేలిక పైగా మనము ఇప్పుడున్న పరిస్థితులలో లక్ష రూపాయలు సంపాదించాలంటే చాలా కష్టము అలాంటిది కోటి రూపాయలంటే మాటలా అయిన మనము అనుకోగానే అయిపోతుందా మనము వాళ్ళని కలవాలి,వాళ్ళకు మనము నచ్చాలి ఇవన్నీ జరిగాకే నువ్వు బిడ్డను కని ఇవ్వాలి’’ అని భార్యని చాలా రకాలుగా నచ్చజెప్పి చిట్టచివరకు వాళ్ళను కలవడానికి ఒప్పించాడు.కానీ లలితాంబ అయిష్టముగానే అంగీకారము తెలిపి భర్త వెంట పేపరు లో తెలిపిన చిరునామాను వెతుక్కుంటూ బయలుదేరారు. మొత్తానికి అందులో తెలిపిన నాలుగంతస్తుల భవనానికి ఇద్దరు చేరుకున్నారు లిఫ్ట్ లో నాలుగో అంతస్తుకి చేరుకున్నారు. అక్కడ వాళ్ళకి ఒక విషయము ఆశ్చర్యచకితులని చేసింది. వీరిలాగానే బిడ్డను కని ఇవ్వడానికి అక్కడ చాలా మంది దంపతులు ఉద్యోగము కొరకు దరఖాస్తులు పెట్టుకోవడానికి వచ్చినట్లు బారులు తీసి ఉన్నారు. అది చూసిన ఆదినారాయణ భార్యతో ‘’చూసావా బిడ్డను కని ఇవ్వడము నేరము పాపము అని అన్నావు అది నేను నీ చేత చేయిస్తున్న పాపము అని అన్నావు ఇక్కడ చూడు ఎంత మంది ఉన్నారో వాళ్ళది మాత్రం కన్న ప్రేమ కాదా వాళ్ళు నవమాసాలు మోయరా! అంతటికీ కారణం డబ్బు లలితాంబ డబ్బు అదిలేనిదే మనుగడ లేదని నేటి మానవుడు బాగా గ్రహించాడు అందుకే బిడ్డ కావాలనుకునేవాడు డబ్బుని ఆశగా చూపాడు ఆడబ్బు కోసమే మనం బిడ్డను ఇవ్వడానికి వచ్చాము అంతా డబ్బు మహిమ ఏమి చేస్తాము నడు’’అన్నాడు. లైను లో నిల్చోమని వాచమన్ ఆదేశించడముతో ఇద్దరు లైనులో నిల్చున్నారు చివరకు సాయంత్రము ఆరుగంటలకి ఆదినారాయణ లలితాంబలను లోనికి పిలిచారు. లోనికి వెళ్ళిన వెంటనే అక్కడ ఉన్న ఇద్దరు మగ వ్యక్తులకు ఇద్దరు నమస్కారము చేసి వాళ్ళు సూచించిన కూర్చిలలో కూర్చున్నారు ఇద్దరు.అక్కడ ఉన్న ఇద్దరిలో ఒకరు ప్రశ్నలు వేయగా ఒకరు ఆదినారాయణ చెప్పిన సమాధానాలను వ్రాస్తున్నాడు .కుటుంబము,ఉద్యోగము,పిల్లలు తాతలు ముత్తాతలు ఇలా చాలా రకాల ప్రశ్నలు బిడ్డను ఎందుకు కని ఇవ్వాలనుకుంటున్నారు,ఇద్దరికీ అంగీకారమేన మొత్తము ఇలా 45 నిమిషాలు పాటు ప్రశ్నల వర్షము కురిపించారు అన్నింటికీ ఆదినారాయణ చాలా ఓపికగా సమాదానమిచ్చాడు .సరే అతి త్వరలో మా నిర్ణయాన్ని తెలుపుతూ మీకు లేఖ వస్తుంది అప్పుడు మీరు మమ్మల్ని సంప్రదించవలసి ఉంటుంది అంటూ ఆ ఇద్దరు ఆదినారాయణకు కరచాలనము చేసిన తరువాత దంపతులిద్దరూ ఇంటిముఖం పట్టారు.
ఇద్దరు ఇంటికి చేరేసరికి పిల్లలిద్దరూ పక్కింట్లో ఆడుకుంటూ అమ్మానాన్నలని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఇద్దరినీ నడుము చుట్టూ చేతులతో చుట్టేస్తూ “మమ్మల్లి ఒదిలి ఎక్కడికి వెళ్లారు’’? అని ప్రశ్నిస్తున్నవాళ్ళకి లలితాంబ ఏదో చెప్పి నచ్చజెప్పి పక్కింటి వాళ్ళకి ధన్యవాదాలు తెలిపి తాళము తీసి ఇంట్లోకి వెళ్లింది.గబగబా స్నానము ముగించుకుని వంట చేసి పిల్లలకి తినిపించి వాళ్ళని నిద్రబుచ్చి భర్తకి వడ్డించి తను తిని నిద్రకు ఉపక్రమించింది
తెల్లవారింది ఎవరి డ్యూటిలకు వాళ్ళు వెళ్ళిపోయారు .ఆఫీసుకు బయలుదేరుతూ ఆదినారాయణ పోస్ట్ వస్తే నాకు ఫోన్ చేసి చెప్పు అని బయలుదేరాడు .ఆఫీసుకి వెళ్లాడే గాని లెటర్ వస్తుందా అనే ఆలోచనలోనే కాలం గడిపాడు .ఇంటికి వస్తూనే పోస్ట్ ఏమయినా వచ్చిందా అని భార్యను ప్రశ్నించాడు అందుకు ఆమె రాలేదని తల అడ్డముగా ఊపింది. ఇలా వరుసగా 20 రోజులు గడిచాయి ఇంక తనకి లెటర్ రాదేమో అని నిరుత్సాహముగా ఉన్న ఆదినారాయణకు లెటర్ వచ్చింది అన్న మాటను భార్య నోట విన్న తరువాత అతని ఆనందానికి అవదులు లేవు .మరుసటి రోజు ఆ లెటర్ తీసుకుని బార్యభర్తలు ఇద్దరు ఆ నాలుగంతస్తుల భవనానికి చేరుకున్నారు .అక్కడ వీళ్లలాగే మరికొంత మంది దంపతులు లెటర్లు పట్టుకుని కూర్చుని ఉండడము గమనించిన ఆదినారాయణ కొంచెం నిరుత్సాహపడ్డాడు. అందరినీ లోపలికి ఒకేసారి పిలవడంతో అందరూ లోనికి వెళ్ళి కూర్చున్నారు .అక్కడ ఉన్న వ్యక్తి వీళ్లతో ‘’చూడండి మొత్తము అందరిలో మిమ్మల్ని మేము ఎంచుకున్నాము మీరు మేము చెప్పిన పరీక్షలు అన్నీ చేయించుకోండి. రిపోర్ట్స్ వచ్చాక మిగతా మాట్లాడుకుందాము’’ అని చెప్పి వాళ్ళందరికీ ఒక ఆసుపత్రి పేరు చెప్పి అక్కడికి పంపించాడు. పరీక్షలు అన్నీ అయిన తరువాత ‘రిపోర్ట్స్ వచ్చాక మీలో ఎవరికయితే మావద్ద నుండి లెటర్ వస్తుందో వాళ్ళు మమ్మల్ని సంప్రదించవలసి ఉంటుంది’’అని ఆ వ్యక్తి చెప్పడం తో ఆదినారాయణ ,లలితాంబ అక్కడినుండి ఇంటి ముఖం పట్టారు. రాత్రి పక్క సర్దుతూ ‘’ఈ టెస్టులు ఏమిటో లెటర్లు ఏమిటో అంతా గందర గోలముగా ఉంది వాళ్ళకి ఒక బిడ్డ కావాలంటే మనకి ఎన్ని తిప్పలు పెడుతున్నారు ఏమిటీ కర్మ’’ అని లలితాంబ విసుగుకుంది .దానికి ఆదినారాయణ “ఎందుకలా విసుగుకుంటావు డబ్బులు రావడం అంటే మాటలా! కష్టపడితే గాని ఫలితము దక్కదు అలాగే ఇది కూడా’’అని చెప్పి నిద్రలోకి జారుకున్నాడు .
ఆదినారాయణ మరల లెటర్ కోసం ఎదురుచూడసాగాడు మనసులో దేవుణ్ణి లెటర్ తనకే వచ్చేటట్లు చెయ్యమని ప్రార్దించసాగాడు .లలితాంబ మాత్రం ఆ విషయమే పట్టనట్లుగా తన పనిలో తాను లీనమయిపోయింది .మొత్తానికి లెటర్ వచ్చింది భార్యభర్తలిరువురు లెటర్ లో చెప్పిన ప్రదేశానికి చేరుకున్నారు ఈ సారి అక్కడ వీళ్లలాగా ఎవరూ లేకపోవడము గమనించిన ఆదినారాయణ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు.లోపలికి వెళ్ళగానే అక్కడ ఉన్న వ్యక్తి “కంగ్రాట్స్ ఆదినారాయణ గారు మొత్తము పది జంటలలో మేము మిమ్మల్ని సెలెక్ట్ చేశాము’’ అని చెప్పి ఇద్దరినీ కూర్చోమని చెప్పి,ఇక షరతుల విషయానికి వద్దామని వాటిని వివరించాడు “మొదటిది మీ భార్యకు గర్భం వచ్చిన వెంటనే మాకు తెలియబరచాలి. ఆ నిమిషము నుండి ఆవిడ ప్రసవము అయ్యేవరకు మీ కుటుంబము మొత్తము మేము నిర్దేశించిన బంగళాలో ఉండాలి. ఆవిడ పరీక్షల నిమిత్తము ఇంటివద్దే డాక్టర్ వచ్చి చూస్తారు .ప్రశవానికి మాత్రమే ఆసుపత్రికి తరలిస్తాము .రెండవది, బిడ్డ పుట్టిన వెంటనే మాకు అప్పగించాలి. వెను వెంటనే మీ డబ్బు మీకు అందుతుంది.ఆతరువాత ఒకరితో ఒకరికి ఎటువంటి సంబంధం ఉండదు.అందుకే బిడ్డను కోరే తల్లితండ్రులను మీకు చూపించలేదు. వాళ్ళకి మీగురించి తెలియదు ఇక ఆ బిడ్డ గురించి ఎప్పుడూ ఆరా తీయకూడదు .ఈ షరతులన్నీ మీ ఇద్దరికీ అంగీకారమయితే ఈ పత్రము మీద అన్నీ చదువుకుని బాగా ఆలోచించి ఇద్దరు సంతకాలు లు పెట్టండి’’అని ఆదినారాయణకు పేపర్లు అందించాడా వ్యక్తి .ఇద్దరు వాటిమీద సంతకాలు చేసి పేపర్లు అందిస్తూ “మమ్మల్నే మీరు ఎంచుకోవడానికి కారణము తెలుసుకోవచ్చా!అని ఆదినారాయణ అడిగాడు.అందరిలో ‘’మీది మంచి కుటుంబము,ఏ దూరాలవాట్లు లేవు మీరు పరిపూర్ణ ఆరోగ్యవంతులు అందుకే మిమ్మల్ని ఎంచుకున్నాము’’ అని చెప్పగానే ఆదినారాయణ చిరునవ్వు తో కృతజ్ఞతలు తెలిపి అక్కడి నుండి ఇంటికి చేరుకున్నారు.
కొన్ని రోజులతరువాత లలితాంబ వాంతులు చేసుకోవడముతో డాక్టర్ తో పరీక్ష చేయించుకుని తను గర్భవతి అని నిర్దారణ అయిన తరువాత ఆదినారాయణ తనకి ఇచ్చిన ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి విషయము తెలిపాడు. “మీరు
వెంటనే ఆ ఇల్లు ఖాళీ చేసి నేను చెప్పిన ఇంటికి మారిపోండి ,మీ భార్య గర్భవతి అని ఎవరికి తెలియకూడదు’’అని చెప్పి కొత్త ఇంటి అడ్రస్సు చెప్పాడా వ్యక్తి .వెంటనే ఆదినారాయణ ఇంటి ఓనరు వద్దకు వెళ్ళి ఇల్లు ఖాళీ చేస్తున్నామని చెప్పగా దానికి ఓనరు ఇలా భాద పడ్డాడు ‘’మీ లాంటి మంచివాళ్ళు మాకు మళ్ళీ దొరకరు,ఎందుకు ఖాళీ చేస్తున్నారు’’ అని ప్రశ్నించాడు.దానికి ఆదినారాయణ ఏమి చెప్పలేకపోయాడు.చుట్టుపక్కల ఉన్నవాళ్ళు రకరకాల ప్రశ్నలు వేశారు,దానికి భార్యాభర్తలిరువూరు సమాదానము చెప్పలేకపోయారు,ఎందుకంటే అబద్ధం చెప్పడమనేది వాళ్ళకి చేతకాదు కనుక.ఆదినారాయణ కుటుంబంతో సహా ఇల్లు మారాడు.అది చాలా పెద్ద బంగాళా,ఇంటి నిండా నౌకర్లు,ఇంటి ముందు పెద్ద పూలతోట.
పిల్లలిద్దరూ ఇంటిని చూడగానే చాలా ఆనందంతో ఇల్లంతా గంతులేశారు. “నాన్న ఇల్లు చాలా బాగుంది”అని లక్ష్మి ఆదినారాయణ తో చెప్పి చెల్లి తో తోటకి పరుగులు తీసింది. ఆదినారాయణకు జీవితంలో అటువంటి ఇంట్లో అద్దెకు దిగి ఉండగలనని కూడా అనుకోలేదు,అలాంటిది ఆ బంగళా తమ సొంతం అని తెలిసేసరికి,కళ్ళ వెంబడి నీళ్ళు తిరిగాయి.భార్యకి కూడా నీళ్ళు తిరిగాయి ,కాని బంగళా గురించికాదు,పాపం చేస్తున్నానేమోనని,అదే విషయం భర్త తో చెప్పింది.దానికి ఆదినారాయణ భార్యను కూర్చోబెట్టి “చూడు లలితాంబ మనం పాపం చేస్తున్నామని ఎందుకు అనుకుంటున్నావు డబ్బు తీసుకొని,బిడ్డను ఇస్తున్నామనే కదా! నువ్వు అలా ఎందుకు అనుకోవాలి,బిడ్డలు లేని ఒక దంపతులకు నువ్వు బిడ్డను కని వరంగా ఇస్తున్నావు,దానిని త్యాగం అంటారు,ఏ తల్లి తన బిడ్డను ఇవ్వలేదని అన్నావు,అలాంటిది నువ్వే ఇస్తున్నావు అంటే,నీమనసు అంత ఊదారమైనది,త్యాగమైనది,ఇంకొకరికి మనశ్శాంతిని బిడ్డ రూపము లో ఇస్తున్నావు.ఇక డబ్బు అంటావా,అది నువ్వు జెల్సా చెయ్యడానికో,నేను జెల్సా చెయ్యడానికో కాదు ,మన బిడ్డల భవిషత్తు కోసం,ఆదేవుడే చూపించిన దారి ఇది అనుకో,అంతేకాని పదే,పదేతప్పుచేస్తున్నావని ఎందుకు మనసులోనే బాధపడతావు,ఇలాంటి సమయము లో నువ్వు ఎంతో ప్రశాంతంగా ఉండాలి,మనం ఆ దంపతులకిచ్చిన మాటను నిలబెట్టుకోవాలి.
వాళ్ళకి డబ్బు ఉంది కాబట్టి ఇస్తున్నారు కానీ మనం చేసేది,బిడ్డను దానం చేయడం,అది చాలా గొప్పది,సరేనా.....మనసులో ఎటువంటి ఆలోచన పెట్టుకోకున్నా ప్రశాంతంగా ఉండు’’ అని చెప్పి లోపలికి వెళ్లిపోయాడు.భర్త చెప్పిన మాటలు లలితాంబకు కాస్త ఊరటకలిగించాయి .ఆ రోజు నుండి బంగళాలో వాళ్ళ జీవితం మొదలైయింది.లలితాంబ కాళ్ళు కిందపెట్టకుండా అనుక్షణము చూసుకోవడానికి ,టైమ్ ప్రకారం మందులు ఇవ్వ డానికి,పిల్లలను చూసుకోవడానికి,ఇల్లంతా నౌకర్లు ఉన్నారు ఆ ఇంట్లో,తనకు బోరు కొట్టకుండా కారులో తీసుకువెళ్ళడం,వాకింగ్ కి తీసుకు వెళ్ళడంఅన్నీ పద్దతి ప్రకారం జరుగుతున్నాయి. రోజులు దొర్లుతున్నాయి ,లలితాంబకు నెలలు నిండుతున్నాయి క్రమము తప్పకుండా డాక్టరు వచ్చి చూసి వెళుతున్నారు .తొమ్మిది నెలలు నిండగానే ఆసుపత్రి లో జాయిన్ చేశారు లలితాంబని .అయితే ఆపరేషన్ చేయాలన్నారు డాక్టరు .ఆదినారాయణ కాస్త కంగారుపడ్డాడు,లలితాంబ తనకు కుటుంబనియంత్రణ శస్త్రచికిత్స కూడా చేయ్యించమని కోరగా ఆదినారాయణ సరే అని అన్నాడు .ఆపరేషన్ జరిగింది లలితాంబ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది .
కొంతసేపటికి లలితాంబకు స్పృహ వచ్చింది .చుట్టూ వెతికింది తన బిడ్డకోసం ,ఊయలలో నిద్రపోతున్న తన బిడ్డని తన పక్కన పడుకోబెట్టమని నర్సుని కోరింది .తన బిడ్డని తేరిపార చూసుకుంది బాబు బొద్దుగా ముద్దుగా ఉన్నాడు వాడి ముఖం తేజస్సు గా ఉంది మేను రంగు పాలతో పోటీ పడుతున్నట్లు ఉంది చక్రాల్లాంటి కళ్ళు అటుఇటు తిప్పుతూ చూస్తున్నాడు అచురుకు ,చూపు,నవ్వు,చూస్తే ఎవరైనా ఇట్టే ఆకర్షితులైపోతారు .బాబు ఛాతీ మీద గుమ్మడిగింజ పరిమాణముతో పుట్టుమచ్చ వాడి తెల్లని మేను మీద పెట్టిన మచ్చలా ఉంది .ఆపరేషన్ జరగడమువలన బాబుని తనివితీరా ముద్దాడలేకపోయింది ,లాలించలేకపోయింది ,ఆదినారాయణ కూడా వచ్చి భార్య పక్కన కూర్చొని బాబుని ముద్దులాడాడు ,వాళ్ళిద్దరి ముచ్చట్లు బాబుతో తీరక ముందే ఆ ఇద్దరు వ్యక్తులు వచ్చి బిడ్డను అప్పగించవలిసిందిగా ఆదినారాయణను కోరారు .బిడ్డను వాళ్ళకు అప్పగిస్తుండగా లలితాంబ బోరున విలపించింది ఆవేదన వర్ణాతీతమైంది .ఆమె కనుక తన కడుపులో భాదని ఆపుకోలేక ఎడ్చిందో ఆ ఆసుపత్రే కూలిపోతుంది ,అంత భాదని తనలోనే దాచుకుని కన్నీళ్లని మాత్రం నేల తల్లికి సమర్పించుకుంది .
ఆదినారాయణకు అప్పటివరకు ఏమి అనిపించలేదు ,కాని బిడ్డను వాళ్ళ చేతిలో పెడుతుంటే డబ్బు కోసం బిడ్డను అమ్ముకునే నీచ స్థితికి నేను దిగజారానా అనే భయం అతడి మనసులో చెలరేగింది ,చేతులు వణికాయి ,గుండెల్లో ధడ మొదలైంది .లలితాంబ ఆడది కనుక తన భాదని కన్నీళ్ళ రూపం లో తన వేదన బయటపెట్టింది.కాని ఆదినారాయణ మనసు లోలోపలే కుమిళిపోయాడు. బిడ్డలు లేనివాళ్ళకు సాయం చేస్తున్నానని తన మనసుకి సరిచెప్పుకుని బిడ్డను అప్పగించాడు .వాళ్ళు బిడ్డను అందుకుని వెనువెంటనే కోటి రూపాయలను ఆదినారాయణకు అందజేస్తూ షరతులన్నీ గుర్తున్నాయి కదా ,ఇక ఈ బిడ్డను మరిచిపోండి అని చెప్పి అక్కడి నుండి ఆ ఇద్దరు వ్యక్తులు వెళ్ళిపోయారు .డబ్బులు అందుకున్న ఆదినారాయణ భాదతో అక్కడే కుర్చీలో కూలబడ్డాడు .తన బిడ్డకు పాలైనా ఇవ్వకుండా దూరం చేసుకున్నానే అని లలితాంబ ఆవేదన వ్యక్తం చేసింది .భర్త ఎన్నో విదాలుగా ఓదార్చడానికి ప్రయత్నించాడు .కొద్ది రోజులకి ఆమె ఆసుపత్రి నుండి ఇంటికి చేరుకుంది. ఆదినారాయణ పెద్ద కూతురు లక్ష్మి తల్లి ని “బుజ్జిబాబు ఏడి’’అని ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు ఆమె బదులు ఇవ్వలేక లోలోపల కుమిలిపోయింది. “ఓహో బుజ్జిబాబు ఇంకా పుట్టలేదా! అని అడిగి అక్కడ నుండి వెళ్ళిపోయింది.
రోజులు దొర్లుతున్నాయి. లలితాంబ ఏడుస్తూనే వుంది. ఆదినారాయణ కు ఆమె ను ఓదార్చడం అనేది పెద్ద సమస్యగా మారింది. చేసేదేమీ లేక కాలమే మాన్పుతుంది అని మౌనం గా వున్నాడు.
ఆదినారాయణ తన పిల్లలను మంచి స్కూల్ ల లో చేర్పించాడు. తన బార్య నాట్యం ద్వారా బిడ్డ గురించి మర్చిపోతుందని భావించి నాట్య కళాశాలను స్థాపించాడు. అందులో “ఉచితంగా నాట్యమునకు శిక్షణ ఇవ్వబడును” అనే ప్రకటన చాలా మందిని ఆకర్షించింది. ఇప్పుడు ఆ కళాశాల లో చాలా మంది లలితాంబ వద్ద నాట్యాన్ని అభ్యసిస్తున్నారు. ఆ విధంగా ఆమెకు కాస్త ఊరట కలిగింది.
రోజులు కాస్త నెలలు. నెలలు కాస్త సంవత్సరాలుగా దొర్లిపోయాయి. ఆదినారాయణ, తన బార్య బాబు గురించి మర్చిపోయింది అని భావిస్తున్నాడు. కానీ తాను మాత్రం లోలోపలే బాధ పడుతున్నాడు. ఆయనకి తెలియని విషయం ఏమిటి అంటే భార్య ఆ విషయాన్ని మర్చిపోనే లేదు. ప్రతి సంవత్సరం తన బాబు పుట్టిన రోజున పది మంది పేద వారికి కడుపునిండా అన్నం పెట్టి నూతన వస్త్రాలు వారికి ఇవ్వడం ద్వారా తన బాబు పుట్టిన రోజుని జరుపుతుందని భర్తకు తెలియధు.
లక్ష్మి పార్వతి ఇద్దరు నాట్యం లో ఉత్తీర్ణులయ్యారు. ఇద్దరు అదే కళాశాలలో తన తల్లి వలె పలువురి విధ్యార్ధులకు నాట్యం నేర్పిస్తున్నారు. లక్ష్మి కి పెళ్లి వయసు వచ్చింది. ఆదినారాయణ తన బిడ్డకు మంచి వరుడ్ని వెతికి వైభవంగా పెళ్లి జరిపించాడు లక్ష్మి తన అత్త వారింట్లో ఆనందముగా అడుగుపెట్టింది.
ఇది ఇలా వుండగా అమెరికా లో ఆదినారాయణ బిడ్డ రాకేష్ పెంచుకున్న తల్లి తండ్రులకు గారల బిడ్డగా పెరిగాడు. రాకేష్ తల్లి తండ్రులకు బిడ్డే ప్రపంచము. రాకేష్ లేనిదే వాళ్ళకు జీవితమే లేదు. రాకేష్ కు పెంచుకున్న బిడ్డ అనే భావం రాకుండా పెంచారు. రాకేష్ కి ఇప్పుడు 20 సంవత్సరములు నిండాయి. భారతదేశం లో నాట్యకళలమీద పరిశోధన చేయడానికి అమెరికా నుండి బయలు దేరి ఇండియా చేరుకున్నాడు. తన పరిశోధన నిమిత్తము ఆంధ్ర ప్రదేశ్ లో విశాఖపట్నం చేరుకున్నాడు. అక్కడ లలితాంబ నడుపుతున్న కళాశాల గురించి నాట్యం లో ఆమెకు వున్న ప్రావీణ్యము గురించి ముఖ్యముగా ఉచితం గా నాట్యం నేర్పుతున్నారు అని తెలుసుకుని ఆ కళాశాలకు చేరుకున్నాడు. లలితాంబ ను కలుసుకోవడానికి అపాయింట్మెంట్ తీసుకుని ఆమె ఆఫీసు రూమ్ లోకి వెళ్ళాడు. ఆమెను చూడగానే రాకేష్ కు ఏదో తెలియని అనుభూతి, ఆనందం కలిగాయి. ఆ భావం బయటికి తెలుపలేనటువంటిది. ముఖ పరిచయం కూడా లేని ఈమెను చూస్తుంటే నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది అని మనసులో అనుకున్నాడు. లలితాంబకు కూడా అదే అనుభూతి కలిగింది. తన కొడుకుకి ఇప్పుడు సరిగ్గా ఇంతే వయసు ఉంటుంది అని తన మనసు లో అనుకుంది.
రాకేష్ తాను వైజాగ్ వచ్చిన పని గురించి తన పరిశోధన గురించి లలితాంబ తో చర్చించాడు. అయితే తన పరిశోధన జరిగినంత కాలం రాకేష్ ని లలితాంబ తన ఇంటి వద్దనే వుండమని చెప్పింది. ఆమె తో మాట్లాడిన తరువాత రాకేష్ కి అభ్యంతరము చెప్పాలనిపించలేదు.సరే అని చెప్పి మేనేజర్ ని కలిసి లలితాంబ వాళ్ళ ఇంటికి చేరుకున్నాడు. ఆ పెద్ద బంగళాలో తన కి ఇచ్చిన గదిలో విశ్రాంతి తీసుకున్నాడు. రాత్రి బోజనానికి రాకేష్ ని డైనింగ్ టేబల్ దగ్గిరికి పిలిచారు. అక్కడ లలితాంబ భర్తకి ,కూతురికి రాకేష్ ని పరిచయం చేసింది. రెండు రోజుల్లోనే రాకేష్ వాళ్ళతో బాగా కలిసిపోయాడు. తన పరిశోధన నిమిత్తం నాట్యకళల గురించి లలితాంబ ద్వారా చాలా విషయాలను సేకరించాడు. “ఇంత ఆప్యాయతను మా అమ్మ నాన్నల తరువాత నేను మీ ద్వారా పొందుతున్నాను ఆంటీ’’ అని ఒక సందర్బం లో లలితాంబ తో రాకేష్ అన్నాడు. దానికి ఆమె “ నీలో నేను నా కొడుకుని చూసుకుంటున్నాను బాబు’’అని అంది. “మీకు కొడుకు వున్నాడా! ఎక్కడ ఇన్నాళ్ళు నాకు చెప్పనేలేదు’’ అని రాకేష్ ప్రశ్నించాడు . ఆమెకి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు . కళ్ల వెంబడి నీళ్ళు మాత్రం వచ్చాయి. వెంటనే కన్నీళ్లు తుడుచుకొని “అలా కాదు రాకేష్ నాకు ఇద్దరూ ఆడపిల్లలే కదా!అందుకే అలా అన్నాను’’ అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయింది. కానీ రాకేష్ కు మాత్రం ఏదో అనుమానం వచ్చింది. ఆంటీ మనసులో ఏదో బాధ పడుతుంది అని మనసులో అనుకున్నాడు.
ఇది ఇలా వుండగా ఒక రోజు లలితాంబ కు అర్దరాత్రి అయిన రాకేష్ గదిలో లైట్ వెలిగి వుండటం తో గది తలుపు తట్టి “ఇంకా పడుకోలేదా!ఏం చేస్తున్నావ్ బాబు’’ అని అడిగింది. వస్తున్నా ఆంటీ అని తలుపు తెరిచిన రాకేష్ ని చూడగానే ఆమెకు ఆశ్చర్యం వేసింది. చొక్కా వేసుకోకుండా వుండడం వల్ల రాకేష్ గుండెమీద వున్న పుట్టుమచ్చ ఆమెకు కనిపించింది. వెంటనే తన కొడుకు గుర్తుకొచ్చాడు. తనబిడ్డకు కూడా ఛాతీ పైన గుమ్మడిగింజ పరిమాణం లో పుట్టుమచ్చ వుంది. ఆమెకు బాగా గుర్తు . ఆ విషయం మర్చిపోలేధు. ఇలా ఆలోచనలలో మునిగిన ఆమెకు “ఆంటీ ఆంటీ’’ అన్న పిలుపుతో ఒక్కసారి ఉలిక్కిపడింది. ఏమైంది ఆంటీ అలా వుండిపోయారు అన్న రాకేష్ ప్రశ్నకు అర్దరాత్రి అయినా పడుకోకుండా ఇంకా ఏం చేస్తున్నావ్ అని ప్రశ్నిచింది.
పరిశోధనిని అంతా ఫైల్ చేస్తున్నాను అని చెప్పాడు. “ నీ గుండెమీద పుట్టుమచ్చ నీ చిన్నప్పటినుంచి వుందా! అని నెమ్మదిగా అక్షరాలను మింగుతూ అడిగింది. అవును ఆంటీ అన్నాడు. సరే పడుకో అని చెప్పి లలితాంబ అక్కడనుంచి వెళ్ళి పోయింది. ఆమెకు ఆ ఆరాత్రంతా నిద్ర పట్టలేదు. తన బిడ్డ నే రాకేషా, అదే పుట్టుమచ్చ, అదే వయస్సు . రాకేశ్ ని మొదటిసారి చూసినప్పుడు ఆమె లో కలిగిన భావన వెరసి తన బిడ్డే రాకేష్ అయ్యుంటాడని అనుమానం. కాదు నిర్ణయానికే వచ్చేసింది. దేవుడే తన వద్ద కుబిడ్డ ను పంపించాడని ఆనంద పడింది.పోద్దున్న రాకేష్ కు టిఫిన్ వడ్డిస్తూ “నీ పుట్టిన రోజు ఎప్పుడు బాబు’’అని లలితాంబ రాకేశ్ ని అడిగింది. వచ్చే నెల 5thన అని చెప్పాడు .సంవత్సరము అడిగితే 1996 అని చెప్పాడు. ఎందుకు ఈ వివరాలు అడుగుతున్నారు ఆంటీ అని అడిగిన రాకేశ్ తో ఏమి లేదు నువ్వు తిను బాబు అని మాట దాటేసింది. రాకేశ్ కు మాత్రం మనసులో సందేహం మొదలయ్యింది. లలితాంబ ఆనందానికి అవధులు లేవు. తాను బిడ్డకు జన్మనిచ్చింది కూడా అదే సంవత్సరం అదే నెల అదే రోజు. అనుమానం లేదు రాకేశ్ తన బిడ్డే అని ఎగిరి గంతేసింది.
ఇన్నాళ్లకు నా బిడ్డ నా వద్ద కు వచ్చాడు. నేను వెళ్లనివ్వను. నా బిడ్డ తో మాట్లాడాలి. అని హడావిడి గా వెళ్లబోతు ఆగింది. ఇప్పుడు ఏ ముఖము పెట్టుకుని వాడికి నేను నీ తల్లి ని అని చెప్తాను. కోటి రూపాయలకు నిన్ను అమ్మేశాను అని చెప్పాలా.ఇలా తన మనసు లో చాలా రకాలుగా అనుకుని ఆంటీ గా వున్న స్థానాన్ని కూడా పోగొట్టుకుంటాను అని చెప్పకుండా వుండిపోయింది. ఆమెకు ఏం చెయ్యాలో అర్దంకాలేదు. తన బిడ్డ ఎదురు గా వున్నా నీ తల్లి ని నేనే అని చెప్పుకోలేని దుస్థితి ఏ తల్లికీ రాకూడదు అని వేదన పడింది. భర్త కి ఈ విషయం చెపుదాము అని నిర్ణయించుకొని తాను సేకరించిన విషయాలన్నింటిని భర్త తో చర్చించి రాకేశ్ మన బిడ్డే అని వివరించింది. ఆ విషయం విన్న ఆదినారాయణ కు బాధ,ఆనందంతో కళ్ళవెంబడి ఒక్కసారిగా నీళ్ళు తిరిగాయి. తన కాళ్ళు కట్టేసినట్టు ఎవరో వెన్నకి లాగుతున్నట్లు గా అనిపించింది. తన కొడుకుని చూడాలని ,మాట్లాడాలని అనుకుంటున్న వెళ్లలేకపోతున్నాడు.
ఇరవై ఏళ్ళ ముందు జరిగిన ఒప్పందం కళ్ల ముందు కడలాడింది. అదే విషయాన్ని భార్య కు వివరించి రాకేశ్ మన బిడ్డే అన్న విషయాన్ని ఆనందించడం తప్ప మనమేమీ చేయలేము అని భార్య ని ఓదర్చాడు. అదే సమయం లో వీరి గది వైపుగా వస్తున్న రాకేశ్ కు వీళ్ళ మాటలు అనుకోకుండా చెవున పడ్డాయి. మొదట రాకేశ్ కి ఏమి అర్దంకాలేదు తరువాత ఆశ్చర్యపోయాడు. నెమ్మదిగా తన గదిలోకి వెళ్ళి ఆలోచించ సాగాడు. నేను వీళ్ళ బిడ్డనా! మరి అమెరికా లో వున్న నా తల్లి తండ్రులెవరు. కోటి రూపాయల కోసం నా తల్లి తండ్రులు నన్ను అమ్మేసారా! ఏమిటి అంతా గంధరగోళము గా వుంది అనుకుంటూ, రాకేశ్ ఆ ఇంటికి వచ్చిన నుంచి జరిగిన విషయాలన్నీ గుర్తుచేసుకున్నాడు. ఏమి అర్దంకాక ఎంతకీ తనకు నిద్రపట్టలేదు. రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని పడుకున్నాడు. ప్రొద్దున్నే లేచి ఆంటీ తో “ నేను కొద్ది రోజులలో అమెరికా వెళ్తున్నాను’’ అని చెప్పాడు. ఇంత అకస్మాత్తు గా ప్రయాణం ఏంటి బాబు అని అడిగిన ఆంటీ తో ఏం చెప్పాలో తెలియక “మా అమ్మ కు ఒంట్లో బాగులేదు అని చెప్పి మరలా నా రీసెర్చ్ పూర్తిచెయ్యడానికి వస్తాను’’ అని చెప్పి అక్కడ్నుంచి బయలుదేరిపోయాడు.

కొద్ది రోజులకి రాకేశ్ అమెరికా చేరుకున్నాడు. తన అమ్మానాన్నకి తన రాకని చూసి ఆశ్చర్యం కలిగి “ఏంటి బాబు రీసెర్చ్ పూర్తయ్యిందా’’! అని తల్లి ప్రశ్నించింది. “లేదమ్మా! నాట్యకళలు మీద రీసెర్చ్ చేస్తుంటే వేరే రీసెర్చ్ చీయాల్సిన అవసరం ఏర్పడింది’’ అని చెప్పి తన గది లోకి వెళ్లిపోయాడు,. తల్లి కి ఏమి అర్దమవక ఒక నిట్టూర్పు విడిచి తన పనిలో నిమగ్నమయిపోయింది. రాకేశ్ ఒక రోజంతా ఆలోచించాడు. ఎలా తెలుసుకోవాలి ఎలా అడగాలి. అసలు అడగనా వద్దా ఇలా చాలా రకాలు గా తనలోనే తాను మదన పడి చిట్టచివరకు ధైర్యము చేసి తన తల్లితండ్రులను కూర్చోబెట్టి సున్నితంగా ప్రస్తావన మొదలపెట్టాడు. రాకేష్ భారతదేశం వెళ్ళిన నుండి లలితాంబ ఆదినారాయణ మాట్లాడుకున్న మాటలు వరకు మొత్తం అన్నీ విషయాలను వివరించాడు. రాకేశ్ చెప్పిన విషయాలను వింటున్న తల్లితండ్రులు నిశ్చేస్టులు అయిపోయారు. వాళ్ళకి తమ బిడ్డకు ఏం చెప్పాలో అర్దంకాక కుప్పకూలిపోయారు. తమ బిడ్డకు నిజం తెలిసిపోయిందని తెలిసిన ఆ తల్లితండ్రుల బాధ వర్ణనాతీతమైంది. బాధ తో ఏడుస్తున్న తన అమ్మ నాన్న లను రాకేశ్ ఓదార్చి ‘’మిమ్మల్ని భాద పెట్టడం నా ఉద్దేశ్యము కాదు నిజం తెలుసుకోవాలని అడిగాను. నేను మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళను. నేను ముమ్మాటికి మీ బిడ్డనే అని’’ అమ్మానాన్నను పట్టుకొని ఏడ్చాడు.
రాకేశ్ అమ్మానాన్న జరిగినదంతా భారతదేశంలో తాము ఇచ్చిన ప్రకటన నుండి బిడ్డను డబ్బులిచ్చి తీసుకోవడం షరతులు అన్నీ వివరించారు. ఇందులో వాళ్ళ తప్పులేదు, మా తప్పు లేదు వాళ్ళకు డబ్బు ఆశ చూపింది మేమే వాళ్ళ ఆర్ధిక పరిస్థితి బాగులేదు మాకు బిడ్డ కావాలి. అందుకే ఇలా జరిగింది అని రాకేశ్ కు తండ్రి వివరణ ఇచ్చాడు. ఇప్పుడు రాకేశ్ కు విషయమంతా తేటతెల్లమయి మనసు తేలికపడింది. మరుసటిరోజు “ అమ్మా! నేను కొద్ది రోజుల్లోనే వైజాగ్ వెళ్తున్నాను’’ అని తల్లితో చెప్పాడు. ఆ మాటలు విని కంగారు పడిన తల్లితో, “ కంగారు పడకమ్మా! నేను ని బిడ్డ ని మళ్ళీ నీ దగ్గరికే వస్తాను. రీసెర్చ్ పూర్తిచేసుకొని అని చెప్పిన కొన్నాళ్ళకి రాకేశ్ భారతదేశానికి బయలుదేరి వైజాగ్ చేరు కున్నాడు.
రాకేష్ ని చూడగానే ఆదినారాయణ లలితాంబ కళ్ళల్లో ఒక్కసారిగా ఆనందం ఎగిసింది. “ఏం బాబు మీ అమ్మగారి ఆరోగ్యం బాగుందా!’’ అని ఆమె రాకేష్ ని ప్రశ్నించింది. “ఆ బాగుంది అమ్మ! అని అప్రయత్నం గా రాకేష్ నోటినుండి ‘’అమ్మ’’ అని వెలువడింది. ఆ మాటకి ఆమె ఎంతో పులకరించిపోయింది.
మొత్తానికి రాకేష్ ఇక్కడ కూడా తన తల్లితండ్రులను కూర్చోపెట్టి నాకు విషయము అంతా తెలిసిపోయింది, జరిగిందంతా చెప్పండి అని నిలదీశాడు. ఆదినారాయణ జరిగినదంతా తన కొడుకుకి చెప్పి తన ధీన స్థితి ని వివరించి “ నీచుడైన ఈ తండ్రిని వీలయితే క్షమించు. అని ఎరవై ఏళ్ల తన మనోవేదనను వెల్లడించాడు. ఏకధాటిగా ఏరులై ప్రవహిస్తున్న తన తల్లితండ్రుల కన్నీటిని చూసిన రాకేష్ కి వాళ్ళని ఎలా ఓదార్చలో అర్దంకాక చాలా ప్రయత్నాలు చేసి విఫలుడయ్యాడు. అప్పుడే అటుగా వచ్చిన రాకేష్ అక్క పార్వతి’’ ఏడవని అన్నయ్యా ,ఏడవని అప్పుడే ఇన్నాళ్ళు వాళ్ళు లోలోపల దాచుకున్న బాధనంత పోగొట్టుకుంటారు.’’ అని తమ్ముడి భుజం మీద చెయ్య వేసింది. కాసేపయినతరువత తన తల్లితండ్రుల పక్కన కూర్చొని వాళ్ళతో “అమ్మ! నాన్న! ఇక బాధ పడవద్దు. ఇప్పుడు నా మనసులో ఎవరిమీద ఎటువంటి కోపం, బాధ లేవు. పరిస్థితులకు అనుగుణం గా మీరు చేశారు అంతే విషయం తెలుసుకుని పగను పెంచుకుని బాధ పడడానికి నేను అలాంటి ఇలాంటి అబ్బాయిని కాదు ఇద్దరమ్మల ముద్దుల కొడుకుని. అందరికి ఒక అమ్మ ఒక నాన్న అయితే నాకుమాత్రం ఇద్దరు అమ్మలు ఇద్దరు నాన్నలు’’ అని రాకేష్ వాళ్ళని ఓదార్చాడు.
జరిగినదంతా ఈ అమ్మ నాన్నలకు ఆ అమ్మానాన్నలకు వివరించి ఫోన్ లో ఇరువురికి సంబాషణ కలిపాడు.ఇప్పుడు అందరూ సంతోషం గా వున్నారు. రాకేష్ తన రీసెర్చ్ ను పూర్తి చేసుకొని అమెరికా కి ప్రయాణం అయ్యాడు. సంవత్సరానికి ఒకసారి వైజాగ్ వచ్చి తన అమ్మానాన్నలోతో గడిపి సంతోషంగా వెలిపోతున్నాడు. ఈ విదముగా వాళ్ళ కధ సుఖాంత మయ్యింది.
ఇరవై ఏళ్ల ఆ తల్లి భాద,ఆవేధన,ఎల్లలు దాటి ఆ “అమ్మ పిలుపు’’ను ఆ బిడ్డకు చేరవేసి ఆ తల్లి బిడ్డను కలిపిన ఆ భగవంతునికి శతకోటి ప్రణామములు.

No comments:

Post a Comment