Saturday 25 March 2017

తొలిప్రేమ.. మధురాతిమధురం

ప్రేమ ........ఎంత తీయని పదము. తొలి ప్రేమ ....... ఇది ఇంకా మధురాతి మదురము.ప్రేమ అనిర్వచనీయము.మధురమైన అనుభూతి.మన జీవితములో తొలి ప్రేమ ఎప్పుడు ఎవరితో ఉద్భవిస్తుందో ఊహించడము కష్టమే.కానీ తప్పక చిగురిస్తుంది.ఆ అనుభూతిని,అనుభవాలను వర్ణించడానికి పదములు సరిపోవు.ఎందుకంటే తొలి ప్రేమను ఎంత వర్ణించినా అది తక్కువే అవుతుంది.
తొలిసారిగా నేను తల్లిని కాబోతున్నానని డాక్టరుగారు నన్ను పరీక్ష చేసాక, నాతో చెప్పిన ఆ మధురమైన క్షణాలను నాజీవితములో నేను ఎన్నటికీ మరువలేను.నా కడుపులో ఒక చిన్న ప్రాణము ఊపిరి పోసుకుంటుందన్న ఆలోచన,అనుభూతి,ఆనందము నేను వర్ణించలేను.ఎందుకంటే అది అనుభవిస్తే కాని తెలియదు.నేను తల్లిని కాబోతున్నానని తెలిసిన రోజు నుండి ప్రతీ రోజూ నాకు ఒక కొత్త అనుభవమే.క్రిందన కూర్చోవచ్చా!కూర్చుంటే కడుపులో ఉన్న బిడ్డకు ఏమైనా అవుతుందా,ఆహారము ఏమి తీసుకోవాలి?ఇలా ప్రతీదీ సందేహమే!మావారి ఉద్యోగరీత్యా పెద్దవారికి దూరముగా ఉండడము వలన,మా ఇరువురికీ అన్నీ సందేహాలే.ఫోన్ల ద్వారా పెద్దలను,చుట్టుప్రక్కల వాళ్లని అన్నీ అడిగి తెలుసుకుని, నా సందేహాలను నివృత్తి చేసుకునేదాన్ని.రోజురోజుకీ పెరుగుతున్న నా పొట్టని అద్దములో చూసుకుని,లోపల నా బిడ్డ ఎలా ఉన్నాడు,ఎంత పెరిగి ఉంటాడు అని ఆలోచించేలోపే తన చిట్టి పాదములతో లోపల నా బిడ్డ నన్ను తన్నే సరికి,ఆలోచనల నుండి తేరుకుని,చుట్టుప్రక్కల ఎవరూ లేరని గ్రహించి నా పొట్ట నిమురుతూ నా బిడ్డతో ఎన్నో ఊసులను,బాసలను పంచుతుంటుంటే, చిత్రముగా నాకు నా బిడ్డ “ఊ ఊ” అంటునట్లుగా అనిపించింది.తరువాత నా ఆలోచనకి నేనే నవ్వుకున్నాను.కానీ కడుపుతో ఉన్నప్పుడు మనము మన బిడ్డకి చెప్పేవన్నీ వాళ్ళకి చేరతాయంట, మా నాయనమ్మ చెప్పింది.
రోజులు దొర్లుతున్నాయి.నెలలు గడిచేకొద్ది పెరుగుతున్న నా పొట్టని చూసుకుంటే నవ్వు వస్తుంది.ప్రసవ సమయము దగ్గరవుతున్న కొలది రాత్రులు నిద్రపట్టక,ఎటువైపు తిరిగితే బిడ్డకు ఏమవుతుందో అన్న భయం,సుఖప్రసవము అవుతుందా?లేక శస్త్ర చికిత్స చేయవలసిన అవసరము ఏర్పడుతుందా? ఇలా అనేక సందేహాలతో నేను నిద్రపోకపోవడమే కాకున్నా ,మా నాయనమ్మని కూడా పడుకోనివ్వలేదు.శ్రీమంతము జరిగిన తరువాత, నన్ను అమ్మా వాళ్ళింటికి తీసుకొచ్చేశారుగా. అప్పటి నుండి మా నాయనమ్మే అన్నీ నాకు.మొత్తానికి నేను తొమ్మిది మెట్లను ఎక్కేసాను.అదేనండీ తొమ్మిది నెలలు నిండాయి అంటున్నాను.డాక్టరు చెప్పిన తారీఖు రానే వచ్చింది.ఆ రోజూ మే నెల 30వ తారీఖు 1996.
ఆ రోజూ పొద్దున్న నుండి పొట్టలో ఒకటే అసౌకర్యం ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి పొట్టలో చిన్న నొప్పి.వాటినే పురిటి నొప్పులంటారని మా అమ్మ చెబితేగాని నాకు తెలియలేదు.ఆ రోజంతా చిన్న చిన్న నొప్పులు,తిండి సహించక,నిద్రపట్టక కొంచెం కష్టము గానే గడిచిందని చెప్పాలి.ఆ రోజూ రాత్రంతా మా అమ్మ,నాయనమ్మ నాకు సపర్యలు చేసారు.వాళ్ళ ఋణము తీర్చుకోలేనిది.మరుసటి రోజు అంటే మే 31, 1996 ప్రొద్దున్న నొప్పులు ఎక్కువ అవడముతో నన్ను ఆసుపత్రిలో జాయిన్ చేయించారు నాన్న.పురిటి నొప్పులు భరించలేక పోయాను.బిడ్డను కనడమంటే ఇంతకష్టమా అని అనిపించింది.ఆ సమయములో నాకు మా అమ్మ గుర్తుకువచ్చింది.నన్ను కనేటపుడు మా అమ్మ ఇంతే కష్టపడి ఉంటుంది కదా!అని ఆలోచన వచ్చేసరికి నా కళ్ల వెంబడి నీళ్ళు వచ్చాయి.
ప్రసవ సమయము బాగా దగ్గరవుతుందేమో నొప్పులు తారాస్థాయికి చేరాయి.ఇంక భరించడము నా తరము కావడములేదు.ఆ భాదలో నేను ఏవేవో మాట్లాడేస్తున్నానంట, నా ప్రక్కనే మా నాయనమ్మని ఉండమని అంటుంటే డాక్టరుగారు వీలుపడదు.. అని చెప్పి మా నాయనమ్మ ను బయటికి పంపిస్తుంటే నా చెయ్యి ఆమె నుండి విడిపోతుంటే తను నాకు శాశ్వతముగా దూరమైపోతుందన్న భావన కలిగింది.ఈ నొప్పులు నేను భరించలేకపోతున్నాను నాకు ఆపరేషన్ చేసేయండి అలా అయితే ఈ నొప్పులు ఉండవని మా ఫ్రెండు చెప్పిందని డాక్టరు గారితో అంటుంటే డాక్టరు గారు నా వైపు చూసి నా తల నిమురుతూ ఒక నవ్వు నవ్వారు.నాకు ఇవన్నీ లీలగా గుర్తున్నాయి.ఏమయితేనేమీ మొత్తానికి నాకు సుఖ ప్రసవము జరిగింది.మరో జన్మ ఎత్తిన నాకు , పండంటి మగ బిడ్డ పుట్టాడమ్మ అన్న నర్సు మాట నా చెవిన పడింది.తరువాత కాసేపు ఏమిజరిగిందో తెలియలేదు.
కాసేపటికి నా బిడ్డను నా ప్రక్కన పడుకోబెట్టారు.వాడి చిట్టి చేతుల స్పర్శ తో నాలో “తొలి ప్రేమ చిగురించింది’’.మా తల్లి బిడ్డల ప్రేమ బంధం ఆ క్షణానే చిగురించింది.చారడేసి కళ్ళతో నన్నే చూస్తున్నాడు.ఆ చూపులో వాడికి అమ్మని నేనే అని అప్పుడే తెలిసిపోయిందా అని ఆశ్చర్యము వేసింది.వాడి బోసి నవ్వులు,చిట్టి చిట్టి ఏడుపులు,వాడి నగు మోము చూసేసరికి నా ప్రసవవేదనంతా కనుమరుగైపోయింది.ఆ రోజూ నాకు మావారికి జీవితములో ఎంతో మధురమైన రోజూ ఎందుకంటే మేము అమ్మా నాన్నల మయ్యాము.ఇంకా మరువలేనిది,మావారు నా నుదుటున చుంభన చేస్తూ తనకి పండంటి బిడ్డను కని ఇచ్చినందుకు తన ఆనందాన్నీ,ప్రేమను వ్యక్తపరిచారు.
ఇంకా ఆరోజు నుండి నా బాబే నా ప్రపంచమయిపోయాడు.బాబు చర్యలన్నీ నాకు వింతగా,కొత్తగా అనిపించి ప్రతీదీ మా అమ్మ తో నాయనమ్మ తో చెప్పుకుని మురిసిపోతుంటే, “ఓ యమ్మో నీకే ఉన్నాడు కొడుకు,మేము కనలేదు మరి’’అని మా పిన్నమ్మలు నన్ను ఆటపట్టించేవారు.బాబు నిద్రలో నవ్వుతుంటే బలే ముద్దోచ్చేవాడు.ఆ దృశ్యము ఇంకా నాకళ్ళ ముందు కదలాడుతుంది.పాల కోసం ధారాళముగా ఏడ్చేవాడు .ఒడిలోకి తీసుకోగానే ఏడుపు ఆపేసేవాడు.బాబుకు అన్నీ సేవలు చేస్తూ ఎంతో ఆనందాన్ని పొందాను.బాబు కి ఏమి పేరు పెడదామని!నేను మా వారు చాలా ఆలోచించాము.నీ పేరు ప్రవీణ కదా!బాబుకి ప్రతోనే పేరు పెడదాము అని బాబు కి ప్రమోద్ అని నామకరణము చేయించారు మా వారు.
ఆ రోజు నా ఆనందానికి అవధులు లేవు.పేగుబంధము తో పాటు పేరు బంధము కూడా ముడి పడింది.అందరూ ప్రవీణ కొడుకు బలే ముద్దుగా ఉన్నాడు,వాడి బుగ్గలు చూడండి అందరూ ముద్దులాడుతుంటే నాకు గమ్మత్తుగా,గర్వముగా అనిపించేది.అంతలోనే బాబు ని చూడడానికి వచ్చిన మా చుట్టాలు వెళ్లిపోగానే,మా అమ్మ బాబుకి దిష్టి తీస్తూ ఉండేది.బాబు రాత్రుళ్లు ఏడుస్తూ పడుకోకుండా అల్లరి పెడితే బాబుకి దిష్టి తగిలింది అని అమ్మ అంటూ ఉంటుంది.అలా మా పుట్టింటిలో మూడు నెలలు గడిచాక మావారి దగ్గరకి బాబుని తీసుకుని వచ్చేసాను.మచిలిపట్టణములో మా వారి ఉధ్యోగము.అక్కడ బాబు కి కాపడం పెట్టడానికి,స్నానం చేయించడానికి ఎవరూ దొరికేవారుకాదు.అన్నీ బాబుకి స్వయముగా నా చేతులతో నూనెతో మసాజ్ చెయ్యడం,స్నానం చేయించడం అలా రోజంతా గడిచిపోయేది.వీటివలన మా ఇద్దరి మధ్య బంధం మరింత బలపడిపోయింది.
ప్రొద్దున్న లేచిన దగ్గరనుండి రాత్రి పడుకునేవరకు బయట ప్రపంచముతో సంబంధం లేకుండా, మాదైన ఒక కొత్త ప్రపంచాన్ని ఏర్పరుచుకుని అందులోనే నేను, ప్రమోద్ విహరిస్తూ ఉంటే మధ్యలో మా వారు వచ్చి “కొంచెం నన్ను కూడా పట్టించుకోవోయ్’’ అని చతురలు విసిరుతుంటే నేను లోలపలే నవ్వుకుని “అలాగేనండి’’ అని సమాదానం ఇచ్చేదాన్ని.ఏదయినా బిడ్డకి మన చేతులతోనే స్వయముగా అన్నీ సేవలు చేస్తూ ఉంటే ఆ ఆనందమే వేరు.మళ్ళీ మళ్ళీ వాల్ల బాల్యము,ఆరోజులు రావు కదా!బాబుకి ప్రతీ నెల పుట్టిన రోజు [అంటే ప్రతీ నెల 30లేదా 31వ తారీఖు అన్న మాట]జరపడం,బోర్లా పడడము,పాకరడము,బంగరడము,కూర్చోడము అన్నింటిని మేము ముగ్గురము వేడుకలలాగా జరుపుకున్నాము.ప్రమోద్ తొలిసారిగా బుడి బుడి అడుగులు వేస్తుంటే ఒక ప్రక్క ఆనందము,మరో ప్రక్క పడిపోతాడేమో అన్న భయము కలిగాయి.ఇలాంటి భావాలు ప్రతీ తల్లికి ఉంటాయి.కానీ నా భావాలు,నా ఆనందాలు నావే కదా!అందుకే నా ఆనందాన్ని అమ్మ తో,మా అత్తగారితో ఉత్తరాల ద్వారా పంచుకున్నాను.
అన్న ప్రాసన జరిగిన రోజున బాబు తొలిసారిగా పాయసము ముట్టుకుంటే, అందరూ బాబు బాగా తిండి పుష్టిగలవాడవుతాడు అని అన్నారు.కానీ ప్రమోద్ ఈ రోజుకీ తిండి సరిగ్గా తినడు. బాబు నాతో ఎక్కువ దోబూచులాట ఆడేవాడు.నా బాబు తో గడిపిన ప్రతీ క్షణం నాకు ఈనాటికీ మధురమైన వే.బాబు తొలిసారిగా నన్ను అమ్మ అని పిలిచినపుడు ఆ పిలుపు లో అంత మాధుర్యము ఉంటుందని ఆ రోజు వరకు నాకు తెలియలేదు.బాబు పడుకున్నపుడు వాడి బుజ్జి పాదాలను,పాల బుగ్గలని ముద్దులాడుతుంటే,మా అమ్మ చూసి అన్నిసార్లు ముద్దుపెట్టకూడదు వాడికి దిష్టి తగులుతుంది అని నన్ను మందలిస్తుంటుంటే ఏంటమ్మ నువ్వు తల్లి దిష్టి కూడా తగులుతుందా ఎక్కడైనా అని వాదించేదాన్ని.
అమ్మ చుట్టుప్రక్కల లేని సమయము చూసుకుని బాబుని దొంగతనముగా ముద్దు పెట్టుకుంటుంటే బలే గమ్మత్తుగా ఉండేది.అయిన బాబు ముగ్దమనోహరమైన మోమును చూస్తుంటే ముద్దుపెట్టుకోకుండా ఎలా ఉండగలను మీరైన చెప్పండి! నా జీవితములో ఒక వరము మావారితో నా పెళ్లి అయితే,దేవుడిచ్చిన ఇంకో అద్భుతమైన వరం మా అబ్బాయి ప్రమోద్.కాలముతో పాటు ప్రమోద్ ఎదుగుతూ ఉన్నాడు.నా చుట్టూ తిరుగుతూ,నా కళ్ల ముందే తిరుగుతూ,తన చిట్టి చేతులతో వంటింట్లో నాకు అన్నీ అందిస్తూ,నేను బట్టలు ఆరవేస్తుంటే బట్టలు అందిస్తూ,పూజ గదిలో నాతో పాటు ఆదేవునికి ప్రార్దన చేస్తూ ఇలా అనేక చర్యలతో నా మనసు గెలుచుకున్న బాబు అక్షరాబ్యాసము చేయించుకుని ఈ తల్లి వడి పాఠశాల నుండి బయట ప్రపంచం అనే పాఠశాల లో చేరాడు.చూస్తుండగానే స్కూల్ కి వెళ్ళేంత పెద్దవాడయిపోయాడు ప్రమోద్.యూనిఫార్మ్,షూస్,టై,బెల్టు లో బలే ముద్దోచ్చేవాడు.
స్కూల్ నుండి బాబు రాక కోసం ఎదురుచూసే నాకు అమ్మ అని గట్టిగా అరుస్తూ నన్ను చుట్టేసి స్కూల్ లో జరిగిన విశేషాలన్నీ ఏకరవుపెట్టేవాడు.నేను కూడా వాడి ముద్దు మాటలను,ఊసులను ఎంతో శ్రద్దగా వినేదాన్ని.మావారు ఆఫీసు నుండి వచ్చిన తరువాత బాబు వాళ్ళ నాన్న తో కాసేపు ఆడుకుని తరువాత వాడు నాకోసం అమ్మ అమ్మ అని వెతుకుతూ ఉంటే మావారు నాదగ్గరకి వచ్చి బుంగ మూతి పెట్టుకుని ఇదిగో వీడికి నువ్వే కావాలంట,వీడు ఎంతైనా అమ్మ కొడుకు అని నా మీద ఆయన అలిగి గదిలోకి వెళ్లిపోతుంటే వస్తున్న నవ్వుని ఆపుకోవడం నాకు చాలా కష్టమయ్యేది.కాలము చాలా తొందరగా గడిచిపోయింది చూస్తుండ గానే ప్రమోద్ పెద్దవాడయిపోయాడు.ఇప్పుడు ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరము చదువుతున్నాడు.ఈ రోజుకీ కాలేజీలో జరిగేవన్నీ నాతో చెబుతూఉంటాడు.మా తల్లీకొడుకుల ప్రేమ బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది.ఎందుకంటే ప్రేమని ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది.ఫ్రేమ వెలకట్టలేనిది.కాగితముపై వ్రాయలేనిది.మనసులో దాచుకోలేనిది.మాటలలో వర్ణించలేనిది.ఈ జగమంతా ప్రేమ మయం.ప్రేమ లేనిదే ఈ ప్రపంచములో ఏ బంధానికీ మనుగడే లేదు.ఏదిఏమయిన బాబు చిరుప్రాయములో ఈ తల్లితో పెనవేసుకున్న తొలిప్రేమ, నాకు జీవితములో లభించిన అమూల్యమైన కానుక.

No comments:

Post a Comment