Saturday 25 March 2017

అమ్మ మనసు


అమ్మ మనసు


అమ్మ, నాన్న,నేను ,చెల్లి మాది ఒక చిన్న కుటుంబము...మమతానురాగాల పొదరిల్లు , ప్రేమ, అభిమానం , అనురాగం ,బంధం, అనుబంధం..  ఇలా వీటి లో ఏవి రుచి చూడాలన్న మా ఇంటికి రావలసిందే.
మా నాన్న ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి.అమ్మ ఇంట్లోనే ఉంటుంది,ఇంక నేను, చెల్లాయి చదువుకుంటున్నాము .నాన్న ఎప్పుడు తన పని లో నిమగ్నమై ఉంటారు,ఇంటి పని అంతా మా అమ్మే చూసుకుంటుంది. ఇంకా నేను చెల్లాయిని వీలున్నప్పుడల్లా ఆటపట్టిస్తుంటాను .తను ‘’చూడమ్మ అన్నయ్య’’ అని మా అమ్మకి ఫిర్యాదు చేస్తుంటుంది .మా అమ్మ నవ్వుతూ పైకి కోపము నటిస్తూ నన్ను మందలిస్తుంది .మాకు ఉన్నంతలో మేము సరదాగా,ఆనందముగా ఉండే వాళ్ళం .
నాన్నకి వీలైనప్పుడల్లా మాతో గడిపేవారు .ఎక్కువ సమయం నేను అమ్మతో గడిపేవాడిని .నేను చూసినపుడు మా అమ్మ ఆనందముగానే ఉండేది .మాతో సరదాగానే ఉండేది .కానీ నాకు ఏదో అనుమానం మా అమ్మ ఆనందముగా ఉందా అని ,ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళు బాగా ధనవంతులు,మాది మద్యతరగతి కుటుంబము,అటువంటి ఇంట్లో పెరిగిన మా అమ్మ ఇక్కడ ఎలా సర్దుకుని ఆనందముగా ఉండగలుగుతుంది అని .
ఈ ప్రశ్న నా మనసులో ఎప్పుడూ  మెదిలేది కానీ అమ్మని అడిగితే ఏమనుకుంటుందో అని అగేవాడిని  కాదు ,అప్పటికీ ఒక్కొక్కసారి సరదాగా  ‘’అమ్మ ఆర్ యు హాపీ ‘’ అని అడిగేవాడిని ,దానికి అమ్మ ఏమిటిరా నీ ప్రశ్నలు ఆని నవ్వుతూ నా తల నిమురుతూ ‘’ఆయామ్ హ్యాపీ నాన్న ‘’అని అనేది .ఇలా ఎన్నో సందర్భాలలో గమనించాను అమ్మని ……..,నాన్నని  ఏమి అడిగేది కాదు,మా అందరికీ ఇష్టమైనవి వండేది ,మా బాగోగులు బాగా చూసుకునేది,అందరి అవసరాలు తీర్చేది,తన గురించి మాత్రం ఏమి ఆలోచించేది కాదు ,అలాగని దిగులుగా ఉంటుందా అంటే కాదు చాలా హుషారుగా ఉంటుంది .ఇది ఎలా సాధ్యము  అని నేను అనుకునే వాడిని .నా ప్రశ్న నా వయసుతో పాటు పెరుగుతూ వచ్చింది కానీ మా అమ్మని అడిగే ధైర్యం నాకు రాలేదు .
నేను చెల్లి పెద్దవాళ్లమయ్యాము. నేను నా ఇంజినీరింగు పూర్తి చేసి ఉద్యోగము లో చేరాను,చెల్లి ఇంజనీరింగు రెండో సంవత్సరము చదువుతుంది . ఆ రోజు నేను నా మొదటి జీతము అందుకున్న రోజు ,ఎప్పుడు ఇంటికి వెళ్తానా ,అమ్మ చేతికి మొదటి జీతము ఇస్తానా అని రోజంతా ఎదురు చూసాను ,జీతము అందుకుని ఇంటికి చేరాను ,అమ్మ తన గదిలో బట్టలు మడత పెడుతూ కనిపించింది ‘’నాన్న రాలేదా అమ్మ అని అడిగాను’’ లేదు నాన్న ఇంకా రాలేదు నేను మీ నాన్న కోసమే చూస్తున్నాను అని అమ్మ చెప్పడముతో ,అమ్మ ఇలా రా కూర్చో అని చెప్పి అమ్మ చేతిలో నా జీతము పెట్టి నన్ను ఆశీర్వదించమని కాళ్ళకు దండం  పెట్టాను ,అమ్మ నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది. ఆనందముతో ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి .అప్పుడు అమ్మతో నా గొంతు సవరించుకుంటూ అమ్మ నిన్ను ఒక ప్రశ్న అడగనా......,అని అనగానే దానికి తను ఏమిటి అన్నట్లుగా నా వైపు చూసింది .
ఎందుకమ్మా నీకు ఉన్న కోరికలను,ఆశలను ,ఆశయాలను నాన్నకు వెలిబుచ్చక ,నీలోనే దాచుకుని ఉన్నావు..నాన్న అంటే భయమా ,అన్న నా ప్రశ్నకు మా అమ్మ నా వైపు ఆశ్చర్యముగా చూసింది .  "నాకు ఇప్పుడు ఈ ప్రశ్న  వేసే వయస్సు,అర్హత వచ్చాయి అని అనుకుని అడిగానమ్మ" అన్న నా మాటకు ఆమె ‘’భయము అన్న మాటకు అర్ధము అమితమైన ప్రేమ అయితే నాకు మీనాన్న మీద ఉన్నది అదే బాబు .నాకు కోరికలు లేక కాదు అవి మీ నాన్న తీర్చరని కాదు,నేను కోరితే అన్నీ తీర్చుతారు ,కానీ నా కోరికలను,ఆశలను ఆశయాలను తీర్చడానికి ఆయన పడే ప్రయాస,సంగర్షణ ,మానసిక వేదన,తపనలను చూసిన నా హృదయము తల్లడిల్లుతుంది...
కానీ నా హృదయ వేదనని కూడా ఆయన భరించలేరు .తీర్చగలిగేవి అన్నీ నేనడగక ముందే నెరవేరుతున్నప్పుడు ఇరువురి హృదయాలు వేదనకి గురియయ్యే కోరికల వెంట పరుగులెందుకు నాన్న’’ .......,అన్న మా అమ్మ మాటలలో నా అన్ని  ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి అన్నట్లుగా నా కళ్ల వెంబడి నీళ్ళు తిరిగి నా హృదయమంతా  ఎంతో తేలిక అయిపోయింది .భార్య భర్తల అనుబందం  అంటే ఇలా ఉండాలి అని నా మనసులో అనుకుని కన్నీళ్లు తుడుచుకుని ఇటు వైపు తిరిగిన నాకు , ఎప్పుడు వచ్చారో తెలియదు మానాన్న మా మాటలు విన్నట్లున్నారు ఆయన హృదయం భాద ,సంతోషాల మధ్య ఊగిసలాడుతున్నట్లుంది ,ఆ విషయాన్ని ఆయన కళ్ల వెంబడి వచ్చే నీళ్లే  చెబుతున్నాయి.

No comments:

Post a Comment