Saturday 25 March 2017

మా స్నేహ బంధం

 మా స్నేహ బంధం 
 

నా తొలి స్నేహ బంధం నేను పుట్టగానే మా అమ్మతో ఆవిర్భవించింది.నాన్నతో స్నేహ బంధం మొలకెత్తింది.తరువాత నా తోబుట్టువులతో నా స్నేహబంధం చిగురించింది.నా చిన్ననాటి ప్రాణ సఖి పూర్ణిమ తో నా స్నేహబంధం  ఎదిగింది.నాకు పెళ్లి అయిన తరువాత నా భర్త తో స్నేహ బంధం మొగ్గ తొడిగింది.నేను తల్లిని అయిన తరువాత నా బిడ్డలతో నా స్నేహ బంధం వికసించింది.
నాకు వివాహము జరిగిన తరువాత,నేను మా వారి ఉద్యోగ రీత్యా మచిలీ పట్టణములో కాపురము ప్రారంభించాము(అద్దెయింటిలో).ప్రక్క వాటాలో మలాగే అద్దెకి ఉంటున్న విజయ గారితో నాకు బాగా పరిచయము ఏర్పడింది. ఆ ఇంటిలో వున్నప్పుడే నాకు బాబు పుట్టాడు.విజయగారు నాకు అన్ని  వేళలా సహాయం చేసేవారు.మా బాబు ని బాగా ఆడిపించేది.కొద్దిరోజులకే  మా పరిచయము స్నేహము గా మారింది.రెండేళ్ళు గడిచిపోయాయి,మా వారి కి బదిలీ అవ్వడము తో మేము వైజాగ్ వచ్చేసాము.వచ్చేసేటపుడు చాలా భాద అనిపించింది నాకు,విజయాకి.
 
వైజాగ్ లో మద్దిలపాలెం లో అపార్టెమెంట్ లో అద్దెకు దిగాము.వాతావరణము కొత్తగా ఉండేది.అక్కడ పక్క ప్లాట్ లలో అద్దెకు ఉంటున్న శైలజ,విజయతో పరిచయం ఏర్పడింది.ఇద్దరు నాతో బాగా మాట్లాడేవారు.నాకు పాప పుట్టింది. శైలజ పిల్లలు ,మా పిల్లలు ఒకే వయస్సు.విజయాకి ఇద్దరు  కవల  పిల్లలు.మా పిల్లల కన్నా పెద్దవాళ్ళు.వీళ్లిద్దరితో పరిచయం కొన్నాళ్లకే స్నేహముగా మారింది.విజయ నాకు అన్ని విషయాలలో తోడుగా నిలిచింది.మేము బయటకి వెళితే మా పిల్లలని చూసుకునేది.తనదగ్గర కుటుంబ విలువలను తెలుసుకున్నాను,మంచి ఆప్తమిత్రురాలయింది నాకు.
 శైలజ,నేను ఒకే వయస్సు వాళ్ళం అవడం వలన,మా కష్ట సుఖాలను మనసువిప్పి మాట్లాడుకునే వాళ్ళం.శైలజ పిల్లలు మా పిల్లలు బాగా ఆడుకునేవారు.వీళ్ళిద్దరు అన్నింటా నాకు తోడు నీడ గా ఉండేవారు.తరువాత కొన్నాళ్ళకి శైలజకి ,విజయా కి వేరే ఉర్లకి బదిలీ అవడము తో చెరో చోటుకి వెలిపోయారు. మేము కూడా అపార్టెమెంట్ కొనుక్కుని సీతమ్మదార కి మారిపోయాము.
 
అక్కడ నాకు శిరీషా,ఉదయశ్రీ, రమగారు పక్క ప్లాట్ లలో ఉంటున్న వీళ్లతో పరిచయమేర్పడింది.శిరీష,ఉదయశ్రీ నాతోటి వయసు వారే.కొద్దిరోజులకే వాళ్ళతో పరిచయం స్నేహము గా మారింది.చక్కగా మనసు విప్పి మాట్లాడుకునేవాల్లము.ఇంకా రమ గారు నాకన్నా కొంచెం వయసులో పెద్దవారు.ఆవిడతో నా స్నేహం నాకు మా అమ్మతో ఉన్నట్లే ఉండేది.తన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.జీవితములో ఎదురయ్యే కష్టాలను ఎదురుకుని ఎలా పోరాడాలి,పిల్లల పట్ల మన ప్రవర్తన ఎలా ఉండాలి,భార్య భర్తల బంధం ఎలా ఉండాలి,అన్ని విషయాలనూ సానుకూల దృక్పదముతో ఎలా చూడాలి,ఇలాంటి ఎన్నో నేర్చుకున్నాను.ఆవిధముగా  ముగ్గురితో నాకు స్నేహము ఏర్పడింది.
తరువాత మావారికి నరసారావుపేట,గుంటూరు జిల్లాకు బదిలీ అయ్యింది.కొత్త ప్రదేశము,అందరూ ఎలా ఉంటారో అని భయపడుతూ వేంకటేశ్వర అపార్టెమెంట్ లో అద్దెకు దిగిన నాకు మొదట పక్క ప్లాట్ లో అద్దెకు ఉంటున్న పధ్మజ పరిచయమయ్యింది.తన ద్వారా పద్మజ స్నేహితులయిన కిరణ్మయి,శిరీష,షాలిని,రోజ నాకు పరిచయమయ్యారు.అందరూ ఇంచుమించు నా వయస్సు వాళ్ళే.కొద్ది రోజులకే మేమంతా మంచి స్నేహితులయ్యాము.అందరం ఒక కుటుంబంలా కలిసిపోయాము.
ఎక్కడినుందో వచ్చిన నన్ను వాళ్ళతో కలుపుకుని నాకు స్నేహహస్తం అందించారు.నా కష్ట సుఖాలలో తోడుగా నిలిచారు.మా అందరిలో ఎవరికయిన కష్టము వస్తే మిగతవాళ్లు పోటీపడి సాయము చేసేవారు.అందరమూ కలిసి వాకింగ్ కి,షాపింగ్ కి ,గుడి కి వెళ్ళేవాల్లము.పుట్టిన రోజులు,పెళ్లిరోజులు అన్నీ బాగా జరుపుకునే వాల్లము.ఎవరింట్లో ఫంక్షన్ జరిగిన అందరం తల ఒక చెయ్యివేసి సహాయము చేసేవాల్లము.నూతన సంవత్సర వేడుకలు,స్నేహితులరోజు,మహిళా దినోత్సవము,వినాయక చవితి అన్నీ అందరమూ కలిసి అపార్ట్మెంట్ సెల్లార్ లో చాలా సరదాగా జరుపుకునే వాళ్ళం.పిల్లలందరూ కలిసి చక్కగా ఆడుకునేవారు.
నా స్నేహితులు ఐదుగురి లోనూ ఒక్కక్కరిలో ఒక్కో ప్రత్యేకత ఉంది.వాటన్నింటిని నేను నేర్చుకున్నాను.ఒక్క పూట ఎవరు బయట కనిపించక పోయిన,ఏమయింది అని వెంటనే తలుపు తట్టేవాల్లము.ఎన్నో విషయాలలో నేను బయపడుతుంటే భయపడకూడదు,దైర్యముగా ఉండాలి అని ఒకరు,మా అమ్మాయి స్కూల్ నుండి కడుపు నొప్పి అని ఫోన్ చేస్తే నన్ను తన బండిమీద స్కూల్ కి తీసుకు వెళ్ళిన వారు ఒకరు,నాకు ఆరోగ్యము బాగోక ఆసుపత్రికి వెళ్ళినపుడు మా అమ్మాయిని చూసుకునే వారు ఒకరు,ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి,వాళ్ళు నాకు చేసినవి,మా స్నేహము గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది.వాళ్ళు నాకు చేసిన సహాయము తో పోల్చితే నేను వాళ్ళకి చేసింది చాలా తక్కువే,అసలు లేదనే చెప్పాలి.బదులు ఏమి ఆశించనిదే స్నేహం అంటారు అందుకేనేమో.
వాళ్ళతో నా స్నేహము నా జీవితములో ఒక భాగమైపోయింది.చిన్ననాటి నా స్నేహితులతో గడిపిన రోజులు గుర్తుకొచ్చాయి నాకు.నేను కొంచెం దిగులుగా ఉన్న,ఏడిచినా,వాళ్ళతో సరిగా మాట్లాడక పోయినా ఉరుకునే వా రుకాదు. విషయము తెలుసుకొని ఓదార్చేవారు,దైర్యము చెప్పేవారు,నీకు మేము ఉన్నాము అని భరోసా ఇచ్చేవారు.అంతటి గొప్ప స్నేహబంధం మాది.అటువంటి బంధాన్ని వదిలి మేముశ్రీకాకుళము వచ్చేసినపుడు మా పరిస్థితి ఊహించడము ఎవరి తరము కాదు,అందరూ వాళ్ళ భాదను లోలోపలే దాచుకుని నాకు వీడ్కోలు చెప్పారు,కానీ నేను ఆపుకోలేక పద్మజాని పట్టుకుని ఏడ్చేశాను.ఇప్పటికీ మా స్నేహబందం అలాగే కొనసాగుతుంది.మా స్నేహానికి గుర్తుగా నేను ఒక కవితను కూడా రాశాను.
                     
మా స్నేహం 

సూర్యుడి ‘’కిరాణా’’లు సోకిసోకగానే,
వికసించిన ‘’పధ్మ’’ము మన స్నేహము,
అపుడే పూచిన ‘’రోజా’’ పూలతో ,ఆ’’లక్ష్మి’’ని పూజించి,
కోటి రాగాలతో ‘’వీణ’’ను మీటగా వచ్చే,
నవ్వుల ‘’శిరి’’యే మన స్నేహ’’షాలిని’’,
గలగలా పారే గోదావరిని,
జలజల సాగే మన స్నేహాన్ని ,
ఎవరూ ఆపలేరు .
 
మేము శ్రీకాకుళము వచ్చిన తరువాత కొన్ని నెలలకి,మా వారి ఇంజనీరింగు లో కలిసి చదువు కున్న స్నేహితుల ఫ్యామిలి రీయూనియన్ హైదరబాద్ లో లియోనియా రిసార్ట్స్ లో జరిగింది.చాలా బాగా జరుపుకున్నాము.మా వారి స్నేహితులలో చాలా మందిని  కలవడం అదే మొదటిసారి.అక్కడ మావారితో పాటు ఇంజనీరింగ్ చదువు కున్న సత్యవతి గారిని ,నాకు మావారు పరిచయము చేశారు.సత్యవతిగారు నేను ఒక ఫ్రీలాన్స్ రైటర్ని,నా బ్లాగ్ చూడండి అంటూ ఏవో చెబుతూ తనని తాను పరిచయము చేసుకుంటున్నారు.నాకు ఏమి అర్ధము కాలేదు.ఆమె మాటలు విన్న మా అబ్బాయి ‘’ఆంటీ మా అమ్మ కూడా కవితలు,కథలు రాస్తుంది ‘’అని చెప్పాడు.
అప్పుడు సత్యవతిగారు ‘’అవునా అయితే మీరు వ్రాసి ప్రచురణకి పంపించండి ‘’అని ప్రోత్సహించారు.నేను మీలాగా వ్రాయలేను అని భయపడుతున్న నాకు మీరు వ్రాయగలరు అని నాకు దైర్యము చెప్పారు.హైదారాబాద్ లో మేము మాట్లాడింది కొన్ని నిమాషాలే.కానీ తరువాత నాకు ఫోన్లో నేను ఎలా వ్రాయాలి,అంతర్జాలములో పత్రికలుంటాయి,వాటిని  ఎలా  పంపాలి అన్నీ నాకు అడుగడుగున పోత్సహిస్తూ సహాయం చేశారు.సత్యవతిగారి పరిచయము తో మరుగున పడిన నా కళకు జీవము పోసినట్లయింది.తన ఋణము నేను తీర్చుకోలేనిది.నేను రాసిన కథలు ,కవితలు ప్రచురణ అయ్యాయి.ఇదంతా ఆమె ఇచ్చిన స్పూర్తి.ఆమె నాకు ఎంత స్పూర్తి ని ఇచ్చారంటే  ప్రతిలిపి.కామ్లో ఆమెతో పాటు పోటీలో నన్ను నిలబెట్టారు.నా జీవితములో సత్యవతి గారితో స్నేహబంధం ఒక అద్బుతమ్ అంటాను.
 
నా జీవితము లో ఏర్పడ్డ ఏ స్నేహబందాన్ని నేను విడిచిపెట్టను,అన్నీ నాకు గొప్పవే,ఒక్కో స్నేహం ఒక్కో అనుభూతి. మా వారు నాతో ఎప్పుడు అంటూఉంటారు ‘’నీలో ఏదో ఒక అద్భుతమైన శక్తి ఉంది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా మంచి స్నేహాన్ని,స్నేహితులను సంపాదించుకుంటావు,నాకు మాత్రం చేతనవదు అని’ ఏమో మరి నాకు సంభందించినంతవరకు నా స్నేహబంధం ఆ దేవుడు నాకు ఇచ్చిన వెలకట్టలేని ఒక వరములా భావిస్తాను.

No comments:

Post a Comment