Saturday, 25 March 2017

సర్దుకుపోవాలి

సర్దుకుపోవాలి


(ఈ కథ మే నెల 22 వ తారీఖు 2016 న అచ్చముగా తెలుగు అంతర్జాల పత్రికలో ప్రచురితమైంది)

ఉదయం హడావిడిగా కేరేజీలు సర్దిన వెంటనే,మా వారు ‘’నాకు ఎదురురా’’ అని పిలుస్తున్నారు,
ఆయనకు ఎదురువెళ్ళేలోగా మా అమ్మాయి స్కూల్ ఆటో అబ్బాయి హారన్ మోగిస్తున్నాడు రమ్మని. మా అమ్మాయికి టాటా చెప్పి ,మా వారికి ఎదురు వెళ్ళి,లోపలికి వచ్చాను.
పొద్దున్న నుండి ఒకటే హడావిడి,ఆ బడలిక తీర్చుకోవడానికి మావారు ప్రేమతో కొని ఇచ్చిన కాఫీ కప్ లో వేడివేడి కాఫీ కలుపుకొని ,అలా సిప్ చేసుకుంటూ మా అపార్ట్మెంటు కారిడార్లోకి వచ్చి ,చిన్నగా అటు ఇటు తిరుగుతుండగా... మా పక్కింట్లో ఉండే రోజా ,దిగులుగా ఉండడం గమనించాను.
రోజా నాకన్నా వయస్సు లో పెద్దది అయినా మేము మంచి స్నేహితులమయ్యాము. రోజా కి ఇద్దరు పిల్లలు,అబ్బాయి. అబ్బాయి బెంగుళూరులో సాఫ్ట్ వేరు కంపెనీలో ఉధ్యోగము చేస్తున్నాడు. అమ్మాయికి ఆరు నెలల క్రితమే వైభవముగా పెళ్లి చేసి పంపించారు. అల్లుడు ఢిల్లీ లో ఉధ్యోగము చేస్తున్నాడు.
ఏమయ్యింది రోజా అలా విచారముగా ఉన్నావు అని అడుగుతుండగానే , హాయి ఆంటీ అంటూ వాళ్ళ అమ్మాయి సొనల్ బయటకి వచ్చింది నా గొంతువిని. నేను ఆశ్చర్యపోయాను సోనల్ని చూసి ,’’హాయి సోనల్ ఎప్పుడు వచ్చావు’’,అని అడిగాను. వెంటనే రోజా ‘’ఎందుకు వచ్చావు అని అడుగు ‘’అని అన్నాది ఏడుస్తూ ……….,
ఆమాటకి సోనల్ విసురుగా లోనికి వెళ్లిపోయింది. నాకేమీ అర్దంకాలేదు. కొంచెం కంగారూ,ఆశ్చర్యము అనిపించింది.  రోజానీ ఓదారుస్తూ ,ఏమి జరిగింది అని.. మా ఇంటికి తీసుకొని వెళ్ళి ,మంచినీళ్ళు ఇచ్చి అడిగాను.
సోనల్ తన భర్తతో ఉండలేకపోతున్నానని చెప్పి వచ్చేసింది.. అని రోజా చెప్పగానే , నాకు షాక్ లాగా అనిపించినా ,’’ఏమి  ఎందుకంట’’ అని బయటకి గంభీరముగా ఉంటూ అడిగాను. 
’’అదే నేను అడిగితే సర్దుకుపోలేకపోతున్నానని తేలికగా తీసిపారేస్తున్నాది , నన్నేమి చేయమంటావు చెప్పు’’ అని నన్ను పట్టుకుని ఏడిచింది. సరే, నేను సోనల్ తో మాట్లాడతాను అని చెప్పి రోజాని పంపించానే కాని నా కళ్ల ముందు మా దూరపు బంధువు కదలాడుతున్నది .
ఇది జరిగి రెండేళ్ళు అవుతుంది. నాకు వరుసకి అత్త కూతురు,పేరు రాగిణి. అందముగా ఉంటుంది, మా అత్తకి గారాలపట్టి. ఆర్దికముగా పరవాలేదు.. ఉన్నంతలో గుట్టుగా సంసారము చేసుకుంటున్నారు. అందరిలాగానే రాగిణీకి యుక్తవయస్సు రాగానే ఉన్నవాళ్ళింటిలోనే ఇచ్చి వివాహము చేశారు.
రాగిణి పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెల్లిందే కాని అక్కడ సర్దుకుపోలేకపోయింది. తల్లి చేసిన గారాభము వలన ,అత్తింట్లో ఏది కోరినా వెంటనే దక్కకపోయేసరికి ,తనను నిర్లక్ష్యము చేస్తున్నారంటూ భర్త మీద అలిగేది. మొదట్లో భర్త పోనీలే పెళ్లి అయిన కొత్త కదా అని సరిపెట్టుకున్నాడు. కానీ రాగిణి ప్రవర్తన రోజు రోజుకీ భర్తకి వింతగా అనిపించసాగింది. తను కోరిన ప్రతీదీ  తీర్చాలంటూ  మొండికేసేది.  ప్రొద్దున్నే లేచేది కాదు. భర్త ఆఫీసుకి బయలుదేరుతుంటే లేచేది. అత్త కూడా కొత్త కోడలు కదా అని ఊరుకునేది. కొన్నిసార్లు తొందరగా లేవాలి అని నచ్చజెప్పేది. కాఫీ కలుపుకోవడము రాదు. అత్త కలిపి ఇస్తే మా అమ్మలాగా చెయ్యలేదంటూ విసుగుకునేది.
రాత్రి పూట అందరూ కలిసి భోజనము చేస్తుంటే ,అలా నచ్చక రాగిణి ఏదో ఒక గొడవ పెట్టుకునేది. మా అత్తకి ఫోన్ చేసి నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అని అనేది మాటిమాటికి. మా అత్తకి తను చేసిన గారాభము వలన కోరినవన్నీ వెంటనే ఇవ్వడము , సుకుమారముగా పెంచడము వలనే కూతురు ఈ రోజు ఇలా అంటున్నదని అర్దము కాలేదు. అలా అని కూతురికి సర్దుకుపోవాలని చెప్పనూలేదు. అల్లుడితో మాట్లాడింది. ఏవేవో చిన్నచిన్నవి వస్తుంటాయి కదా అత్తయ్యా ,మీరేమీ కంగారుపడకండి అని చెప్పేసాడే కానీ,తన మనస్సు ప్రశాంతముగా లేదు.
ఏపని చెయ్యమని చెప్పినా ‘’నేనెవరనుకున్నారు,మా తాత ఎవరో తెలుసా ,అతను ఎంత ధనవంతుడో తెలుసా మేము ఒకప్పుడు ఎలా బ్రతికేవాళ్ళమో తెలుసా ,నేను పని చెయ్యాలా " ఇలా మాట్లాడేది . 
భర్త ,అత్త రాగిణి ప్రవర్తనతో విసిగిపోయారు. ఒక రోజున రాగిణిని పుట్టింట్లో దించి, ‘’మీ అమ్మాయిని మీ ఇంట్లోనే ఉంచుకోండి’’ అని చెప్పి వెళ్లిపోయాడు. భర్త వదిలిన కొద్దిరోజులకే తెలిసింది రాగిణికీ తను గర్భవతినని. మా అత్త, మావయ్య ఎన్ని సంప్రదింపులు జరిపినా రాగిణిని తీసుకువెళ్ళటానికి ఆమె భర్త అంగీకరించలేదు. విడాకులు కోరాడు. ఇంత జరిగినా రాగిణిలో ఎటువంటి మార్పు రాలేదు. కోర్టు విడాకులు మంజూరు చేసింది.
రాగిణికి ఆడపిల్ల పుట్టింది. రాగిణి పుట్టింట్లో తన అన్న భార్య [వదిన]తో కూడా ఉండలేక,చిన్న గది అద్దెకు తీసుకుని తను చిన్న పాప తో వంటరిగా ఉంటుంది. రాగిణి భర్త కోర్టులో కేసు వేశాడు, తన బిడ్డను ,తనకు ఇప్పించమని. తన జీవితాన్నే సరిగ్గా చూసుకోలేని రాగిణి ,తన బిడ్డని సరిగ్గా ఎలా పెంచుతుందని. ప్రస్తుతము ఆకోర్టు కేసులు ,వాయుదాలు జరుగుతున్నాయి. కూతురిని నేను అల్లరుముద్దుగా,ఏ కష్టము రాకుండా పెంచుతున్నానని ,అనుకున్నానే కానీ, జీవితములో నలుగురితో ఎలా కలిసి మెలసి ఉండాలి... ఎలా సర్దుకుపోవాలి,ఇలాంటి జీవిత సత్యాలను చెప్పడము మరిచాను అని... ఈమధ్య మా అత్త ,మా అమ్మానాన్నల దగ్గరకి వచ్చి ఏడ్చుకుంటూ చెప్పిందంట.. అమ్మ చెప్పింది సంక్రాంతికి నేను వెళ్ళినపుడు .
ఫోన్ ఎంతసేపటినుండి మ్రోగుతుందో తెలియదు. ఆలోచనలనుండి ఒక్కసారి ఉలిక్కిపడి ఫోన్ ఎత్తాను. మావారు టిఫిన్ బాగుందని చెప్పడానికి చేశారు . 
మా అత్తకూతిరిలా అవకూడదు సొనల్ జీవితము. రోజాతో ,సోనల్ తో ఎలా అయినా మాట్లాడాలి. సొనల్ కి నా దగ్గర చనువే కాబట్టి తనతో కూడా ప్రవర్తన మార్చుకోమని,యోగ్యుడైన భర్త ,ప్రేమించే అత్తామామలు చక్కటి సంసారము .....వీటిని మూర్కత్వముతో మిడిసిపాటుతో దూరము చేసుకోవద్దని జీవితము అన్నాక ‘’సర్దుకుపోవాలి’’అని చెప్పాలి.. అనుకుంటూ నా దినచర్యలో మునిగిపోయాను .

Thursday, 16 February 2017

బాధ్యత

బాధ్యత
మా అమ్మ  చిన్ననాటి స్నేహితురాలు లీల ఆంటీ  మరణ వార్త ఆలస్యము గా తెలియడముతో తెలిసిన వెంటనే వైజాగు నుండి బయలుదేరి హైదరాబాదు లో ఉన్న లీల  ఆంటీ ఇంటికి నేను,అమ్మ చేరుకున్నాను.ఆ రోజు ఆదివారము కావడముతో వాసు అంకుల్  వాళ్ళ  పిల్లలు రోజీ, శ్రీను ముగ్గురు ఇంటి వద్దనే ఉన్నారు.మమ్మల్ని  చూడగానే ముగ్గురూ ధుఖం ఆపుకోలేక ఏడ్చేశారు.పిల్లలిద్దరూ అమ్మని  గట్టిగా వాటేసుకుని విడువనేలేదు.
          ‘’ అసలు ఎలా ఇలా జరిగింది,లీల ఆరోగ్యముగానే ఉంది కదా,రెండు నెలల క్రితం నేను తనతో మాట్లాడాను ,అప్పుడు నాతో తను ఏమీ చెప్పనే లేదు ,నేను కంపెనీ ప్రొజెక్ట్ పని మీద ఏడాది క్రిందట  అమెరికా వెళ్ళాను,నిన్ననే ఇండియా వచ్చాను,ప్రొజెక్టు చివరిదశలో ఉండడము వలన గత నెల రోజులు గా ఎవరితోనూ మాట్లాడలేనంత పనిలో మునిగిపోయాను,వచ్చిన వెంటనే విషయము తెలిసి ఆశ్చర్యపోయాను.వెంటనే బయలుదేరి వచ్చేశాను,అసలు ఏమైంది వాసుగారు ’’ అని అమ్మ ఒకటే  ప్రశ్నల వర్షం కురిపించింది .  ‘’మాకు విషయము తెలిసేసరికే డాక్టర్లు ఏమి చెయ్యలేమని చెప్పేసారు, తనకి కేన్సర్ చివరి దశ, తెలిసినవారు చెప్పిన డాక్టర్లు అందరికీ చూపించాను,వైధ్యము  చేయించాను, కానీ అంతా నెలరోజులలోనే ముగిసిపోయింది’’ అని వాసుగారు  బోరున విలపించారు.వింటున్న మాకు బాగా ఏడుపు వచ్చింది.ఇంకా ఏడవడానికి కన్నీళ్లే లేవన్నంతగా అందరమూ  ఏడిచాము.
                       తరువాత  లోపలికి వెళ్ళిన నాకు ఇల్లు చూస్తే ఒక్కసారిగా భయంవేసింది .ఆడది లేని ఇల్లు ఇలా ఉంటుందా అని అనిపించింది.గదులలో ఎక్కడ విడిచిన బట్టలు అక్కడే పడిఉన్నాయి.ఏవి విడిచినవో, ఏవి ఉతికినవో అర్దము కావడము లేదు.పక్క బట్టలు అలానే ఉన్నాయి.వంటగదిని చూస్తే అది స్టోర్ రూమ్ లా ఉంది. పొయ్యి  మీద బాగా జిడ్డు పేరుకుపోయి ఉంది,గట్టు మీద చీమలు తిరుగుతున్నాయి,క్రింద గచ్చు కాళ్ళకు అతుక్కుపోతుంది.ఇంకా డైనింగ్ టేబుల్ గురించి చెప్పనక్కర్లేదు,బయట నుండి తెచ్చుకున్న పోట్లాల కవర్లు,కాగితాలు అన్నీ అక్కడే పడి ఉన్నాయి.టేబుల్ తుడిచి ఎన్ని రోజులయ్యిందో అని అనుకున్నాను.రోజీ ని పిలిచి’’ ఏమిటమ్మా ఇల్లు ఇలా ఉంది  పనమ్మాయి రావడము లేదా’’ అని అమ్మ  అడిగింది ,‘’ఏమో ఆంటీ నాకు తెలియదు’’ అని సమాదానము ఇచ్చి వెళ్లిపోయింది.ఆ మాట విన్న వాసుగారు  ‘’హైదరాబాదు లో పనివాళ్ళ గురించి మీకు తెలియనిది ఏముంది,దొరకడమే  కష్టము,ఒకవేళ దొరికినా సమయానికి రారు,వాళ్ళు వచ్చిన సమయానికి మేము ఇంట్లో ఉండము,లీల ఉంటే తానే చూసుకునేది,ఎన్ని రోజులని నేను ఆఫీసుకి సెలవు పెట్టి ఇంట్లో ఉంటాను,ఈ రోజు ఆదివారము కదా ఎవరైనా దొరికితే పని చేయిద్దామని చూస్తున్నాను’’ అని బయటికి చూస్తున్న వాసు గారి తో ‘’మరి వంట ఎవరు చేస్తున్నారు’’ అని అడిగింది. ‘’ఏముంది మూడు పూటలా బయట నుండి తెచ్చుకుని తింటున్నాము’’ అని విరక్తిగా సమాధానము ఇచ్చిన వాసుగారితో ‘’అదేమిటి రోజీకి ఏమీ చేయడము రాదా?’’  అని అడిగింది.’’రోజీనా! అది ఇంకా చిన్న పిల్ల తనకేమి తెలుస్తుంది, మీకు టిఫిన్ తెస్తాను ఉండండి’’ అని చెప్పి బయటకి వెళ్ళిపోయారు అంకుల్.
              ఇవి అన్నీ వింటున్న నాకు ఒక్కసారిగా తలతిరిగినట్లు అనిపించింది. మా అమ్మ ఎప్పుడూ నన్ను ఆపని చెయ్యు,ఈ పని చెయ్యు అని చెబుతుంటే విసుగుకునేదాన్ని.ఎందుకమ్మా అలా ఏదో ఒక పని చెబుతూనే ఉంటావు పెళ్లయ్యాక నీలా ఎలాగూ చెయ్యక తప్పదు కదా! అప్పుడు చేస్తాలే ఇప్పుడు వదిలేయ్ నన్ను అని అనే దాన్ని .కాని మా అమ్మ అలా కాదు నీ పనులు నీవే చేసుకోవాలి,ఎవరి మీద ఆదారపడకూడదు,అన్నీ పనులు నీకు వచ్చిఉండాలి ,భాద్యతగా అన్నీ చేసుకోవాలి అని నాకు పనులు నేర్పించింది.అయిష్టముగానైనా కొన్ని పనులు నేర్చుకున్నాను .మా అమ్మ పని చెప్పిన ప్రతీసారీ నేను విసుగుకోవడం అయిష్టముగా చేయడం మా అమ్మ నాకు నచ్చ చెప్పడము అన్నీ ఒక్కసారిగా మా కళ్ళముందు కదలాడాయి.రోజీ ఇంజనీరింగు మొదటి సంవత్సరము,శ్రీను పదవతరగతి చదువుతున్నారన్నమాటే గాని వాలిద్దరికి  ఏమీ తెలియదు,ఆశ్చర్యకరమైన విషయము ఏమిటంటే రోజీ కి తను వేసుకోవలసిన బట్టల ఎక్కడ ఉన్నాయో ,ఏవి వేసుకోవాలో కూడా తెలియదు.ఏది అడిగినా ఏమో ఆంటీ నాకు తెలియదు,అన్నీ మా అమ్మే చూసుకుంటుంది అని ఒకే ఒక్క సమాదానము చెబుతుంది.తెలిసిందల్లా కాలేజీ కి వెల్లడము ,రావడము అంతే అది తప్ప ఇంకేమీ తెలియదు.
              లీల ఆంటీ  పిల్లలిద్దరికీ ఏపనీ నేర్పకుండా,చెప్పకుండా అన్నీ తనే చేసిపెట్టేది అంట,వాళ్ళకు బ్రష్ ల దగ్గర నుండి పడుకునే పక్క దుప్పట్ల వరకూ అన్నీ తనే వాళ్ళకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకునేదంట.తను  ఉన్నన్నాళ్లు బాగుండేది, తను చనిపోగానే ఒక్కసారిగా ఇల్లు ఎలా అయిపోయిందో,వాసు అంకుల్ కి అన్నీ కాళ్ళ దక్కరికి తెచ్చిపెట్టేదంట .ఒకసారి అమ్మ  ఇవన్నీ గమనించి  లీల అంటీని అడిగిందంట   ‘’ఎందుకే అన్ని సేవలు చేస్తావు,కాస్త వాళ్ళపని వాళ్ళని చేసుకోనివ్వు’’అని .‘’పోనీలేవే ఆయన పొద్దున్న నుండి ఆఫీసు లో కష్టపడి వస్తారు ఆ మాత్రము చేస్తే అలిసిపోతానా ఏంటి,ఇంకా పిల్లలంటావా వాళ్ళు చదివి,చదివి అలిసి పోయి వస్తారు,ఇంకేమీ చేస్తారు?నేను ఎటూ ఇంట్లోనే ఉంటాను కదా’’అని చిరునవ్వు తో సమాధానము ఇచ్చిందంట.ఆ మాట నాకు చెబుతూ లీలా ఆంటీ గుర్తుకు వచ్చిందేమో  అమ్మ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
                         వాసు అంకుల్ తో అమ్మ” రోజీ కి అన్నీ నేర్పించండి,తను ఇంకా చిన్న పిల్ల కాదు,ఇలా అయితే కష్టము” అని,చాలా విషయాలు చెప్పింది. అన్నింటికీ అంకుల్ సరే అని అన్నారు ఏమో ఏమి చేస్తారో మరి,పాపం రోజీ ని తలుచుకుంటే బాధ అనిపించింది నాకు ,ఇన్నాళ్ళు ఏ కష్టము తెలియకుండా పెరిగింది ,ఇప్పుడు భాద్యతలన్నీ ఒక్కసారిగా మీదపడేసరికి ఎలా ఉక్కిరిబిక్కిరి అవుతుందో పాపం.అమ్మో!నేను మాత్రం మా అమ్మ చెప్పినట్లు అన్నీ నేర్చుకుంటాను.పని చేయవలసిన అవసరము ఉన్నా లేకపోయినా ముందు నేర్చుకోవాలి.ఏ సమయానికి ఏ అవసరము వస్తుందో,ఏ భాద్యత నెత్తిమీద పడుతుందో,అమ్మ చెబుతుంటే తేలికగా తీసుకున్నాను,రోజీ పరిస్థితి చూశాక అర్ధము అయ్యింది నాకు పెద్దలు,అమ్మ ఏది చెప్పినా మన మంచికే చెబుతారు అని.
(ఈ కథ గో తెలుగు .కామ్ అనే అంతర్జాల పత్రిక లో ఆగస్టు నెల 2016 న ప్రచురిత మయ్యింది.)

Tuesday, 30 August 2016

అనుభందాల సుమాలు

అనుబంధాల సుమాలు

శోదించకు నీ జన్మకు కారణాన్ని,పరిశోదించు నీ జన్మకు సార్ధకతను ;
అందించే చేయి కోసం ఎదురుచూడకు,వేచి ఉన్నవారికి అందించు నీ అభయహస్తాన్ని ;
వాల్చే శిరస్సులు ఎన్ని ఉన్నా,ఓదార్చే భుజము నీదే కావాలి;
స్మరించు మదర్ థెరీసా సేవను,అందించు అలానే నీవు కూడా సేవలు;
పగ ప్రతీకార జ్వాలాల నడుమ అనుబంధాల సుమాలు కురిపించు ;
అంతరించిపోతున్న ప్రాచీన సాంస్కృతిక ,సాంప్రదాయాల వైభవాన్ని గుభాళింపజేయు ;
గతమన్నది నీకు అనుభవం ,వర్తమానానికి విధ్యార్ధివి ,భవిష్యత్తుకి సూత్రధారివి;
గుర్తించు ,ఎందరో పుణ్యమూర్తులను కన్న ఈ భరతభూమికి ,నీ జననానికి ఉన్న అనుబంధాన్ని ;
గర్వించు ఈ పుణ్యభూమి లో నీ జననానికి ;
నిలవాలి చిరస్థాయిగా అందరి హృదయాలలో నీవు, ఇదే నా అభిలాష.

ఈ కవిత సాహితీ కిరాణం అనే మాస పత్రికలో ప్రచురితమయ్యింది .ఆగస్టు 2016

లేఖ

చిన్ననాటి స్నేహితురాలికి లేఖ
                                                                                                                      తారీఖు
                                                                                                                      శ్రీకాకుళము.
నా ప్రియ సఖి ,ఇష్ట సఖి ,ప్రాణ సఖి అయిన పూర్ణిమకు,
                                  నీ స్నేహితురాలు ప్రవీణ వ్రాయు లేఖ. ఉభయ కుశలోపరి. నిన్ను చూడాలని, నీతోమన చిన్ననాటి  ముచ్చట్లు పంచుకోవాలని నా మనస్సు ఉవ్విళ్లూరుతుంది. నీకు మన పాఠశాలలో మనము గడిపిన ఆ మధురమైన రోజులు గుర్తున్నాయా............,నాకు ఇప్పటికీ ఆ దృశ్యాలు కళ్ల ముందు కదలాడుతున్నవి .
             అవి శ్రీకాకుళము  విశాలాంధ్ర చిల్డ్రన్ స్కూల్ లో చదువుకునే రోజులు. నేను నా చదువును అక్కడే ప్రారంభించాను. చదువు,స్నేహితులు,పాఠశాల అంతా బాగున్నా ఏదో వెలితిగా అనిపించేది. స్నేహితులు ఉన్నా నాతో చదువులో పోటీ పడేవారే తప్పా ,నా మనసెరిగి నా భావాలను పంచుకునే స్నేహితురాలు ఎవరూ లేక మదనపడుతున్న తరుణములో నాకు ఒక దేవదూతలా నువ్వు [పూర్ణిమ] తారసపడ్డావు.నా ప్రియ సఖివైనావు,నా చేయి పట్టుకున్నావు,నన్ను సన్మార్గములో నడిపించావు,నీవు పలికిన మెత్తని కుసుమాల వంటి వాక్కులు నామదిని  ఉల్లాసపరిచాయి.నా కష్టసుఖాలలో సగభాగం పంచుకున్నావు. మన స్నేహాన్ని చూసి ఓర్వలేని ఎందరో మన స్నేహాన్ని చెదరగొట్టడానికి ప్రయత్నించి విఫలులు అయ్యారు.పాఠశాల వార్షికోత్సవము నాడు మనము ప్రదర్శించిన నాట్యాలు,ఆటల పోటీలలో మనము గెలుచుకున్న పుస్తకాలు అన్నీ నాకు గుర్తున్నాయి.పరీక్షల సమయములో టీచరుకి కనబడకున్నా కాపీ కొట్టడానికి మనము పడిన అగచాట్లు గుర్తుకొస్తే నవ్వు వస్తుంది ఇప్పుడు.మధ్యాహ్న భోజనములో మీ అమ్మ చేసిన నువ్వుల పొడుము నేను,మా అమ్మ చేసిన చల్లపిప్పి నువ్వు భలేగా  తినేవాల్లము కదా!.నీ రిక్షా వచ్చేవరకు నీకు నేను తోడుగా ఉండేదాన్ని.అప్పుడప్పుడు మనిద్దరము కలిసి మీ నాన్న గారు పని చేస్తున్న బ్యాంక్ కి వెళ్ళి చల్లటి నీళ్ళు తాగే వాల్లము. ఇద్దరిలో ఎవరు పాఠశాలకి రాకపోయిన ఇద్దరూ తల్లడిల్లే   వాల్లము.నాకు నువ్వు లెక్కలు నేర్పేదానివి ,నేను నీకు సైన్స్ నేర్పించేదాన్ని.ఇలా మనము సంతోషముగా గడుపుతున్న సమయమున, మనసు లేని ఆ దేవుడు మన ఆనందాన్ని చెదరగొట్టలేక మనల్ని వేరు చేశాడు.మీ నాన్నగారికి రాజమండ్రి కి బదిలీ అయ్యింది. చెరొక  వైపు చేరినాము. మధ్యలో వచ్చి మధ్యలోనే వెళ్లొపోయావు.నేను నా పదవతరగతి వరకు అక్కడే చదివాను. మనము విడిపోయినా, ఉత్తరాల ద్వారా కలుసుకునే ఉందామని బాసలు చేసుకున్నాము.
            నాకు పెళ్లి జరిగిన వరకు మనము ఉత్తర,ప్రత్యుత్తరాలు కొనసాగించాము. “నీ పెళ్ళికి రాలేకపోతున్నందుకు నన్ను క్షమించు” అని ఉత్తరము వ్రాసావు. అదే నీ నుండి నాకు అందిన చివరి లేఖ. ఆతరువాత ఎన్ని లేఖలు వ్రాసినా నీ వద్ద నుండి జవాబు లేదు,ఏమయిపోయావు పూర్ణి! నీ చిరునామా కోసము ఎంతగానో ప్రయత్నించాను.లేఖల ద్వారా,ఫోన్ల ద్వారా,స్నేహితుల ద్వారా ఇలా రకరకాలుగా ప్రయత్నించి అలసి పోయాను.చివరికి ఫేస్ బుక్ లోను ప్రయత్నించాను. అందులో నీ పేరుతో రెండు వేలమంది ఉన్నారు. అన్నీ ఓపికగగా,ఎంతో ఆశ గా వెతికాను. కానీ నా ఆశ అడియాస అయ్యింది. నీ జాడ తెలియలేదు.అలసిపోయాను పూర్ణి.చివరగా ప్రతిలిపి.కాం ద్వారా,బాబు కోయిలాడ గారి ద్వారా నీ ఆచూకీ తెలుసుకుని నిన్ను చేరుకోవచ్చనే ప్రగాడమైన నమ్మకం,విశ్వాసము,ఆశయము ద్వారా ఆశగా,ఆతృతగా ఈ లేఖను వ్రాస్తున్నాను.ఈ లేఖని చదివి నీవు ఎక్కడున్నా నన్ను కలుస్తావని నా కను చివరల దాగి ఉన్న నమ్మకాన్ని ఒమ్ము చేయకు మిత్రమా!
                                                                                                   ఇట్లు
                                                                       నీకోసం చకోర పక్షిలా ఎదురు చూస్తున్న నీ ప్రియ సఖి
                                                                                             ప్రవీణ.

  
                                                                                               

ప్రతిలిపి వారు నిర్వహించిన లేఖల పోటీలో ద్వితీయ బహుమతి గెలుచుకున్న లేఖ

Saturday, 30 July 2016

ఆశ

ఆశ   
            నేను పుట్టగానే మా అమ్మ పొత్తిళ్లలో హాయిగా నిదురించిన అలనాటి ఆ అనుభూతిని పొందాలని ఆశ
            మా అమ్మ ప్రేమగా తన ఒడిలోకి తీసుకుని తొలిసారిగా నన్ను ముద్దాడిన  ఆ చుంభన స్పర్శ పొందాలని ఆశ
             తను తండ్రి అయిన గర్వాన లాలనగా నన్ను తన చేతులలోకి తీసుకుని నా నుదుటన తొలి చుంభన చేసిన                                ఆ దృశ్యము చూడాలని ఆశ    
నేను ఎందుకు ఏడుస్తున్నానో తెలియక కంగారు పడిన మా అమ్మానాన్నల తపన చూడాలని ఆశ
నన్ను ఎత్తుకుని చందమామని చూపిస్తూ గోరుముద్దలు తినిపించిన అమ్మ చేతి కమ్మదనాన్ని ఆస్వాదించాలని ఆశ
తన భుజము మీద నన్ను నిద్రబుచ్చుతూ తనూ నిద్రలోకి జారుతున్న మా నాన్న చేతి లాలన పొందాలని ఆశ
తప్పటడుగులు వేస్తూ వడివడిగా పడుతూ లేస్తూ ఉన్న ఆనిమిషాన మా అమ్మ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని ఆశ
ముద్దుముద్దుగా నేను పలికే తొలి పలుకులను వింటున్న నాన్న ఆసక్తి ని చూడాలని ఆశ
జ్వరమొస్తే కంగారుగా డాక్టరు దగ్గరకు పరుగెత్తి నన్ను కోలుకునేటట్లు చేయమని డాక్టరు ని ప్రాదేయపడుతున్న నాన్న వేధన చూడాలని ఆశ
అక్షరాభ్యాసము రోజున నాన్న ఒడిలో కూర్చుని తన చేతితో ఓంకారాన్ని చుడుతున్న ఆ శుభతరుణాన్ని వీక్షించాలని ఆశ
ఇటువంటి ఎన్నో తిరిగిరాని మరపురాని  అనుభూతులను   మళ్ళీ పొందాలని ఆశ.   
                                     

ఈ కవిత సిరిమల్లె పత్రికలో జూలై 2016 నా ప్రచురితమయ్యింది

Tuesday, 17 May 2016

చూపులు

చూపులు
తొలి చూపులో నిను నేను సరిగా చూడలేదు ,   
మలి చూపులో చూద్దామని కనుపాప కదిపితే నీవు నన్నే చూస్తున్నావు,
నును సిగ్గుతో తల దించాను,
నీ సమ్మోహనశక్తి నా మనసుని ఆకర్షించింది ,
స్థిర ముద్ర పడింది,
ఏది చూసినా,ఎటువైపు చూసినా నీవే,ఎదంతా నీవే,
చిరు చూపుతో చేసుకున్నావు,నా హృదయాన్ని సొంతం.
అభినయ నయనాల సోయగాడ ,
చిరుచూపు ముసిముసి జల్లువాన కురిపించావు,
నా  ఎద తడిసింది ఆ వానలో,
నీ త్వరితానికి తబ్బిబ్బింది నా స్వాంతనము,
  నీ   నగుమోము ,చిరుదరహాసం,
ఉప్పొంగించింది  నా మనసును,
నాలో రేగే భావాల ఆనకట్టవు నీవు,
నా ఆశల కెరటాలలను దరిచేర్చుకునే ఒడ్డువి నీవు,
నీవు ఎదుట పడితే నా మది లయ తప్పుతుంది
నీవు కనుమరుగైతే నా కలము కదలదు
నీ ఆశాకుసుమాల మాలలో నేను దారమవుతాను,
నీ వేణువులో రాగాన్నై ఉప్పొంగుతాను,
నీ నయనాలలో దీపాన్నై వెలుగుతాను,
నీ హృదయములో శ్వాసనై నిలుస్తాను,
నీ అడుగులో అడుగునై నడుస్తాను,
మన ఊహల సరిగమల పల్లకిని పదనిసల శ్రీకారం చేద్దాము

ఈ కవిత సుజనరంజని అనే అంతర్జాల పత్రికలో ప్రచురింపబడింది మే 2016 సంచికలో

http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/may2016/kavitha3.html

Sunday, 8 May 2016

Amma

అమ్మ
ఏమని  ఎలా వర్ణించను అమ్మ నిన్ను ,కవులు నాకు ఏ పదము విడువలేదు నిన్ను వర్ణించడానికి ,నా ఊపిరి ఉన్నంతవరకు నా ఉచ్వాస ,నిశ్వాస లలో నిన్నే తలుస్తాను ,ఇది ఆ భగవంతుడు నాకు ఇచ్చిన అపురూపమైన కానుక .
ప్రవీణ