Wednesday 9 March 2016

అర్దరాత్రి

అర్దరాత్రి
ఒకప్పుడు ఎంతో ప్రశాంతముగా ఉండేది ,
ఎంతో ఆనందముగా ఉండేది ,
ఏకాంతముగా ఉండేది ,నిశ్శబ్దముగా ఉండేది,
సూది పడినా ఉలిక్కిపడేది ,
తనని తాను తలచుకొని గర్వపడేది ,
తనంత అదృష్టవంతురాలు ఎవరులేరనుకునేది ,
తాను మాత్రమే కాక అందరికీ ప్రశాంతతను,ఆరోగ్యాన్ని ఇస్తున్నానని తనలో తానే సంతోష పడేది ,
కాని ఆ అర్దరాత్రికే దిష్టి తగిలింది ,
ఆ ఆనందము,ఏకాంతము,ప్రశాంతత అన్నీ మాయమయిపోయాయి ,
షికారు కోసం  పాపం, రోడ్డు మీదకి వెళ్లింది అర్దరాత్రి ;అక్కడ వాహనాల హోరు,కుక్కల అరుపులు,
పరుగెత్తుకొని ఒక ఇంట్లో దూరింది,అక్కడ మొబైల్ ఫోన్ల మెసేజెల కిచకిచలు ,మాటలు.
పక్కన బార్యభర్తల మద్య ప్రశాంతత వెతుక్కుంది ,కానీ అక్కడ గొడవలే ;పొలాల వైపు పరుగెత్తింది ,అక్కడ నీళ్ళ మోటర్ల శబ్దాలు,
లాభం లేదని ,ఎత్తయిన భవనాల వైపు పరుగు తీసింది ;అక్కడ సెల్ టవర్ల వైబ్రేషన్లు ,బార్లలోన ,క్లబ్బులలోన ,ఇలా ఎక్కడ చూసినా శబ్దాలే ,అర్దరాత్రికి నిశ్శబ్దమే కరువయ్యింది.
అరణ్యానికి వెళ్లింది, అక్కడ మానవుడు చెట్టులు ,కొండలు కొట్టి బిల్డింగులు కట్టేశాడు.
అర్దరాత్రి దిగులు పడింది ,తనకి రోజులు అయిపోయాయని ,మౌనము గా ఈ దేశాన్ని వదిలి దూరముగా వెలిపోదామని అనుకుంది, వెళ్లిపోయింది మనందరిని వదిలి,కాదు మనమే దూరం చేసుకున్నాము,అర్దరాత్రిని,నిశ్శబ్దాన్ని,ప్రశాంతమయిన నిద్రను ,జీవితాన్ని........                      *****************

ఈ కవిత సుజనరంజని అనే అంతర్జాల పత్రిక లో ప్రచురింపబడినది ,మార్చి 2016 సంచికలో

http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/march16/

No comments:

Post a Comment